ఇది సమంజసమా… చంద్రబాబు ?

Spread the love

– శాసనసభ బడ్జెట్‌ సమావేశాల తొలి రోజున టీడీపీ సభ్యుల ప్రవర్తనపై చీఫ్‌ విప్‌ జి.శ్రీకాంత్‌రెడ్డి

ఇది సమంజసమా? చంద్రబాబుగారు తమ పార్టీ సభ్యులకు శిక్షణనిచ్చి పంపించారు. అందుకే వారు రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి అని కూడా గవర్నర్‌గారిని గౌరవించకుండా, అసలు ఆయన ప్రసంగంలో ఏముందో కూడా చూడకుండా, ఆ ప్రసంగ ప్రతులను ఆయన కళ్ల ముందే చించేసి, నినాదాలు చేస్తూ ముందుకు దూసుకుపోయి ఆయనపైనే దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇది సమంజసమా? నిజానికి మీరు వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారు. ఆ విషయం మీకు కూడా తెలుసు. అయినా మీకు పదే పదే వ్యవస్థల గురించి మాట్లాడతారు. అయితే ఇవాళ మీరు వ్యవహరించిన తీరు ఎంత సంస్కారహీనమో, ఎంత సమంజసమో ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించండి.

బీఏసీ కూడా జరక్కుండానే..!:
పార్టీ పరంగా మీకు ద్వేషముంటే రైజ్‌ చేయండి. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే మాట్లాడే అవకాశం ఇస్తామని కూడా చెప్పాం. కనీసం బీఏసీ సమావేశం కూడా జరగకముందే, ప్రిప్లాన్డ్‌గా వచ్చి సభలో హీనంగా ప్రవర్తించారు. సభ గౌరవాన్ని పెంచాలని మేము నిరంతం ప్రయత్నిస్తుంటే మీరు దాని విలువను దిగజార్చేలా వ్యవహరిస్తున్నారు.

గవర్నర్‌ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు కదా? అయినా మీరు అలా ప్రవర్తించారంటే మీ వ్యూహం ఏమిటన్నది అర్ధమవుతుంది. మీకు ప్రజా సమస్యలు పట్టవు. అసలు వాటి గురించి ఆలోచించరు. ఎంతసేపూ మీకు ప్రచారం కావాలి.

అదే మీ లక్ష్యం:
ప్రజలకు కావాల్సిన వాటిని చర్చించడం కోసం మీరు సభకు రావడం లేదు. ఎంతసేపూ మీకు హడావిడి కావాలి. రాజధానిలో మీ బినామీల భూముల విలువలు కాపాడుకోవడమే మీ లక్ష్యం. అంతేతప్ప మీకు వేరే పనేం లేదు. ఈ మూడేళ్లలో మీరు ప్రతిపక్ష పాత్రగా పోషించింది ఏమిటంటే, ఇక్కడ మీ బినామీలను రక్షించుకోవడం.

మీరు ఏనాడూ రైతుల గురించి మాట్లాడలేదు. రైతుల ముసుగులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు చేస్తున్న డ్రామాలు చూస్తుంటే అదే అర్ధమవుతుంది. నిజానికి గవర్నర్‌గారి ప్రసంగంలో అన్నీ వాస్తవాలు ఉన్నాయి. కానీ వాటిని మీరు జీర్ణించుకోలేరు. అందుకే ఈ డ్రామాలు.

మా ఎజెండా ఇలా ఉంటుంది అని చెప్పడానికే బీఏసీ సమావేశానికి అచ్చెన్నాయుడుగారు వచ్చారు. వారు ఇచ్చిన ప్రతి అంశంపై చర్చిద్దామని మేము స్పష్టంగా చెప్పాము.

గతంలోనూ ఇలాగే:
గత సమావేశంలో కూడా టీడీపీ వైఖరి అలాగే ఉంది. సభలో ఆరోజు వేరే అంశం చర్చించాల్సి ఉన్నప్పటికీ, టీడీపీ కోరిన అంశానికి ప్రాధాన్యం ఇచ్చాం. దానిపై చర్చకు ఓకే అన్నాం. కానీ చంద్రబాబు కావాలని సభలో అప్రస్తుత విషయాన్ని ప్రస్తావించారు. కుప్పంలో తన ఓటమిపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. దానిపై అభ్యంతరం వ్యక్తం చేస్తే, సభలో గందరగోళం సృష్టించారు. మా పార్టీ వారు అనని మాటను అన్నట్లు దుష్ప్రచారం చేశారు. నిజంగా ఆ మాట అని ఉంటే, రికార్డులో చూపాలని కోరాం.
కానీ అందుకు టీడీపీ సమాధానం చెప్పలేదు. ఆ తర్వాత చంద్రబాబు చేసిన డ్రామా అంతా చూశాం. మీడియా ముందు వెక్కి వెక్కి ఏడ్చారు.

అన్నీ చర్చించడానికి సిద్ధం:
సభలో ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దాదాపు 25 అంశాలపై చర్చ జరగాలని మేము కోరాం. వారు కూడా ఒక 20 అంశాలపై చర్చ కోరుతున్నారు. అయితే మా కంటే కూడా వాటికే అధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్పాం.

అదే విధంగా సభలోటీడీపీ వ్యవహరించిన తీరుపై బీఏసీలో అచ్చెన్నాయుడుగారిని అడిగాం. అందుకు విచిత్రంగా, మమ్మల్ని ఆయన నిందించారు. గత శాసనసభలో వైయస్సార్‌సీపీ ఆ పని చేసిందని అచ్చెన్నాయుడు ఆరోపిస్తే, ఆ పని చేసి ఉంటే, మేము ఇవాళ రాజీనామాకు సిద్ధమని సవాల్‌ చేస్తే, వెంటనే ఆయన మాట మార్చారు. దేశంలో ఎక్కడో అలా జరిగిందంటూ దాటవేశారు. దాన్ని బట్టి వారు ఎలా ప్రవర్తిస్తున్నారో అర్ధం అవుతుంది. వారికి ఏనాడూ ప్రజల సమస్యలు పట్టవు. గతంలో కూడా వారు సభలో అన్నీ తప్పుడు లెక్కలు చెప్పి, ప్రభుత్వాన్ని నిందించారు. పైగా దాన్నీ సమర్థించుకున్నారు. తమ విధానం అదే అని చెప్పారు.

కానీ వారిది అదే విధానం:
వారికి ఏ విషయంలోనూ చిత్తశుద్ధి లేదు. ఎంతసేపూ ప్రచారయావ తప్ప. దాని కోసం ఎంతకైనా దిగజారుతారు. వారు ఎన్ని దుర్మార్గ చర్యలు చేసినా, ప్రజల కోసం మేము అన్నీ భరిస్తాం. దేనిపైన చర్చ జరిగినా సమాధానం ఇస్తామని చెప్పాం. అయితే తాము ఏయే అంశాలపై చర్చ కోరుతామన్నది కాకుండా, తమ విధానం ఇలాగే ఉంటుందని బీఏసీ సమావేశంలో అచ్చెన్నాయుడు చెప్పారు.

అందుకే మేము వారిని ఒకటే కోరుతున్నాం. తమ నాయకుడి దగ్గరకు వెళ్లి ఇవాళ తాము చేసిన దానికి సిగ్గుపడ్డామని చెబితే, కనీస గౌరవం ఉంటుంది. లేకపోతే ప్రజలు వారికి ఎప్పటికీ క్షమించబోరు.వ్యవస్థల గౌరవం గురించి మాట్లాడుతున్న టీడీపీ సభ్యులు ఇవాళ సభలో వ్యవహరించిన విధానాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి.

మాట్లాడే అవకాశం ఇస్తున్నా..:
వారి సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, మాట్లాడే అవకాశం ఇస్తున్నాం. దాన్ని వారు సద్వినియోగం చేసుకోవడం లేదు. అంశాల వారీగా కాకుండా, ఎంతసేపూ విమర్శలు. రెచ్చగొట్టడమే వారికి పరిపాటిగా మారింది.

9వ తేదీన విరామం:
మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంపై శాసనసభ రెండో రోజైన 8వ తేదీ మంగళవారం సంతాప తీర్మానం ప్రవేశపెడతాం. ఆ మర్నాడు ఆయన మరణంపై సంతాపసూచకంగా 9వ తేదీన సభకు విరామం ఇస్తున్నాం. ఆ మర్నాడు 10వ తేదీన గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఉంటుంది. 11వ తేదీన బడ్జెట్‌ ప్రవేశపెడతాం. అప్పటి నుంచి సభ 13 నుంచి 14 రోజులు నడిచే అవకాశం ఉందని చీఫ్‌ విప్‌ జి.శ్రీకాంత్‌రెడ్డి వివరించారు.

Leave a Reply