-
ఆయన ప్రజా ప్రతినిథా? రౌడీనా?
-
అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వ్యాఖ్య
మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆయుధాలను తిరిగి వెనక్కి ఇవ్వొద్దని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఎన్నికలకు ముందు తన దగ్గర ఉన్న బోర్ పిస్టల్, రివాల్వర్, డబుల్ బ్యారెల్ గన్ పోలీసులు తీసుకున్నారని తిరిగి వాటిని తనకు ఇప్పించాలని హైకోర్టులో వేసిన పిటీషన్ దాఖలు గూర్చి పత్రికల్లో చూసి విస్తుపోయానని తెలిపారు. ఆయన ప్రజాప్రతినిథా? రౌడీనా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
పుంగనూరును అడ్డా చేసుకొని, ఆయుధాలు చేతబట్టి వీళ్ళు గుండాగిరీ చేస్తున్నారా? అని ప్రశ్నించారు.మూడేసి ఆయుధాలు ఇచ్చి ఇలాంటి వారిని రాజకీయాలలో ప్రోతాహిస్తే, గనులు దోయకుండా,ఇసుకను బొక్కకుండా ఎలా ఉంటారు? అని ప్రశ్నించారు. అమరావతి ఉద్యమంలో ప్రాణాలను ఫణం పెట్టిన పోరాడిన మాకు ప్రభుత్వం ఎలాంటి రక్షణ ఇవ్వలేదని గుర్తు చేశారు. ఆయుధాలతో తిరుగుతూ ప్రజాప్రతినిధిగా పెద్దిరెడ్డి చెలామణి కావటం ప్రజాస్వామ్యానికే తీరని అవమానం అంటూ విరుచుకుపడ్డారు. ప్రభుత్వం పెద్దిరెడ్డికి ఆయుధాలు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని బాలకోటయ్య విజ్ఞప్తి చేశారు.