– భారీ విజయం సాధించేలా ఎమ్మెల్యేలు చొరవచూపాలి
– ఎమ్మెల్సీ ఎన్నికల్లోగా ప్రతి ఓటరును నేరుగా కలవాలి
– గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రి లోకేష్ సమీక్ష
అమరావతి: ప్రతిపక్షం పోటీలో లేదు కదా అని నిర్లక్ష్యం వద్దు, పార్టీ నేతలంతా రాబోయే వారంరోజులు చురుగ్గా పనిచేయాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఉభయగోదావరి, గుంటూరు – కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ నేతలతో మంత్రి లోకేష్ ఉండవల్లి నివాసంలో సమీక్షించారు.
ఈ సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ…. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ లోగా ప్రతి ఓటరును పార్టీ నేతలు నేరుగా కలవాలి, అభ్యర్థులను గెలిపించేలా చొరవ చూపాలన్నారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి ఎమ్మెల్యేలు కీలక భూమిక వహించాలన్నారు. పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించేలా కృషిచేయాలని అన్నారు. కూటమి నేతలను కలుపుకొని వెళుతూ ప్రచారం సాగించాలన్నారు. టెలీకాలింగ్, ఐవిఆర్ ఎస్ ద్వారా ఓట్లను అభ్యర్థించాలని సూచించారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే 67 నియోజకవర్గాల్లో క్లస్టర్ స్థాయి నుంచి నియోజకవర్గస్థాయి వరకు ఈ ఎన్నికను సీరియస్ గా తీసుకోవాలన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ… రేపటినుంచి పార్టీ అభ్యర్థుల విజయం కోసం ప్రణాళిక అమలుచేస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో ఎంపి భరత్, ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవి, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి, జోనల్ కోఆర్డిటర్ సుజయకృష్ణ రంగారావు, మంతెన సత్యనారాయణరాజు, దామచర్ల సత్య, పెళ్లకూరి శ్రీనివాసులు రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు అశోక్ బాబు, ఎఎస్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.