– ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
విజయవాడ : 19 ఏళ్ల ఆరోగ్యశ్రీ చరిత్రలో నేడు దుర్దినం. చేసిన వైద్యానికి బిల్లుల ఇవ్వాలని ఆసుపత్రులు రోడ్డెక్కడం విచారకరం. 2700 కోట్లు బకాయిలు పెట్టడం దుర్మార్గమని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆమె గురువారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంత జరుగుతున్నా మౌనం వహించడం చంద్రబాబు మూర్ఖపు చర్యకు నిదర్శనం. వైద్యం అందక జనం గగ్గోలు పెడుతుంటే చోద్యం చూడటం అత్యంత దారుణం. 15 రోజులుగా సేవలు నిలిపేసి లక్షమంది రోగులను తిప్పి పంపించారని షర్మిలా ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె ఇంకా, ఏమన్నారంటే…
సర్జరీలు జరగక పేదలు నానా అవస్థలు పడుతున్నారు. అయినా బిల్లుల చెల్లింపుకు కూటమి ప్రభుత్వానికి మనసు కరగలేదు. వారి ఆర్తనాదాలకు పట్టింపు లేదు. ఇది ఆరోగ్యశ్రీ ని నిర్వీర్యం చేసి పూర్తిగా చంపే కుట్రనే. పెదోడికి ఉచిత వైద్యం దూరం చేయాలని చూడటమే. వైద్యం కోసం మళ్ళీ ఆస్తులు అమ్ముకోవాలని చెప్పకనే చెప్తున్నారు. బకాయిల చెల్లింపునకు ప్రభుత్వమే బేరసారాలకు దిగడం సిగ్గుచేటు. చేసిన వైద్యానికి బిల్లులు పెండింగ్ పెట్టడం కూటమి ప్రభుత్వ దిక్కుమాలిన చర్యకు అద్దం పడుతుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబుని కాంగ్రెస్ పార్టీ పక్షాన మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. స్ట్రెచర్ పైనున్న ఆరోగ్యశ్రీ భారాన్ని వెంటనే దించండి. సంజీవనిలాంటి ఆరోగ్యశ్రీ ని అనారోగ్యశ్రీ గా మార్చకండి. పథకానికి రాజకీయాలను ఆపాదించకండి. 250 కోట్లు ఇచ్చినంత మాత్రానా ప్రజారోగ్యంపై మీకు ప్రేమ ఉన్నట్లు కాదు. చిల్లర విదిలించి చేతులు దులపాలని చూడటం భావ్యం కాదు. వెంటనే 2,700 కోట్లు విడుదల చేయాలి. ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్ధరించాలి. ఆరోగ్యశ్రీ అందక రాష్ట్రంలో ఏ ఒక్కరు మృత్యువాత పడినా .. అవి ప్రభుత్వం చేసిన హత్యలుగానే పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాం.