– మరో 32 మంది వైద్యసిబ్బంది బదిలీ
– వైద్య సేవల కొనసాగింపు, వైద్య విద్యా బోధన, పరిపాలనా అవసరాల మేరకు బదిలీలు
– ముగ్గురు జిల్లా కలెక్టర్ల వినతిమేరకు ఇటీవల బదిలీ అయిన ఆరుగురి కొనసాగింపు
అమరావతి: వైద్యారోగ్య మంత్రిత్వ శాఖలోని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం నూతన డైరెక్టర్ (డిపిహెచ్)గా డాక్టర్ పద్మ శశిధర్ నియమితులయ్యారు. రాజమహేంద్రవరంలో రీజనల్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఈమెను ప్రస్తుత డిపిహెచ్ డాక్టర్ పద్మావతి స్థానంలో నియమించారు. పరిపాలన అవసరాల మేరకు వచ్చిన బదిలీ ప్రతిపాదనల్లో భాగంగా ఈ నియామకాన్ని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ శుక్రవారంనాడు ఆమోదించారు.
తక్కువ వైద్య సిబ్బంది ఉన్న కొన్ని ఆసుపత్రుల్లో తగు స్థాయిలో వైద్య సేవల కొనసాగింపు మరియు వైద్య విద్యా బోధన అవసరాలు, పాలన సౌలభ్యం నిమిత్తం ఇటీవల జరిగిన బదిలీలకు అదనంగా మరో 33 మంది వైద్య సిబ్బంది బదిలీని మంత్రి ఆమోదించారు. ఇందులో పాడేరు ప్రభుత్వ కళాశాలలో గతేడాది నియమించబడి, వారికిచ్చిన హామీ మేరకు వారి పూర్వ స్థానాలకు బదిలీ చేశారు.
అనంతపురం, బాపట్ల మరియు విజయనగరం జిల్లా కలెక్టర్ల వినతి మేరకు ఇటీవల బదిలీ అయిన ఆరుగురు వైద్యుల్ని వారి పూర్వ స్థానాల్లోనే కొనసాగించేందుకు మంత్రి ఆమోదం తెలిపారు. అనంతపురం జిల్లాలోనే వంద పడకల రాయదుర్గం ఏరియా ఆసుపత్రిలో 23 మంది వైద్యులకు గాను ఆరుగురే పనిచేస్తున్నారు. వీరిలో ఇటీవల ముగ్గురు బదిలీకాగా ఆయా పోస్టుల్లో పనిచేసేందుకు ఎవరూ ముందుకు రానందున వారిని కొనసాగిస్తున్నారు.
చీరాల ఏరియా ఆసుపత్రిలో ఐదేళ్లకు మించి పనిచేస్తున్న ఇద్దరు వైద్యులు బదిలీకాగా ఆయా స్థానాల్లో పనిచేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో వారిద్దర్నీ కొనసాగిస్తున్నారు. విజయనగరం జిల్లాలోనే గిరిజన ప్రాంతంలో ఉన్న సాలూరు ఏరియా ఆసుపత్రిలో బదిలీ అయిన ఒక డాక్టర్ ని స్థానికి అవసరాల మేరకు కొనసాగించాల్సి వచ్చింది.
డిఎంఇ పరిధిలో ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా కర్నూలు ప్రభుత్వ వైద్యకళాశాలలో రేడియోథెరపీ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీకృష్ణ ప్రకాశ్ తప్పనిసరి బదిలీల్లో భాగంగా రాజమహేంద్రవరానికి మారారు. కానీ కర్నూలులో ఆ స్థానానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ కారణంగా కర్నూలులోని స్టేట్ క్యాన్సర్ ఇన్సిట్యిట్యూట్ కు డైరెక్టర్ గా పనిచేస్తున్న డాక్టర్ శ్రీకృష్ణ ప్రకాశ్‌ను కర్నూలులోనే కొనసాగించాల్సిన అవసరం ఏర్పడింది. ఈనెల 19 వరకు జరిగిన బదిలీలకు సంబంధించి జారీ అయిన ఆదేశాల్లో కౌన్సిలింగ్‌లో తీసుకున్న నిర్ణయానికి భిన్నంగా ఉత్తర్వులు జారీ అయినందున రెండు సవరణలు అవసరమయ్యాయి. మరో పదిమంది అధ్యాపకులు స్లైడింగ్ కౌన్సిలింగ్ అనంతరం ఏర్పడిన ఖాళీల మేరకు చేసుకున్న దరఖాస్లులను మంత్రి ఆమోదించారు.
విజయవాడ, గుంటూరు నగరాలకు కొత్త వైద్యాధికారులు
పరిపాలన అవసరాల కారణంగా చేసిన బదిలీల్లో భాగంగా విశాఖపట్నం ప్రభుత్వ మానసిక వ్యాధుల ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ ఎం.హైమావతిని అనకాపల్లి డిఎంహెచ్వోగా నియమించారు. గుంటూరు నగర పాలక సంస్థలో వైద్యాధికారిగా పనిచేస్తున్న డాక్టర్ పి.అమృతం జాన్‌ను ఏలూరు జిల్లా డిఎంహెచ్వోగానూ, ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న డాక్టర్ మాలినిని గుంటూరు నగర పాలక సంస్థకు మార్చారు. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ కమీషనర్ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్ కె.అర్జున్‌రావును విజయవాడ నగర పాలక సంస్థలో ముఖ్య వైద్యాధికారిగా బదిలీ చేశారు.
ఈనెల 19న వైద్యారోగ్య శాఖ పరిధిలో బదిలీల ప్రక్రియ పూర్తికావాల్సి ఉన్నా ముఖ్యమంత్రి అనుమతితో ఈ తాజా బదిలీలను చేపట్టారు. ఇటీవల జరిగిన బదిలీల్లో మొత్తం 7,099 మంది వైద్య సిబ్బంది వివిధ స్థాయిల్లో బదిలీ అయ్యారు.