– ఓర్వకల్లులో 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ ఏర్పాటు
-పరిశ్రమలు స్థాపించే వారందరికీ ప్రోత్సహకాలు
– ప్రభుత్వంలో ప్రతి శాఖ డ్రోన్ సేవలు వినియోగించుకునేలా చేస్తున్నాం
– డ్రోన్ తయారీ, సేవల రంగంలో పరిశ్రమలు నెలకొల్పండి
– పెట్టుబడిదారులకు ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ సీఎండీ కె. దినేష్ కుమార్ పిలుపు
– ఏపీలో డ్రోన్ ఎకోసిస్టమ్‌పై పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సు.
– ఏపీలో డ్రోన్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేయడానికి సుముఖత వ్యక్తం చేసిన పలువురు పారిశ్రామికవేత్తలు
విజయవాడ: డ్రోన్‌ల తయారీ రంగంలో దేశంలోనే ఆంద్రప్రదేశ్ అత్యత్తమ కేంద్రంగా రూపొందించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తోందిన ఆంధ్రప్రదేశ్ డ్రోన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె. దినేష్ కుమార్ అన్నారు. ఇందుకోసం కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 300 ఎకరాల సువిశాల ప్రాంగణంలో దేశంలోనే మొట్టమొదటి, అతి పెద్ద డ్రోన్ సిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే అక్కడ స్థల సేకరణ పూర్తి చేశామని, అభివృద్ధి పనులు చేపట్టబోతున్నామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్ పరిశ్రమకున్న అనుకూల వాతావరణంపై ఆ రంగంలోని పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలతో గురువార విజయవాడ నోవాటెల్ హోటల్‌లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సు నిర్వహించారు. దేశ వ్యాప్తంగా డ్రోన్ తయారీ, సేవలు, యాక్సిల్లరీ యూనిట్ల తయారీ తదితర రంగాల్లో పరిశ్రమలు నెలకొల్పి రాణిస్తున్న దాదాపు వంద మందికిపైగా పారిశ్రామికవేత్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో డ్రోన్స్ రంగాన్ని అభివృద్ధి చేసి ఏపీని దేశానికే డ్రోన్స్ క్యాపిటల్‌గా చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని వివరించారు. సీఎంగారి ఆశయాలకనుగుణంగా ఏపీ ప్రభుత్వం డ్రోన్స్ పరిశ్రమాభివృద్ధికి వేగంగా అడుగులు వేస్తోందన్నారు. ఇప్పటికే ఓర్వకల్లులో 300 ఎకరాల్లో డ్రోన్ సిటీని ఏర్పాటు చేసే దిశగా పనులు మొదలెట్టామన్నారు.
డ్రోన్లకు సంబంధించి తయారీ నుంచి విడి పరికరాలు, మరమ్మత్తులు, పరీక్షించడం, పరిశోధన, అభివృద్ధి తదితర అన్ని సదుపాయాలు ఒకే చోట ఉండేలా ఈ సిటీని ప్రత్యేకంగా రూపొందిస్తున్నామని చెప్పారు. దేశంలోనే ఇలాంటి డ్రోన్ సిటీ మరెక్కడా లేదని తెలిపారు. ఈ డ్రోన్ సిటీ ద్వారా రాష్ట్రంలో 40 వేల ఉద్యోగావకాశాలు కల్పించాలనేది లక్ష్యమని చెప్పారు. ఎక్కడా లేని విధంగా ఓర్వకల్లు డ్రోన్ సిటీలో అతి పెద్ద కామన్ టెస్టింగ్ ఫెసిలిటీని కల్పిస్తున్నామన్నారు.
ప్రతి ఒక్కరికీ ప్రోత్సాహం
ఏపీలో డ్రోన్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలు నెలకొల్పడానికి వచ్చే ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ప్రోత్సహకాలు కల్పిస్తోందన్నారు. ఓర్వకల్లుతో పాటు రాష్ట్రంలో పెట్టుబడిదారులు తమకు నచ్చిన జిల్లాల్లో కూడా డ్రోన్ పరిశ్రమలు నెలకొల్పవచ్చని, వారికి కూడా ప్రభుత్వం ప్రోత్సహకాలు ఇస్తుందన్నారు. డ్రోన్ రంగంలో ప్రపంచ దేశాలైనా చైనా, బెల్జియం, అమెరికా లాంటి వాటికి ధీటుగా ఇక్కడ పరిశ్రమలను ప్రోత్సహించాలని ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. దీనికి పారిశ్రామికవేత్తలు, ఈ రంగంలో అనుభవజ్ఞులైన వారి సలహాలు, సూచనలు, సహకారం అవసరమని చెప్పారు.
ఓర్వకల్లులో డ్రోన్ పరిశ్రమలు నెలకొల్పడానికి వచ్చే వారికి వారి ప్లాంటుకు అనుగుణంగా స్థలాలు కేటాయిస్తామన్నారు. అనుమతులు కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా వెంటనే లభించేలా సరళీకృత విధానం అమలు చేస్తున్నామని తెలిపారు. మిగిలిన రంగాల్లో పెట్టుబడులు పెట్టేవారికి ఎలాంటి ప్రోత్సహకాలైతే ఇస్తున్నామో డ్రోన్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి కూడా అదే తరహా ప్రోత్సహకాలు ఇస్తామన్నారు.
నైపుణ్యాభివృద్ధి
ఇంత పెద్ద డ్రోన్ సిటీని ఏర్పాటు చేస్తున్నప్పుడు దానికి అనుగుణంగా అవసరమైన మానవ వనరులను కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తోందని వెల్లడించారు. డ్రోన్ రంగంలో ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల్లోని విద్యార్థులు, ఔతా్సహిక యువతకు ప్రత్యేకంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఇప్పటికే కర్నూలులోని ఇండియన్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థ భాగస్వామ్యంతో శిక్షణ కార్క్రాలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వ శాఖల్లో డ్రోన్ వినియోగం
రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలు కూడా అక్కడి అవసరాలను బట్టి డ్రోన్ సేవలు వినియోగించుకోనున్నాయని డ్రోన్ కార్పొరేషన్ సీఎండీ కె. దినేష్ కుమార్ తెలిపారు. డ్రోన్‌ల ద్వారా ప్రభుత్వ సేవలను మరింత మెరుగ్గా, ప్రజలకు మరింత చేరువయ్యేలా చేసే దిశగా పనిచేస్తున్నామన్నారు. ఆయా శాఖల్లో ఉపయోగించుకోదగ్గ యూస్ కేసెస్‌ల గురించి ఆయా శాఖలకు అవగాహన కల్పించి వారు డ్రోన్ సేవలు వినియోగించుకునేలా చేస్తున్నామని చెప్పారు. దీంతో పాటు డ్రోన్ రంగంలో పెద్ద ఎత్తున ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, డీప్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నామన్నారు.
ఏపీ ఆదర్శనీయం
డ్రోన్ రంగంలో ప్రత్యేకించి డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ దేశంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తోందని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులో పాల్గొన్న పలువురు పారిశ్రామికవేత్తలు తెలిపారు. హైదరాబాదుకు దగ్గరగా ఉన్న ఓర్వకల్ ను డ్రోన్ సిటీ ఏర్పాటుకు ఎంచుకోవడం శుభపరిణామన్నారు. డ్రోన్ రంగానికి అత్యంత ప్రోత్సహం ఇస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సందర్భంలో కొంతమంది పెట్టుబడి దారులు తాము ఓర్వకల్లులోని డ్రోన్ సిటీలో డ్రోన్ తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ చీఫ్ ఇంజినీర్ జీజేవీఎం నాగభూషణం, ఏపీఐఐసీ ఓఎస్డీ వి. నాగార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.