-మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర
విజయవాడ : జగన్ రెడ్డి నేతన్న నేస్తం పేరుతో హడావుడి చేయడం తప్ప ఈ మూడేళ్లలో చేనేతల అభివృద్ధి శూన్యం. తాత్కాలిక తాయిలాలతో చేనేత వృత్తిని చంపేస్తున్నాడు. చేనేతలపై జగన్ కు ఏమాత్రం చిత్తశుద్ధి వున్నా వారు శాశ్వతంగా అభివృద్ధి చేందేందుకు అవకాశాలు కల్పించాలి. తాయిలాలు ఇవ్వడం చేనేతల సమస్యలకు పరిష్కారం కాదు. నేతన్నలకు అధునాతన మగ్గాలు, ఇతర యంత్రాలు అందుబాటులోకి తెచ్చి, వృత్తిలో టెక్నాలజీని జోడించి వారి వ్యాపారంలో నూతన పద్ధతులను పాటించేలా ప్రభుత్వం అవగాహన కల్పించాలి.
వ్యాపార మేళకువలు నేర్పించడం, అవసరమైతే ప్రభుత్వమే కొనుగోలు చేయడం, ముడిసరుకు అందుబాటులో అందించడం, ముడి సరుకులను సబ్సిడీతో అందించాలి. వారి ఉత్పత్తులను పెంచే విధంగా తోడ్పటు నందించడం వల్ల వారు తమ వ్యాపారంలో అభివృద్ధి చెంది ఆర్థికంగా బలోపేతం అవుతారు.
కానీ జగన్ మోహన్ రెడ్డి ఇవేమి చేయకుండా కేవలం బటన్ నొక్కాను 24 వేలు తీసుకోండి అభివృద్ధి సాధించండి అంటే అదేలా సాధ్యమవుతుందో బటన్ రెడ్డికే తెలియాలి. ఇదే విధంగా బటన్ నొక్కుడు కొనసాగితే భవిష్యత్తులో నేతన్నల జీవితాలు బుగ్గిపాలవుతాయి, నేత కార్మికుడు ఉనికే ప్రశ్నార్థకంగా మారిపోతుంది. ఇప్పటికైనా బటన్ నొక్కడం తో పాటు ప్రక్క రాష్ర్టం తెలంగాణాలో చేనేత కార్మికుల సంక్షేమం కోసం చేస్తున్న కృషిని చూసైనా బుద్దితెచ్చుకోవాలి.
బతుకమ్మ చీరలు తదితర కార్యక్రమాలతో వారికి చేతినిండా పని కల్పించి, సంపాదన పెంచి, ఆర్థికంగా చేనేత కుటుంబాలకు భరోసానిస్తున్నారు. వారి ఆత్మగౌరవం పెంచే చర్యలను ప్రభుత్వం చేపడుతుంది. ‘కొండా లక్ష్మణ్ బాపూజీ’ పేరుతో అవార్డులు ఇస్తూ, ఎగ్జిబిషన్లు, ఫ్యాషన్ షోలను నిర్వహిస్తూ చేనేతలకు ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. తెలుగు దేశం హయాంలో చేనేత కార్మికులకు బీమా సౌకర్యం కల్పించాం. సబ్సిడీపై రుణాలు, రాయితీలు, యంత్రాలు అందించాం. కానీ జగన్ బటన్ రెడ్డి మాత్రం 24 వేలు ఇచ్చాం మీ చావు మీరు చావండి అని వారిని రోడ్డుమీద పడేస్తున్నారు. ఇప్పటికైనా జగన్ రెడ్డి కళ్లు తెరచి నేతన్నలకు చేయూత పథకాల ద్వారా చేనేత సొసైటీలకు ప్రభుత్వం వాటా ధనాన్ని అందించడం, కార్మికులకు నూలు, రంగులు, రసాయనాలకు సబ్సిడీలు అందించడం, చేనేత మగ్గాలను ఆధునీకరించడం వంటి చర్యలను అమలు చేయాలి. అప్పుడే సత్పలితాలనిస్తాయి.
గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేనేతలకు అనేక పథకాలు అమలు చేయడం జరిగింది. చేనేతలకు రుణమాఫీ చేసి, 50 ఏళ్ళకే ఫించన్ ఇవ్వడం జరిగింది. అంతేకాక నేతన్నలకు వివిధ సందర్భాలలో అవరమైన సాంకేతిక శిక్షణలు అందించింది వారి జీవితాల్లో వెలుగులు నింపింది. ఇప్పటికైనా జగన్ రెడ్డి తాత్కాలికమైన తాయిలాలు ఇచ్చి ప్రచారం చేసుకోవడం మాని చేనేతల జీవితాల్లో వెలుగులు నింపెలా చిత్తశుద్ధితో కృషి చేయాలి.