Suryaa.co.in

Andhra Pradesh

వైభవంగా దసరా ఉత్సవాలు

దుర్గమ్మ సేవలో ఎమ్మెల్యే సుజనా చౌదరి

దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు విజయవాడ ఇంద్రకీలాద్రి పై గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీరాం సత్యనారాయణ, ఆలయ ఈవో, కె ఎస్ రామారావు సుజనాకు స్వాగతం పలికారు. వేద పండితులు, ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మ వారి చిత్రపటాన్ని బహుకరించారు. దర్శనం అనంతరం ఎమ్మెల్యే సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ దసరా మొదటి రోజున దుర్గమ్మను దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

అమ్మవారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా జరుగుతున్న దసరా ఉత్సవాలు ఎంతో ప్రత్యేకమైనవన్నారు. వీవీఐపీల కోసం ప్రత్యేకమైన సమయాన్ని కేటాయిస్తూ సామాన్యులందరికీ త్వరితగతిన దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేశామన్నారు. గతం కంటే భిన్నంగా ఈ ఏడాది ఉత్సవాలను అధికారుల అందరి సమన్వయంతో వైభవంగా నిర్వహిస్తామన్నారు.

వృద్ధులకు, దివ్యాంగులకు సాయంత్రం 4 నుంచి 5 వరకు ప్రత్యేక సమయం కేటాయించామన్నారు. వ్యక్తిగత వాహనాలను కొండపై అనుమతించకుండా దేవస్థానం వాహనాల్లోనే భక్తులను అనుమతిస్తున్నామన్నారు. మూలా నక్షత్రం రోజున కనకదుర్గ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలను సమర్పిస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలతో, కూటమినేతల సహకారంతో దసరా ఉత్సవాలను విజయవంతం చేస్తామని తెలిపారు.

LEAVE A RESPONSE