గ్రంథాలయాలకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కృషి చేయండి

– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
– మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర చైర్మన్ శేషగిరిరావు

గుడివాడ, జనవరి 6: రాష్ట్రంలో గ్రంథాలయ వ్యవస్థకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కృషి చేయాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) సూచించారు. గురువారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ మందపాటి శేషగిరిరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నానికి పుష్పగుచ్ఛం అందించి శాలువాతో ఘనంగా సత్కరించారు. రాష్ట్రంలో గ్రంథాలయ సంస్థ పనితీరుపై చైర్మన్ శేషగిరిరావుతో మంత్రి కొడాలి నాని సమీక్షించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గ్రంథాలయాల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టినట్టు చైర్మన్ శేషగిరిరావు తెలిపారు.

దీనిలో భాగంగా జడ్పీ చైర్మన్లను కలుస్తున్నట్టు చెప్పారు. గ్రంథాలయాలు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని, దీనికి పూర్తి సహకారాన్ని అందించాలని మంత్రి కొడాలి నానిని కోరారు. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలపై సమీక్షించేందుకు తమ కార్యాలయానికి రావాలంటూ మంత్రి కొడాలి నానిని చైర్మన్ శేషగిరిరావు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుడివాడ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంపటి సైమన్, ఎంపీటీసీ సభ్యుడు మద్దాల అశోక్, మాజీ కౌన్సిలర్ వేల్పుల నాగబాబు, ప్రముఖులు కలపాల బాబూరావు, గంధం సైమన్ బాబు, మామిళ్ళ రాజేష్, అత్తాటి సాల్మన్ రాజు, మంటాడ చలమయ్య, దొండపాటి రాంబాబు, జువ్వనపూడి విజయకుమార్, చోరగుడి సంసోను, మెండా చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply