ఆలోచన లేని వ్యక్తితో చర్చించడం అంటే, చనిపోయిన మనిషి శరీరంలోకి ఔషధాన్ని ఇంజెక్ట్ చేయడం లాంటిది.– థామస్ పెయిన్ (1737-1809),అమెరికన్ తత్త్వవేత్త, రాజకీయ సిద్ధాంతకర్త.
దళితుల చేతితో నీళ్ళు తాగడానికి నిరాకరించిన ఈ దేశంలోని పెద్ద మనుషులు, ఈ రోజు ఒక జంతువు మూత్రం సంతోషంగా తాగుతున్నారు. దేశం ఎంత ముందుకు పోతూఉందో, ఎంత వెలిగిపోతూ ఉందో ప్రపంచం గమనిస్తూనే ఉంది. గోమూత్రం అంత పవిత్రమైనదే అయితే, దేవుళ్ళ అభిషేకాలకు ఎందుకు వాడడం లేదూ? అని నేటి యువతరం ఒక ప్రశ్నను సంధిస్తోంది. అయినా విద్యాలయాలపై దాడులు, యూనివర్సిటీలపై దాడులు వీరికి కొత్తకాదు. లోగడ నలంద, విక్రమశిల, తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాలను ధ్వంసం చేసింది వీరి పూర్వీకులేనన్నది గమనించాలి! ఇటీవల జేఎన్‌యూపై దాడులు కూడా ఎవరు చేయించారో అందరికీ తెలిసిన విషయమే.
ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఇలాంటి దాడుల్ని దృష్టిలో పెట్టుకుని దక్షిణాఫ్రికా నల్లజాతి తొలి అధ్యక్షుడు, జాతి వివక్షపై జీవితాంతం పోరాడిన విప్లవవీరుడు నెల్సన్ మండేలా ఇలా అన్నారు.. ”మన ప్రపంచం జాతి, మత, రంగు, లింగ బేధాలతో విభజింపబడి లేదు. కేవలం వివేకవంతులు, మూర్ఖులు అని రెండు రకాలుగా మాత్రమే విభజింపబడి ఉంది. మూర్ఖులే జాతి, మత, రంగు, లింగ బేధాలతో తమని తాము విభజించుకున్నారు.” ప్రపంచంలో సుమారు 192 దేశాలున్నాయి. అందులో 750 కోట్ల జనాభా ఉంది. వీరికి 4200 మతాలున్నాయి. అయితే ఇందులో ఏ ఒక్క మతమూ మనుషులంతా సమానులని చెప్పలేకపోయింది.
పోనీ సమానులుగా ఉంచలేకపోయింది. దానికి కారణమేమిటీ? అని ఇకనైనా మనం ఆలోచించుకోవాలి కదా? మతం అణిచివేయబడ్డ జీవి నిట్టూర్పు. హృదయం లేని ప్రపంచంలో హృదయం లాంటిదని – స్ఫూర్తి లేని ప్రపంచంలో స్ఫూర్తి లాంటిదని కొందరు అభిప్రాయ పడతారు. ఏది ఏమైనా ఒకరకంగా మతం ప్రజల పాలిట మత్తుమందు. ఆనందంగా ఉన్నామని భ్రమలు కల్పించే మతం రద్దుకావాలంటే నిజ జీవితంలో నిజమైన ఆనందం సాధించబడాలి. ఆ నిజమైన ‘ఆనందం’ సాధించబడాలంటే ఏం చేయాలో మార్క్సు-ఏంగిల్స్ చెప్పారు.
”మత భావనలు బలంగా కొనసాగడానికి అదృష్టం, అతీత శక్తులు, దేవుళ్ళపై నమ్మకాలకు భౌతిక పునాది ఏమిటో మనం అర్థం చేసు కోవాలి. వాటిని రూపుమాపి, భావజాల పోరాటం కూడా జోడిస్తే… అప్పుడు మనిషికి మతం అవసరం తొలగి పోతుంది. మతం అంతరించిపోతుంది” అన్నాడు మార్క్స్. ”మతాన్ని తొలగించాలంటే మతం సృష్టించిన పరిస్థితుల్ని తొలగించాలి. సమాజంలోని దోపిడీని వ్యతిరేకించి పోరాడకుండా.. దాని ప్రతిబింబమైన మతంపై పోరాడడం వలన ఉపయోగముండదు” అని చెప్పాడు ఏంగిల్స్.
ఆ మహానుభావుల అభిప్రాయాలు మనకు శిరోధార్యమే. కాని స్వాతంత్య్రానంతరం ఈ దేశంలో యేం జరుగుతూ వస్తోందో మనకు తెలుసు. మనిషికి మతం అవసరం లేని పరిస్థితిని ప్రభుత్వాలు గాని, రాజకీయ పార్టీలు గాని, సామాన్య పౌరులుగానీ కల్పించే ప్రయత్నం చేస్తున్నాయా? / చేస్తున్నారా? ఒకసారి ఆలోచించండి! ‘మతం సృష్టించిన పరిస్థితుల్ని తొలగించాలి’ అని అన్నాడు ఏంగిల్స్.
– రవికుమార్