Suryaa.co.in

Andhra Pradesh

ఏపీ సెక్రటేరియట్‌లో ఉద్యోగ సంఘ నేతల ధర్నా

– ధర్నా విరమించాలని పోలీసు ఆదేశం
– వచ్చే వారం ఇస్తామన్న సీఎస్
పీఆర్సీ నివేదికను బహిరంగపరిచే వరకూ కదలబోమంటూ ఏపీ సచివాలయంలో ఉద్యోగ సంఘ నేతలు భైఠాయించారు. అయితే వారు లోపల కాకుండా రెండో బ్లాక్ ముందు ఉన్నరోడ్డుపై కూర్చున్నారు. ఈ రోజు పీఆర్సీ నివేదిను వెల్లడిస్తామన్నారని.. అది వెల్లడించే వరకూ తాము వెళ్లబోమన్నారు.
అయితే వారికి సమాధానం చెప్పడానికి ఉన్నతాధికారులు ఎవరూ సచివాలయంలో లేరు. చీఫ్ సెక్రటరీ కూడా లేరు. ఉద్యోగ సంఘాల నేతల ఆందోళన గురించి తెలిసిన సీఎస్ సమీర్ శర్మ.. పీఆర్సీ నివేదిను బహిరంగ పరిచేందుకు అనుమతి కోసం… ముఖ్యమమంత్రి క్యాంపుఆఫీస్ కు వెళ్లారు. సచివాలయంలో బైఠాయించిన వారిలో బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు వంటివారు ఉన్నారు. వారందర్నీ వెళ్లిపోవాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు.
అయితే వారు మాత్రం అక్కడి నుంచి కదలబోమని అంటున్నారు. గత నెలలో ఓ సారి ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అక్టోబర్ నెలాఖరు కల్లా పీఆర్సీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. కానీ అలాంటి ప్రయత్నం ఏదీ చేయలేదు. దీంతో వారు ధర్నాకు దిగారు. వీరు ఇలా ధర్నాకు దిగడానికి ముందే ఈ ఉద్యోగ సంఘాలకు వ్యతిరేకంగా ఉండే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ ప్రెస్ మీట్ పెట్టి.. ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.
తమ జీపీఎఫ్ నిధులు కూడా ఇవ్వడం లేదని.. ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం చంద్రశేఖర్ రెడ్డి అనే మాజీ ఎన్జీవో నేతకు పదవి ఇవ్వడంపై ఆయన మండిపడ్డారు. ఆయనపై చాలా అక్రమాల ఆరోపణలు ఉన్నాయన్నారు. ఇలా ఉద్యోగ సంఘాల నేతలు పోటీపడి ప్రభుత్వంపై విమర్శలకు ముందుకు వస్తున్నారు. తాము ప్రభుత్వంతో కుమ్మక్కు కాలేదని ఉద్యోగులను నమ్మించడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
వచ్చే వారం ఇస్తామన్న సీఎస్
ఉద్యోగ సంఘ నేతలతో సీఎస్ సమీర్‌శర్మ భేటీ అయిన సందర్భంగా.. తమకు నివేదిక బహిరంగపరిచేవర కూ ఇక్కడి నుంచి కదిలేది లేదని నేతలు స్పష్టం చేశారు. అయితే తాను సీఎంతో చర్చించి వస్తానని సీఎస్, సీఎం క్యాంపు ఆఫీసుకు వెళ్లారు. సీఎంతో చర్చించిన తర్వాత వచ్చే వారం నివేదికను ఉద్యోగ సంఘాల నేతలకు ఇస్తామన్న సందేశం రావడంతో నేతలు వెళ్లిపోయారు.

LEAVE A RESPONSE