– డబ్ల్యుటిసిఎ గ్లోబల్ చైర్ జాన్ డ్రూతో మంత్రి లోకేష్ భేటీ
దావోస్: వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్ గ్లోబల్ చైర్ జాన్ డ్రూతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వేడేర్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాల్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్లను ఏర్పాటుచేయండి.
ఆగ్నేయాసియా, మిడిల్ ఈస్ట్ ఆసియాతో భారత మార్కెట్ ను అనుసంధానించడానికి వీలుగా ఎపిలో ట్రేడ్ హబ్ ను ఏర్పాటు చేయండి. WTCA నెట్‌వర్క్ , ట్రేడ్ ఈవెంట్‌ల ద్వారా చిన్నతరహా పరిశ్రమలకు గ్లోబల్ మార్కెట్ యాక్సెస్‌ను అందించడానికి సహకారం అందించాలని కోరారు. జాన్ డ్రూ మాట్లాడుతూ…. వాణిజ్యం, పెట్టుబడుల ప్రోత్సాహానికి గ్లోబల్ నెట్ వర్క్ ఏర్పాటులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో 300 వరల్డ్ ట్రేడ్ సెంటర్లను నిర్వహిస్తున్నాం.
ప్రస్తుతం భారత్ లో 13 డబ్ల్యుటిసి సెంటర్లు పనిచేస్తుండగా, 7 నిర్మాణంలో ఉన్నారు. మరో 9చోట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయి. ఆఫ్రికా, ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికా వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లపై దృష్టి సారించి ప్రపంచ వాణిజ్య నెట్‌వర్క్‌లలో భారతదేశ మార్కెట్ ను సులభతరం చేయాలని భావిస్తున్నాం. భారతీయ వ్యాపారాలు, అంతర్జాతీయ మార్కెట్ల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, ఇండియా బేస్డ్ ట్రేడ్ హబ్ లను ప్రాంతీయ మార్కెట్ లకు అనుసంధానించాలని తాము భావిస్తున్నట్లు చెప్పారు. ఎపిలో వరల్డ్ ట్రేడ్ సెంటర్లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని జాన్ డ్రూ చెప్పారు.