* రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
* ఉన్నత విద్య చదవే బీసీ విద్యార్థులకు ప్రభుత్వం భరోసా
* పావలా వడ్డీతో విద్యా రుణాలిస్తాం
* వాల్మీకులను ఎస్టీలో చేరుస్తాం… : మంత్రి సవిత
* కర్నూలులో ఘనంగా వాల్మీకి రాష్ట్ర స్థాయి జయంత్యోత్సవం
కర్నూలు : రాష్ట్రంలో మరిన్ని నూతన బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల ఏర్పాటు చేయబోతున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. వెనుకబడిన తరగతుల విద్యకు కూటమి అధిక ప్రాధాన్యమిస్తోంది, దీనిలో భాగంగా బీసీ విద్యార్థులకు ఉన్నత విద్య కోసం పావలా వడ్డీకే విద్యా రుణాలు అందజేయనున్నట్లు వెల్లడించారు. వాల్మీకులకు ఎస్టీలో చేర్చేలా కృషి చేస్తామని మంత్రి సవిత ప్రకటించారు.
మంగళవారం మహర్షి వాల్మీకి జయంత్యోత్సవాన్ని స్థానిక కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలతో కలిసి వాల్మీకి చిత్రపటానికి పూల మాల వేసి, జ్యోతి ప్రజల్వన చేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, వాల్మీకి రామాయణం రచించి సమాజానికి సన్మార్గాన్ని చూపుతోందన్నారు. వాల్మీకి మహర్షి వాల్మీకులకు మాత్రమే సొంతం కాదని ప్రపంచానికే సొంతమన్నారు. వాల్మీకి రామాయణం ప్రపంచ ప్రఖ్యాతగాంచిందన్నారు.
రామాయణం కేవలం మత గ్రంథం మాత్రమే కాదని కుటుంబ విలువలు, నైతిక విలువలు బోధిస్తూ, సమాజ నిర్మాణానికి దిక్సూచిగా పనిచేస్తోందని అన్నారు. భార్యాభర్తలు, అన్న దమ్ముల మధ్య సఖ్యత గురించి, రాజ్య పరిపాలన ఎలా చేయాలో రామాయణం చదివితే చాలని విదేశీయులు సైతం భావిస్తుంటారన్నారు.
వాల్మీకులను ఎస్టీల్లో చేరుస్తాం
వాల్మీకుల అభివృద్ధి సీఎం చంద్రబాబునాయుడితోనే సాధ్యమని మంత్రి సవిత స్పష్టంచేశారు. వాల్మీకులను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధే టీడీపీ ధ్యేయమన్నారు. ఎందరో వాల్మీకి సామాజిక వర్గ నేతలకు మంత్రిగా ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఇతర ప్రజాప్రతినిధులుగా సీఎం చంద్రబాబునాయుడు అవకాశమిచ్చారన్నారు.
రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతిని నిర్వహించేలా 2014-19లో సీఎం చంద్రబాబు శాశ్వత జీవో తీసుకొచ్చారన్నారు. సత్యపాల్ కమిటీ నివేదిక మేరకు 2014-19 మధ్య వాల్మీకులను ఎస్టీలో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపిన ఘనత సీఎం చంద్రబాబుదేనన్నారు. వాల్మీకులను ఎస్టీల్లో చేర్చేలా కృషి చేస్తామని మంత్రి సవిత స్పష్టం చేశారు.
మరిన్ని బీసీ గురుకులాల ఏర్పాటు
బీసీల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని మంత్రి సవిత వెల్లడించారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో మరిన్ని బీసీ గురుకుల పాఠశాలల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉన్నత విద్య చదివే బీసీ విద్యార్థులకు పావలా వడ్డీకే విద్యా రుణాలు అందజేయనున్నామన్నారు. ఇందుకు ప్రభుత్వమే బ్యాంకు గ్యారంటీగా ఉంటుందన్నారు. ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా శిక్షణ పొందిన బీసీ అభ్యర్థులు 250 మంది వరకూ టీచర్లగా నియమితులయ్యారన్నారు.
బీసీలను వ్యాపారులుగా చేయడమే లక్ష్యం
ప్రతి బీసీ ఇంటి నుంచి ఒకరిని వ్యాపారవేత్తగా చేయడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. ఇందుకోసం స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సూపర్ సిక్స్ పథకాలలోనూ, మెగా డిఎస్సీలోనూ, జీఎస్టీలోనూ ఎక్కువ లబ్ధి చేకూరింది బీసీలకేనన్నారు.
ఈ సమావేశంలో ఎంపీలు బస్తిపాటి నాగరాజు, అంబిక లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు గుమ్మనూరు జయరాం, గౌరు చరితారెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, కార్పొరేషన్ చైర్మన్లు దేవేంద్రప్ప, కప్పట్రాళ్ల బొజ్జమ్మ, కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, కడప ఆర్టీసీ రీజినల్ చైర్మన్ పూలనాగరాజు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు, వాల్మీకి సామాజిక వర్గీయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.