Suryaa.co.in

Telangana

ప్రపంచ మేటి విద్యార్థులను తయారు చేసేలా యంగ్ ఇండియా విద్యా సంస్థల ఏర్పాటు

– 4 నుంచి 12వ తరగతి వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా బోధన
– క్రీడలను ప్రోత్సహించేలా విద్యార్థులకు అవసరమైన సదుపాయాల కల్పన
– డిజిటల్ స్మార్ట్ బోర్డు, కంప్యూటర్ ల్యాబ్ వంటి అత్యాధునిక సౌకర్యాల కల్పన
– వచ్చే ఏడాది దసరా నాటికి నిర్మాణాలు పూర్తి
– యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీధర్ బాబు

మంథని: ప్రపంచ మేటీ విద్యార్థులను తయారు చేసేలా యంగ్ ఇండియా విద్యా సంస్థల ఏర్పాటు చేయడం జరుగుతుందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు అన్నారు.

శుక్రవారం రాష్ట్ర ఐటీ,పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షతో కలిసి మంథని మండలంలో అడవి సోమనపల్లి గ్రామంలో 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి డి.శ్రీధర్ బాబు మాట్లాడుతూ, మార్పు తిసుకువస్తామని ప్రజలకు ఇచ్చిన హామీలను క్రమక్రమంగా అమలు చేస్తున్నామని అన్నారు. గ్యారెంటీ పథకాలలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయల సబ్సిడీ సిలిండర్, మరియు ఇండ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కార్యక్రమం వచ్చే నెల నుంచి ప్రారంభిస్తామని అన్నారు.మానేరు నది ఒడ్డున ఉన్న అడవి సోమనపల్లి గ్రామంలో యంగ్ ఇండియా సమీకృత విద్యా సంస్థ రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించిన డిఎస్సీ నియామకం అంశాన్ని రికార్డు సమయంలో ప్రజా ప్రభుత్వం పూర్తి చేసి, ఇటీవల ముఖ్యమంత్రి చేతుల మీదుగా 11 వేలకు పైగా నూతన టీచర్లను నియమించడం జరిగిందని, ఇదే గ్రామానికి చెందిన శ్రవణ్ కుమార్ అనే యువకుడికి ఎస్.జి.టి ఉద్యోగం లభించిందని అన్నారు.

ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థలలో ,2500 పైగా విద్యార్థుల చదువుకుంటారని, వీరికి 120 మంది టీచర్లను కేటాయించడం జరుగుతుందని అన్నారు. గ్రీన్ ఎనర్జీ ద్వారా సొంతంగా విద్యుత్తు ఉత్పత్తి చేసుకునేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. 250 నుంచి 300 కోట్లు ఖర్చు చేసి ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల నిర్మాణం చేస్తున్నామని అన్నారు. త్వరలో రామగుండం, పెద్దపల్లి నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ లోను మంజూరు చేసి పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.

అనంతరం మంత్రి గౌడ కులస్తులకు కాటమయ్య రక్షక కవచ కిట్లను పంపిణీ చేశారు. ప్రభుత్వం ప్రతి రక్షక కవచ కిట్ పై దాదాపు 9 వేల రూపాయలు ఖర్చు చేసి సబ్సిడీపై పూర్తి ఉచితంగా గౌడ సోదరులకు అందిస్తుందని, చెట్టు పై కల్లు తీసేందుకు వెళ్లినప్పుడు ఈ కిట్ ఉపయోగించడం వల్ల ప్రమాదాలను నియంత్రించవచ్చని, ప్రతి గౌడ సోదరుడు ఈ కిట్ ను వినియోగించాలని అన్నారు. చెట్టు పైకి ఎక్కి కళ్ళు తీసే గౌడ సోదరులను గుర్తించి కాటమయ్య రక్షక కిట్లను ముందుగా పంపిణీ చేయాలని మంత్రి ఆదేశించారు.

LEAVE A RESPONSE