ఒక్క హిందువుకు నష్టం జరిగినా మూల్యం చెల్లించుకోక తప్పదు

-రాష్ట్ర ప్రభుత్వానికి వీహెచ్‌పి హెచ్చరిక
-మంత్రి కేటీఆర్ అత్యుత్సాహంతోనే తెలంగాణలో అలజడి
-ప్రజాదరణ కోల్పోతున్నారనే అల్లర్లకు కుట్ర
-గణేష్ నవరాత్రుల సందర్భంలో భయం గుప్పిట్లో నగరం
-హిందువుల మనోభావాలు గాయపరిచేందుకే మునావర్ షోకు కేసిఆర్ అనుమతి
-రాష్ట్రం తగలబడుతుంటే ప్రధానమంత్రిని విమర్శించే పనిలో కేసీఆర్ బిజీబిజీ
-వీహెచ్‌పి తమిళనాడు క్షేత్ర సంఘటన మంత్రి ఆకారపు కేశవరాజు ఆరోపణ

ప్రశాంతమైన తెలంగాణ రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు మంత్రి కేటీఆర్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడని విశ్వహిందూ పరిషత్ తమిళనాడు క్షేత్ర (దక్షిణ భారత అధికారి) సంఘటన మంత్రి ఆకారపు కేశవరాజు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతున్న సందర్భంలో తమ ఉనికి కాపాడుకునేటందుకోసం భాగ్యనగరంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.

నగరంలో హిందువులపై జరుగుతున్న దాడులను ఆయన సమీక్షించారు. శనివారం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. పాత నగరంలో హిందువుల స్థితిగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దేశం మొత్తం భాగ్యనగరం వైపు చూస్తోందన్నారు. హిందువుల ఇళ్లపై దాడులు చేయడం.. ఆస్తులు ధ్వంసం చేయడం తగదని హెచ్చరించారు. కట్టడి చేయాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడానికి తప్పు పట్టారు. దక్షిణ మండలం డిసిపి, అదనపు డిసిపి ఇద్దరు ముస్లింలను రెచ్చగొట్టి హిందువులపై ఉసుగల్పుతున్నారని ఆరోపించారు.

గోషామహల్ నియోజకవర్గం మొత్తం తగలబెట్టాలని కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్, అతని తమ్ముడు రషీద్ ఖాన్ లు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న కూడా పోలీసులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఐఎం నేతల కనుసన్నులలో పోలీసులు ఉద్యోగాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. నగరం నివురు కప్పిన నిప్పులా ఉందని.. ఈ క్షణాన ఏ ప్రమాదం పొంచి ఉందో చెప్పలేమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శించే పనిలో ముఖ్యమంత్రి కేసీఆర్ బిజీగా ఉన్నారని.. రాష్ట్రంలో శాంతిభద్రతల విషయాన్ని గాలికి వదిలేసారని అన్నారు.

కేటీఆర్ దుందుడుకు చర్యల వల్లనే గణేష్ మహోత్సవాల వేడుకల సందర్భంగా నగరం భయం గుప్పెట్లోకి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లిం సంతుష్టి కరణ కోసం హిందువుల ప్రాణాలను పణంగా పెట్టారన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే హిందూ సమాజం చూస్తూ ఊరుకోదని కేశవరాజు హెచ్చరించారు. ఒక్క హిందువుకు నష్టం వాటిలిన రాష్ట్ర ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. హిందువుల పై దాడికి ఉసుగొల్పిన నేతలను వెంటనే అరెస్టు చేయాలని.. అదేవిధంగా దక్షిణ మండలం పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న వారిలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పండరినాథ్ , ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, హిందూ సంఘాల నాయకులు రాజగోపాల్, దేవిక, నాగ పరిమళ, అనిల్, రజనీకాంత్, అఖిలేష్, ముఖేష్, శ్రద్ధానంద్, అనిల్ తదితరులు ఉన్నారు.

Leave a Reply