Suryaa.co.in

Editorial

కూటమిలోనూ సీఐలకు ‘కమ్మ’టి షాకులు

  • అమరావతి, రాపూరు సీఐలపై వీఆర్ వేటు

  • ఇద్దరూ కమ్మ సామాజికవర్గ అధికారులే

  • అమరావతి సీఐ శ్రీనివాస్‌కు జగన్ జమానాలో నాలుగేళ్లు నో పోస్టింగ్

  • చివరి ఏడాదిలో లూప్‌లైన్ పోస్టింగ్

  • దళితులను వేధించాలన్న పెదకూరపాడు ప్రముఖుడి ఆదేశాలు పాటించని సీఐ శ్రీనివాస్

  • అమరావతికి చెడ్డపేరు వస్తుందని చెప్పినా వినని పెదకూరపాడు టీడీపీ కీలకనేత

  • చివరకు శ్రీనివాస్‌ను బదిలీ చేయించిన వైనం

  • వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణకు తెలియకుండానే సీఐకి వీఆర్ ఆదేశాలు

  • జగన్ జమానాలో క్వార్డ్జ్ తవ్వుకున్న పులివెందుల అమర్‌నాధ్ రెడ్డికే మళ్లీ పెత్తనం

  • పులివెందుల బ్యాచ్‌ను లాకప్‌లో వేసిన సీఐ విజయకృష్ణ

  • వారిని విడిచిపెట్టక పోతే ట్రాన్స్‌ఫర్ చేయిస్తానన్న ‘నెల్లూరు బెట్టింగ్ రాజా’ బెదిరింపు

  • ‘బెట్టింగ్ రాజా’ చెప్పినా వినకపోవడంతో హర్టయిన నెల్లూరు పెద్దారెడ్డి ఫ్యామిలీ

  • నెల్లూరు జిల్లాలో ఇంకా ‘రూప్’తెర.. మస్తానా!

  • అక్కడ ఆయన చెప్పిందే వేదం

  • గంటలోనే విజయకృష్ణ వీఆర్ ఆదేశాలు

  • రగలిపోతున్న వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ

  • ఇప్పటికే మైకా తవ్వకాలపై నెల్లూరు పెద్దారెడ్డి పెత్తనాన్ని వ్యతిరేకిస్తున్న వైనం

  • మీడియాలో వచ్చినా పట్టించుకోని నాయకత్వ వైఖరిపై ఆగ్రహం

  • సీఎంతో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్న ఎమ్మెల్యే

  • కూటమి జమానాలోనూ న్యాయం జరగడం లేదంటూ ఇప్పటికే సోషల్‌మీడియాలో కమ్మ వర్గం పోస్టింగులు

  • చొక్కాలు చింపుకోకుండా మీ పనులు మీరు చేసుకోండంటూ హితోక్తులు

  • ఆ నేపథ్యంలోనే ఇద్దరు కమ్మ సీఐలను వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు

  • కమ్మ సంఘాలు నిద్రపోతున్నాయా అంటూ కమ్మ యూత్ ఆగ్రహం

  • ఐజీ తీరుపై టీడీపీ సీనియర్ల పెదవి విరుపు

( మార్తి సుబ్రహ్మణ్యం)

జగన్ ఐదేళ్ల జమానాలో కమ్మ వర్గం ఆర్ధికంగా, రాజకీయంగా నష్టపోయిందన్నది బహిరంగం. ప్రధానంగా చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న కాలంలో పనిచేసిన కమ్మ వర్గానికి చెందిన పోలీసు అధికారులు అనుభవించిన మానసిక వేదన వర్ణనాతీతం. చివరకు డీజీ స్థాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకే.. రిటైరన రోజున పోస్టింగు ఇచ్చిన శాడి స్టు పాలనపై తిరుగుబాటు చేసిన ఆయనకే, ఇప్పటివరకూ దిక్కులేని దుస్ధితి. పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు అన్నీ తానై భుజాన వేసుకుని పనిచేసిన పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు టిడి జనార్దన్‌కే దిక్కు లేని పరిస్థితి. సుదీర్ఘకాలం చంద్రబాబు వద్ద పీఎస్‌గా పనిచేసిన శ్రీనివాస్‌ను.. జగన్ సర్కారు విదేశాలకు పారిపోయేంతగా తరిమివేసినా, ఆయన కు ఇప్పటివరకూ న్యాయం చేయని వైనం. ఏబీ వెంకటేశ్వరరావు, టిడి జనార్దన్‌రావు, శ్రీనివాస్ ముగ్గురూ కమ్మవారే కావడం విచిత్రం!

వందలమంది కమ్మ సీఐ, డీఎస్పీలకు పోస్టింగులు ఇవ్వకుండా వీఆర్‌లో పెట్టిన దారుణాలకు.. కూటమి పాలనలోనయినా మోక్షం లభిస్తుందనుకుంటే, అదీ ఎండిమావే అయింది. బీసీ, ఎస్పీ, ఎస్టీ, కాపు, చివరకు.. కమ్మ ఎమ్మెల్యేలు సైతం కమ్మ సీఐ, డీఎస్పీలు మాకొద్దని తిరస్కరించిన విషాదం. ఆ విషాదాన్ని ‘మహానాడు’ వెలుగులోకి తెచ్చిన తర్వాతనే, కమ్మ పోలీసు అధికారులకు పోస్టింగులు దక్కిన వాస్తవం. ఇప్పుడు మళ్లీ అదే విషాదం.

తాజాగా ఒకే రోజు ఇద్దరు కమ్మ వర్గానికి చెందిన సీఐలను, గుంటూరు రేంజ్ ఐజీ వీఆర్‌కు పంపిన వైనం, ఆ సామాజికవర్గంలో చర్చనీయాంశంగా మారింది. గత పదిరోజుల నుంచీ టీడీపీ సోషల్‌మీడియాలో, ఒక ఆసక్తికరమైన పోస్టింగ్ వైరల్ అవుతోంది.

‘‘ మీరు కులాభిమానంతో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు చేసిన త్యాగం చాలు. ఇప్పుడు పార్టీ మునుపటి మాదిరిగానే లేదు. ఇది అప్పటి పార్టీకాదు. తరం మారింది. ఆలోచనలు మారాయి. ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి, 7 శాతం ఉన్న మనం వారికి అవసరం లేదట. ఎన్నికల ముందు ఇదే 7 శాతం ఉన్న మనం అవసరమయింది. బాబుగారిని జైల్లో ఉన్నప్పుడు దేశ, విదేశాల్లో రోడ్డెక్కింది మన మే. మిగిలిన కులాలు ఏమన్నా లెక్కచేయకుండా ఆందోళనలు నిర్వహించాం. ఎన్నికల్లో విదేశాల నుంచి వచ్చి మన డబ్బు ఖర్చు పెట్టుకుని మరీ పనిచేశాం. వచ్చిన విరాళాల్లో మనదే సింహభాగం. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్లకు మనం భారమయ్యాం. శత్రువులే మిత్రులయ్యారు కాబట్టి.. ఇకపై మన సేవకు వారికి అవసరం లేదు.

కాబట్టి ఇకపై మీరు ఎవరి పనులు వారు చేసుకోండి. పార్టీ కోసం చొక్కాలు చింపేసుకోకండి. మీ వ్యాపారాలు మీరు చేసుకోండి. మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి. వాళ్లలో మార్పు వచ్చినప్పుడే పనిచేద్దాం. పవన్ కల్యాణ్‌ను కాపులు సొంతం చేసుకున్నారు కాబట్టే జనసేన అన్ని సీట్లలో గెలిచింది. అంతకుముందు సింగిల్‌గా పోటీ చేసిన జనసేనకు వచ్చిన సీట్లు-ఓట్లు ఎన్ని? ఇప్పుడు వచ్చిన సీట్లు-ఓట్లు ఎన్ని’’ అంటూ .. సోషల్‌మీడియాలో కమ్మ వర్గ నేతలు పెట్టిన పోస్టింగ్ ఒకటి, కమ్మ సామాజికవర్గంలో పునరాలోచనకు కారణమవుతోంది.

ఈ నేపథ్యంలో గుంటూరు రేంజ్‌కు చెందిన ఇద్దరు కమ్మ సీఐలను అకారణంగా వీఆర్‌కు పంపడంపై, ఆ వర్గంలో కోపం కట్టలు తెంచుకుంటోంది. అయితే వీరిలో ఒకరు రెడ్డి ఎమ్మెల్యే బాధితుడయితే.. మరొకరు కమ్మ ఎమ్మెల్యే బాధితుడు కావడమే ఇక్కడ విశేషం. అయితే కమ్మ వర్గ అధికారులకు అన్యాయం జరిగితే, దానిని పరిష్కరించకుండా కమ్మ సంఘాలు నిద్రపోతున్నాయా? పైరవీలలో బిజీగా ఉన్నాయా అని కమ్మ యూత్ సంఘాలు సోషల్‌మీడియా వేదికగా విరుచుకుపడుతున్నాయి.

పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి సీఐ మాకినేని శ్రీనివాస్‌ను, హటాత్తుగా వీఆర్‌కు పంపుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. నిజానికి జగన్ జమానాలో గుంటూరు రేంజ్‌కు సంబంధించి, ఎలాంటి పోస్టింగు లేకుండా నాలుగేళ్లు వీఆర్‌లో ఉన్న ఏకైక కమ్మ వర్గ అధికారి శ్రీనివాస్ ఒక్కరే. అలాంటి అధికారికి అమరావతిలో పోస్టింగ్ ఇచ్చిన కొద్ది నెలలకే మళ్లీ వీఆర్‌లో పంపడం పోలీసు శాఖలో చర్చనీయాంశగా మారింది.

కృష్ణానదికి వరదలు వచ్చిన సందర్భంలో, ప్రజలకు ఆహారం సరఫరా చేసి జిల్లా కలెక్టర్, ఎస్పీ ప్రశంసలు అందుకున్న మాకినేని శ్రీనివాస్‌ను వీఆర్‌కు పంపడంపై, పోలీసుశాఖలో విస్మయం వ్యక్తమవుతోంది. వైకుంఠపురంలో గండిపడి వాటర్ లాక్ అయిన ఆందోళనకర పరిస్థితిలో, పడవల్లో ఆహారం తీసుకుని మూడురోజులు అక్కడే ఉన్న ఆయనను వీఆర్‌కు పంపడమే ఆశ్చర్యం.

అయితే పెదకూరపాడుకు చెందిన ఓ టీడీపీ కీలకనేత ఆదేశాలు పాటించకపోవడం వల్లే.. మాకినేని శ్రీనివాస్‌ను వీఆర్‌కు పంపించారన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. వైసీపీకి మద్దతుదారులైన ఎస్సీలను అరెస్టు చేసి, కొట్టాలన్న సదరు కీలక నేత ఆదే శాలను ఆ సీఐ వ్యతిరేకించడమే, ఆయన వీఆర్‌కు కారణమంటున్నారు. దళితులను అకారణంగా అరెస్టు చేస్తే.. తదనంతర పరిణామాలు ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తాయని, చట్టపరంగానే వారిపై చర్యలు తీసుకుంటానని చెప్పినా, సదరు కీలక నేత అంగీకరించలేదని సమాచారం.

పైగా ఇసుక తవ్వకాలకు సంబంధించి చిన్ని అనే వ్యక్తికి అధికారికంగా అనుమతి వచ్చినప్పటికీ, పెదకూరపాడు కీలకనేత అనుచరులే ఇసుక వ్యాపారం చేస్తుండటం.. అది మీడియాలో రావడం.. దానిపై సీఎంఓ స్పందించి ఆగ్రహం వ్యక్తం చేయడంతో, వారిపై కేసులు నమోదు చేయడం సదరు కీలకనేతకు మింగుడుపడటం లేదట. పైగా పలు గ్రామాల్లో అనుమతి లేకుండానే రికార్డింగ్ డాన్స్‌లు వేయిస్తున్నారు.

ఆ వీడియోలు సోషల్‌మీడియాలో రావడంతో, సీఐ మాకినేని శ్రీనివాస్ ఆ డాన్సు పార్టీలు జరగకుండా అడ్డుకోవడం కూడా, పెదకూరపాడు టీడీపీ కీలకనేతకు మింగుడుపడకుండా మారింది. నిజానికి పెదకూరపాడులో సదరు టీడీపీ కీలకనేత వ్యవహారశైలితో, పోలీసులు నలిగిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పెదకూరపాడులో పనిచేయడం కత్తిమీద సాము అన్న భావన పోలీసు వర్గాల్లో స్థిరపడింది. ఆయనకు డబ్బు తప్ప, రాజకీయాల్లో అనుభవం లేకపోవడమే దానికి కారణమంటున్నారు.

ఇక నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం రాపూరు సీఐ విజయకృష్ణ ను కూడా వీఆర్‌కు పంపడంపై, కమ్మ వర్గంలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అదే సామాజికవర్గానికి చెందిన వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణకు సమాచారం ఇవ్వకుండానే, అక్కడ కమ్మ వర్గానికి చెందిన సీఐ విజయకృష్ణను వీఆర్‌కు పంపించడాన్ని ఎమ్మెల్యే రామకృష్ణ ప్రతిష్ఠగా తీసుకున్నారు. దీనిపై అమీతుమీ తేల్చుకునేందకు ఆయన సిద్ధమవుతున్నారు. ఆ మేరకు ఆయన సీఎం చంద్రబాబుతో భేటీ అయేందుకు సిద్ధవుతున్నట్లు తెలుస్తోంది.

వెంకటగిరి నియోజవర్గం సైదాపురం మండలం క్వార్డ్జ్ గనులకు ప్రసిద్ధి. అయితే గత ఎన్నికల ముందు వైసీపీ నుంచి ఒక పెద్ద తలకాయతోపాటు, నెల్లూరు కార్పోరేషన్‌లో ఓ బెట్టింగ్ రాజా కూడా టీడీపీలో చేరారు. ఎన్నికల్లో గెలిచిన ఆ ‘నెల్లూరు పెద్దారెడ్డి’.. తన అనుచరుడైన నెల్లూరు బెట్టింగ్ రాజాకు మైకా, క్వార్డ్ గనులు అప్పగించారట. ఆమేరకు నాలుగు క్వారీలు తీసుకున్న నెల్లూరు బెట్టింగ్ రాజా.. అక్కడి మైకా గనుల యజమానులతో భేటీ అయి, ‘‘మీ రాళ్లన్నీ నేను చెప్పిన రేటుకే నాకు ఇవ్వండి. లేకపోతే వ్యాపారం చేయవద్ద’’ని నిర్మొహమాటంగా చెప్పారట. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నెల్లూరు పెద్దారెడ్డి అక్కడ ప్యాక్టరీ నిర్మించనున్నందున, తవ్వినదంతా నెల్లూరు పెద్దారెడ్డి ఫ్యాక్టరీకే తాము చెప్పిన రేటుకు ఇవ్వాలని ఆదేశించారట.

అంటే పెద్దారెడ్డిగారు ఫ్యాక్టరీ నిర్మించేంత వరకూ, సైదాపురంలోని మైకా గనుల యజమానులెవరూ వ్యాపారాలు చేయవదన్నమాట! అక్కడ మైకా గనుల వ్యాపారం చేసేవారిలో కమ్మ వ్యాపారులే ఎక్కువ. ఇది మీడియాలో ప్రముఖంగా వచ్చినప్పటికీ, ఇంకా నెల్లూరు పెద్దారెడ్డి గారు తన అనుచరుడైన నెల్లూరు కార్పొరేషన్ బెట్టింగ్ రాజాకే మైకా గనులపై పెత్తనం కొనసాగిస్తున్నారంటే.. పార్టీలో ఏం జరుగుతోంది? ఆర్ధిక లావాదేవీల్లో ఎవరు ఎలా అంటకాగుతున్నారన్న దానిపై చర్చకు తెరలేచింది. మీడియాలో వచ్చినా పార్టీ-ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటే.. నెల్లూరు పెద్దారెడ్డితో ‘పెద్దల బంధం’ ఏ స్థాయిలో పెనవేసుకుపోయిందో స్పష్టమవుతోందని పార్టీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

కాగా జగన్ జమానాలో సైదాపురంలో అక్రమ మైనింగ్ వ్యవహారాలను, పులివెందులకు చెందిన అమర్నాధ్‌రెడ్డి అనే వ్యాపారి చూస్తున్నారు. విచిత్రంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా, అదే అమర్నాధ్‌రెడ్డి పెత్తనం చేయడాన్ని వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ సహించలేకపోయారట. దానితో తన నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ తవ్వకాలు-రవాణాను అడ్డుకోవాలని ఎమ్మెల్యే.. అక్కడి సీఐ విజయకృష్ణను ఆదేశించారట. దానితో రంగంలోకి దిగిన సీఐ విజయకృష్ణ.. అక్కడ పనులుచేస్తున్న పులివెందుల బ్యాచ్‌ను లాకప్‌లో వేశారట.

ఈ విషయం తెలిసిన నెల్లూరు బెట్టింగ్ రాజా సీఐకి ఫోన్ చేసి.. పులివెందుల బ్యాచ్‌ను విడుదల చేయకపోతే నిన్ను ట్రాన్స్‌ఫర్ చేయిస్తానని బెదిరించారట. అయినా వినకపోవటంతో, వ్యవహారం కాస్తా నెల్లూరు పెద్దారెడ్డి ఫ్యామిలీకి చేరిందట. హర్టయిన నెల్లూరు పెద్దారెడ్డి ఫ్యామిలీ.. ‘నెల్లూరు బెట్టింగ్ రాజా చెప్పినా వినవా? నీకు ఎక్కడా పోస్టింగ్ లేకుండా చేస్తా’’ అని హెచ్చరించారట. చెప్పినట్లుగానే గంటలో సీఐ విజయకృష్ణను వీఆర్‌లోకి పంపుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈవిధంగా కూటమి అధికారంలోకి వచ్చినా.. తమకు జరుగుతున్న అన్యాయం కొనసాగడంపై, కమ్మ వర్గం ఆగ్రహంతో రగిలిపోతోంది.

కాగా గుంటూరు రేంజ్ ఐజీ.. ఎమ్మెల్యేల సిఫార్సులకే తలొగ్గడంపై చాలాకాలం నుంచి చర్చ జరుగుతోంది. ఆయన క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకోకుండానే, ఎమ్మెల్యేలు చెప్పినవాటిపై రాజముద్ర వేయడంపై అటు కూటమిలోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. ‘ఐజీ వ్యక్తిగతంగా చాలామంచి అధికారి. కానీ ఆయన ఎమ్మెల్యేలు చెప్పిన ప్రతిదానికీ ఆమోదముద్ర వేస్తున్నారు. గతంలో ఏ ఐజీ ఇలా వ్యవహరించలేదు’ అని పార్టీ నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A RESPONSE