– ఎక్స్ వేదికగా జగన్ పై వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ధ్వజం
విజయవాడ: వంద ఎలుకలు తిన్న పిల్లి ప్రాయశ్చిత్తం కోసం కాశీ యాత్రకు వెళ్లినట్టుంది వైఎస్ ఆర్ సిపి నేత జగన్ రెడ్డి వ్యవహారశైలి. ప్రభుత్వం మందుల సరఫరాదారులకు వెయ్యి కోట్లకు పైగా బకాయిలు పెట్టి వెళితే కూటమి ప్రభుత్వం చెల్లించిందన్న విషయం తెలీదా ? బకాయిలు పెట్టి, మందుల సరఫరాను ఆపి, పేదల ఆరోగ్యంతో ఆడుకున్నది వైఎస్ ఆర్ పార్టీ.. ప్రభుత్వం కాదా?
మీరు గతంలో కమిషన్లకు పరిమితమైతే, అప్పులు చెల్లించి, పరిస్థితుల్ని చక్కదిద్ది ఇవాళ సంక్రమంగా మందుల్ని సరఫరా చేసి పేదల్ని కూటమి ప్రభుత్వం ఆదుకుంటోంది. ప్రజారోగ్యం పట్ల మీకు చిత్తశుద్ధి లేనందునే ప్రజలు దారుణంగా తిరస్కరించాక కూడా మీకు బుద్ధి రాలేదు. అసత్య ప్రచారాలు మాని ప్రజలు అలాంటి తీర్పు ఎందుకిచ్చారో ఆత్మ విమర్శ చేసుకోండి. ఇప్పటికైనా భాద్యతాయుతంగా నడుచుకోండి.
ప్రజారోగ్య పరిరక్షణకు కేంద్రం పెద్ద పీట
సంక్రమించని వ్యాధులైన మధుమేహం, రక్తపోటు మరియు నోటి , రొమ్ము , గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లకు 30 ఏళ్లు పైబడిన వారికి నూరు శాతం కవరేజీని నిర్ధారించేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇంటెన్సిఫైడ్ స్పెషల్ ఎన్‌సిడి స్క్రీనింగ్ డ్రైవ్‌ను ప్రారంభించడం పట్ల రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ హర్షాన్ని వ్యక్తం చేశారు.
తద్వారా ప్రజారోగ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తామన్న విషయాన్ని కేంద్రప్రభుత్వం మరోసారి రుజువు చేసిందని ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన ట్వీట్ లో మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆశా వర్కర్లు, ఎఎన్‌ఎంల ద్వారా ఇంటింటి సర్వే చేసే విధంగా చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం అవసరమైన సామగ్రిని అన్ని కేంద్రాలలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
పారదర్శకత కోసం రియల్ టైమ్ పర్యవేక్షణ ఉంటుందని, ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు వివిధ విభాగాలు సమన్వయంతో పనిచేస్తాయని మంత్రి తెలిపారు. కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలు చేసేందుకు రోజువారీ సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎన్సిడి రహిత భారత్ ను రూపొందించే దిశగా అడుగులు వేస్తోందని మంత్రి సత్యకుమార్ అభివర్ణించారు.