Suryaa.co.in

Andhra Pradesh

స్వచ్చాంధ్ర మిషన్ లో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి

• పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలు, పని ప్రాంతాల్లో పరిశుభ్రతను ఒక బాధ్యతగా తీసుకోవాలి
• స్వచ్చాంధ్ర అనేది ఒక వ్యక్తికో, ఒక సంస్ధకో చెందిన కార్యక్రమం కాదు
• పిసిబి గాలి నాణ్యతను పరిశీలించాలి… నెట్ జీరో కార్యక్రమాలు అమలు చేయాలి
• స్వచ్చాంధ్ర కార్యక్రమాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష
• 14 ఇండికేటర్స్ ఆధారంగా జిల్లాలకు ర్యాంకులు… మొదటి స్థానంలో ఎన్టీఆర్ జిల్లా… చివరి స్ధానంలో అల్లూరి జిల్లా

అమరావతి: స్వచ్చాంధ్ర లక్ష్యాల సాధనలో ప్రతి ఒక్కరు భాగస్వాముల కావాలని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. లక్ష్యాలు పెట్టుకోవడమే కాదని… వాటిని ఖచ్చితంగా చేరుకునేలా ప్రణాళికలు అమలు చేయాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో పరిశుభ్రత పెంచేందుకు… అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు అమలు చేస్తున్న కార్యచరణపై సీఎం సమీక్ష చేశారు.

ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహిస్తోంది. ప్రతి నెల ఒక థీమ్ తీసుకుని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జనవరి నెలలో న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ అనే అంశాన్ని థీమ్ గా తీసుకోగా… ఈ నెలలో సోర్స్ రీ సోర్స్ అనే అంశాన్ని థీమ్ గా తీసుకున్నారు. మన మూలాలు – మన బలాలు తెలుసుకునేలా, రాష్ట్రంలోని వనరులను ఎలా సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలి అనే దానిపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు.

జీవన ప్రమాణాలు పెంచడం, పర్యాటకరంగానికి ప్రోత్సాహం, పెట్టుబడులు ఆకట్టుకోవడం, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడం, నెట్ జీరోకు రాష్ట్రంలో పర్యావరణాన్ని తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని సిఎం సూచించారు. సంపూర్ణ స్వచ్ఛత వైపు అడుగులు వేయడం, పారిశుధ్యానికి ప్రాధాన్యత, ఘన వ్యర్ధాల నిర్వహణ, ప్రజారోగ్యం, ఇంకా కేంద్రం నిర్దేశించే లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. స్వచ్చాంధ్ర అంటే స్వచ్చమైన మనుషులు, స్వచ్ఛమైన మనసులు, స్వచ్ఛమైన పరిసరాలు, స్వచ్ఛమైన ఇళ్లు, కాలనీలు, ఊళ్లు అని అంతా గుర్తించాలని సిఎం అన్నారు. ఇళ్లతో పాటు… బహిరంగ ప్రదేశాలను, స్కూళ్లు, కాలేజ్ లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రార్థనా మందిరాలు, పరిశ్రమలు కూడా పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరం ఉందన్నారు.

దీని కోసం ప్రతి వ్యక్తి, ప్రతి ఉద్యోగి, ప్రతి సంస్థ, ప్రతి వ్యవస్థ పనిచేయాలన్నారు. ఇది ఏ ఒక్క శాఖకో… ఒక్క అధికారికో సంబంధించిన కార్యక్రమంగా చూడవద్దని… పరిశుభ్రత, పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో పాఠశాల విద్యార్థి నుంచి నాయకుల వరకు బాధ్యత తీసుకోలని సిఎం పిలుపునిచ్చారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. దీనికోసం ఆ కార్యాలయంలో ఉండే ఉద్యోగులు అంతా కలిసి పరిశుభ్రత, ఆహ్లాదకర వాతారవణం ఉండేలా కృషి చేయాలన్నారు.

బహిరంగ ప్రదేశాలను పరిశ్రుభ్రంగా ఉంచడంలో బాధ్యత లేకుండా వ్యవహరించాలని అన్నారు. రోడ్లపై చెత్త వేసి, చెట్లు నరికి వేసి, అంతా క్లీన్ గా ఉండాలి, పచ్చదనం ఉండాలి అని స్లోగన్స్ ఇస్తే కుదరదని అన్నారు. పౌరులు కూడా బాధ్యత వహిస్తే స్వచ్చాంధ్ర కల సాకారం చేసుకోవచ్చని సీఎం సూచించారు.

పరిసరాల పరిశుభ్రతతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా అంతా కృషి చేయాలి అన్నారు. గాలిలో నాణ్యతను పరిశీలించి సమస్య ఉన్న ప్రాంతాల్లో తగు చర్యలు తీసుకోవాలన్నారు. సమస్య పెరుగుతున్న సమయంలోనే గుర్తించి ఇప్పటి నుంచే అక్కడ పరిష్కారం దిశగా పనిచేయాలని సూచించారు. ఈ విషయంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వంటి శాఖల అధికారులు ఫోకస్ పెట్టాలని సూచించారు.

జిల్లాలకు ర్యాంకులు

స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్రలో భాగంగా పట్టణాభివృద్ది శాఖ, పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన కార్యక్రమాలపై అధికారులు ప్రోగ్రస్ ను సీఎంకు వివరించారు. మొత్తం 14 ఇండికేటర్స్ లో పెట్టుకున్న లక్ష్యాలను ముఖ్యమంత్రి ముందు ఉంచారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, పబ్లిక్ టాయిలెట్స్, డోర్ టు డోర్ కలక్షన్, సాలిడ్ వేస్ట్ సెగ్రిగేషన్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, కమ్యునిటీ సోక్ పిట్స్, క్లీన్ విలేజ్, ఒడిఎఫ్ ప్లస్ మోడల్ విలేజ్ వంటి అంశాల్లో ఆయా జిల్లాల్లో ప్రగతిపై సిఎంకు వివరించారు.

ఈ 14 ఇండికేటర్స్ ఆధారంగా జిల్లాకు ర్యాంకులు ఇచ్చారు. పట్టాణాభివృద్ది శాఖ పరిథిలో డోర్ టు డోర్ కలెక్షన్ కు 15 పాయింట్లు, సోర్స్ సెగ్రిగేషన్ కు 35 పాయింట్లు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కు 20 పాయింట్లు, లెగసీ వేస్ట్ క్లియరెన్స్ కు 10 పాయింట్లు, లిక్విట్ వేస్ట్ మేనేజ్మెంట్ కు 20 పాయింట్లు ఇచ్చారు. అలాగే పంచాయతీ రాజ్ శాఖలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి 15 పాయింట్లు, పబ్లిక్ టాయిలెట్స్ కు 10 పాయింట్లు, కమ్యునిటీ సోక్ పిట్స్ కు 10 పాయింట్లు, 100 శాతం డోర్ టు డోర్ చెత్త కలెక్షన్ కు 10 పాయింట్లు, ఓడిఎఫ్ ప్లస్ మోడల్ కు 20 పాయింట్లు చొప్పున ఇచ్చారు. ఇలా మొత్తం 200 పాయింట్ల ఆధారంగా జిల్లాల ప్రోగ్రస్ పై ర్యాంకులు ఇచ్చారు.

మొదటి స్థానంలో ఎన్టీఆర్ జిల్లా

మొత్తం 200 పాయింట్లకు గాను 129 పాయింట్లతో ఎన్టీఆర్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 127 పాయింట్లతో విశాఖ రెండో స్థానంలో, 125తో ఈస్ట్ గోదావరి 3వ స్థానం, 122తో అనంతపురం జిల్లా 4వ స్థానం, 120 పాయింట్లతో అన్నమయ్య 5వ స్థానం, శ్రీకాకుళం 6వ స్థానంలో ఉన్నాయి. 118 పాయింట్లతో కడప 7వ స్థానం, 117 పాయింట్లతో గుంటూరు 8వ స్థానం, 115 పాయింట్లతో బాపట్ల 9వ స్థానం, 115 పాయింట్లతో నెల్లూరు 10వ స్థానం, 115 పాయింట్లతో వెస్ట్ గోదావరి 11వ స్ధానం, 113 పాయింట్లతో అనకాపల్లి 12వ స్థానం, 111 పాయింట్లతో తిరుపతి 13వ స్థానంలో, 109 పాయింట్లతో కాకినాడ 14వ స్థానంలో ఉన్నాయి. 108 పాయింట్లతో ఏలూరు 15వ స్ధానం, 108 పాయింట్లతో కృష్ణ 16వ స్థానం, 105 పాయింట్లతో కోనసీమ 17వ స్థానం, 105 పాయింట్లతో మన్యం పాడేరు 18వ స్థానం, 105 పాయింట్లతో సత్యసాయి 19వ స్థానం, 103 పాయింట్లతో పల్నాడు 20వ స్థానం, 99 పాయింట్లతో కర్నూలు 21వ స్థానం, 99 పాయింట్లతో ప్రకాశం 22వ స్థానం, 94 పాయింట్లతో నంద్యాల 23వ స్థానం, 93 పాయింట్లతో విజయనగరం 24వ స్థానం, 88 పాయింట్లతో చిత్తూరు 25వ స్ధానం, 81 పాయింట్లతో అల్లూరి సీతారామరాజు 26వ స్థానంలో ఉన్నాయి.

LEAVE A RESPONSE