Suryaa.co.in

Andhra Pradesh

గత పాలకుల వైఫల్యం!

– ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలతో వరద ముప్పు
– కొల్లిపర మండల ముంపు ప్రాంతాల్లో పర్యటనలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని

కొల్లిపర, మహానాడు: ‘ఎన్నడూ లేని విధంగా వరదలు పోటెత్తాయి. గడిచిన ఐదేళ్లలో బ్యారేజీలు, డ్యాం ల నిర్వహణ పట్టించుకుని ఉంటే సమస్య సగం తగ్గి ఉండేది. ఇష్టారాజ్యంగా ఇసుక, మట్టి అక్రమ తవ్వకాల వల్లనే అపార వరద నష్టం సంభవించింది.’ అని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.

వరద ప్రభావిత ప్రాంతాలైన కొల్లిపర మండలంలోని పలు గ్రామాల్లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తో కలిసి పెమ్మసాని గురువారం పర్యటించారు. అత్తలూరిపాలెం, వల్లభాపురం, మున్నంగి, పిడపర్తి పాలెం, కొల్లిపర, బొమ్మవానిపాలెం గ్రామాల్లో పర్యటిస్తూ ముంపునకు గురైన అరటి, పసుపు, నిమ్మ తదితర పంటలను పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ ప్రకృతి విపత్తు వల్ల తలెత్తిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. పంటలపై రైతులు పెట్టిన పెట్టుబడి, పంట బీమా, ప్రత్యామ్నాయ పంటలు తదితర అంశాలపై రైతులతో చర్చించారు.

వ్యవసాయ, డ్రైనేజ్, ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడుతూ పంట నష్టం పై తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రాప్ బుకింగ్, బీమా తదితర చర్యల ద్వారా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందించే కాంపోనెంట్, సబ్సిడీ, బీమా తదితర ప్రభుత్వ పథకాల ద్వారా సహాయం అందేలా చూడాలన్నారు.

వైసీపీ వైఫల్యం

‘వైసిపి ప్రభుత్వం లో ఐదేళ్లు నిద్రపోయిన నాయకుల వైఫల్యం కారణంగానే ప్రస్తుతం ఈ స్థాయిలో నష్టం సంభవించింది. బలహీనపడ్డ కరకట్టల నిర్వహణ గాలికి వదిలేసి, బ్యారేజ్, డ్యామ్ ల నిర్వహణను పట్టించుకోకుండా ఐదేళ్లు కళ్ళు మూసుకున్నారు. అప్పటి ఆ తప్పులు మళ్ళీ జరగకుండా టీడీపీ ప్రభుత్వం తక్షణ చర్యలకు ఉపక్రమించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పంట బీమా తో పాటు ఎరువులు, విత్తనాల సబ్సిడీ ఇతర అంశాల పైన దృష్టి సారించింది. ప్రస్తుత వరద నష్టం, సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి సహాయ చర్యలు చేపడతాం.’ అని పెమ్మసాని వివరించారు. ఈ కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా, దుగ్గిరాల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ వంగ సాంబిరెడ్డి, మాజీ సర్పంచ్ మేదరమెట్ల శ్రీనివాసరావు తదితర గ్రామ మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.

లంక గ్రామాల్లో పంట నష్టం

మాజీ మంత్రి ఆలపాటి రాజా మాట్లాడుతూ.. లంక గ్రామాల్లో పంట నష్టం తీవ్రంగా జరిగింది. వరి పంటకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అన్నవరపు లంక, కొత్తూరు లంకలో పంటలు పూర్తిగా నీట మునిగాయి. పరిస్థితిపై కేంద్ర సహాయ మంత్రి గురువారం, శుక్రవారం కొల్లిపర, తెనాలి మండలాల్లో పర్యటించి సమస్యలను పరిశీలించబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో హుద్ హుద్ తుపాను తర్వాత యుద్ధ ప్రాతిపదికను తీసుకున్న చర్యల విధంగానే నేటి వరద నష్టం తర్వాత కూడా సహాయక చర్యలను అమలు చేస్తున్నారు. ఆ కారణంగానే రెండు రోజుల్లో విద్యుత్ సరఫరా అందుబాటులోకి వచ్చింది. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి పూర్తిగా భోజనం ఇతర సదుపాయాలు కల్పించగలిగారు.

LEAVE A RESPONSE