– రైతు చేతుల్లోనే భారతదేశం భవిష్యత్తు
– ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ప్రోటీన్ అవసరాలను తీర్చడంలో మనది కీలక పాత్ర
– పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచి, దేశాన్ని ఆహార భద్రతలో స్వావలంబన దిశగా తీసుకెళ్లడం ప్రధాని మోదీ లక్ష్యం
– ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పీఎం ధన్ ధాన్య యోజన – పప్పుధాన్య ఆత్మనిర్భరత మిషన్ ప్రారంభంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు
గుంటూరు : రైతు సంక్షేమమే దేశ అభివృద్ధికి పునాది అని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలోని డబల్ ఇంజన్ సర్కార్ రైతులకు మేలు చేసే కార్యక్రమాల అమలుకు చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరు లాంలోని ఆచార్య ఎన్ జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం కృష్ణా అడిటోరియంలో శనివారం న్యూడిల్లీ నుంచి ప్రధాని నరేంద్రమోదీ పీఎం ధన్ – ధాన్య కృషి యోజన మరియు పప్పు ధాన్య ఆత్మ నిర్భరత మిషన్ ప్రారంభోత్సవ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పీఎం ధన్ ధాన్య యోజన రైతుల ఆర్థిక శక్తివంతతకు దారితీస్తుందని, పప్పుధాన్య ఆత్మనిర్భరత మిషన్ ప్రోటీన్ భద్రతలో స్వయం సమృద్ధి దిశగా పెద్ద అడుగు అని ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా రూ. 42,000 కోట్లు విలువైన వ్యవసాయ, మత్స్య, పశుసంవర్ధక తదితర అనుబంధ రంగాలకు చెందిన ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా పీఎం ధన్ – ధాన్య కృషి యోజన ద్వారా దేశంలో 100 జిల్లాల్లో వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి రైతులకు కేంద్ర ప్రభుత్వం 30 పథకాల ద్వారా ప్రోత్సాహాన్ని అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారని, పంటల వైవిధ్యంతో రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యం అని, ప్రధాని మోదీ దృష్టిలో ప్రతి రైతు సమృద్ధి భవిష్యత్తు చిహ్నం అని చెప్పారు.
పీఎం ధన్ – ధాన్య కృషి యోజనలొ రాష్ట్రంలో ఎంపికైన అల్లూరి సీతారామరాజు, అనంతపురం, శ్రీ సత్య సాయి, అన్నమయ్య జిల్లాలలో రానున్న ఆరు సంవత్సరాలు అవస్థాపన సౌకర్యాలపై దృష్టిపెట్టి వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉత్పత్తుల పెంపు, నాణ్యతపై దృష్టి, పంట అనంతరం నష్టాలు తగ్గించడం ప్రధాన లక్ష్యంగా వివిధ పథకాల ద్వారా ప్రోత్సాహం అందిస్తారు అన్నారు.
పప్పు ధాన్యాల ఉత్పత్తి-ఉత్పాదక పెంచటంపై ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటారు అని తెలిపారు. దేశంలో ఆహార ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించటం జరిగిందన్నారు. ప్రస్తుతం ఆహార అలవాట్లు మారిన నేపథ్యంలో ప్రోటీన్ తో కూడిన పప్పు ధాన్యాలను ప్రజలకు అందచేయటానికి పప్పుధాన్యాల మిషన్ ద్వారా పప్పు ధాన్యాల సాగును ప్రోత్సహించనున్నారన్నారు.
చివర గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది
రైతులు సాగుచేసిన పప్పు ధాన్యాలను చివర గింజ వరకు మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అచ్చెన్నాయుడు అన్నారు. రైతులకు అధిక దిగుబడి విత్తనాలు, ఆధునిక సాంకేతిక సాయం, మార్కెట్ అనుసంధానం లభించనుందని అన్నారు. ప్రతి ఎకరా రైతు ధనవంతుడవ్వాలనే సంకల్పంతో ఈ పథకాలు ప్రారంభించారని తెలిపారు. పంట నష్టాలకు భరోసా – మార్కెట్ సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రైతులు పథకాల ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.
కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న రైతులను ఆనందంగా ఉంచడానికి అన్ని సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించి ముందుకు వెళుతున్నాం అన్నారు. రైతులు ఇబ్బంది పడకూడదని బర్లీ పొగాకును రూ.270 కోట్ల తో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయటం జరిగిందని, మామిడి ,కోకో , ఉల్లి ని మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు మేలు చేసిందన్నారు. రైతుల నుంచి సీసీఐ ద్వారా సక్రమంగా పత్తి కొనుగోలుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.
పంటల మార్పునకు రైతులు ముందుకు రావాలి
రైతులు ఒకే విధమైన పంటలను సాగు చేయకుండా ప్రకృతి సాగు పద్ధతులను అవలంబించాలన్నారు. విదేశాలకు ఎగుమతులకు వీలుగా పంట ఉత్పత్తుల్లో నాణ్యతను పెంపొందించే సాగు విధానాలను పాటించాలన్నారు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ అవసరమైన పూర్తి సహాయ సహకారాలను నిరంతరం అందిస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు.
ప్రతి ఎకరా రైతు ధనవంతుడవ్వాలని, ధాన్య పంటలతో పాటు పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచి, దేశాన్ని ఆహార భద్రతలో స్వావలంబన దిశగా తీసుకెళ్లడం ప్రధాని గారి లక్ష్యం అని మంత్రి అన్నారు. రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని, పంటల వైవిధ్యాన్ని పెంచి, ఆదాయాలను రెట్టింపు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం రైతు కష్టానికి గౌరవం ఇవ్వడం, మార్కెట్ సదుపాయాలు కల్పించడం, పంట నష్టాలకు భరోసా ఇవ్వడం ఇవన్నీ మా ప్రభుత్వ ప్రాధాన్యతలు అని తెలిపారు.
ప్రత్తిపాడు శాసన సభ్యుడు బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ రైతును రాజుగా చేయాలని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అన్ని కార్యక్రమాలను అమలు చేస్తున్నారు అన్నారు. రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధరలు అందించడంతో పాటు సకాలంలో ఎరువులు విత్తనాలను పంపిణీ చేస్తున్నారని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు సమర్థవంతంగా పనిచేస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఎక్స్అఫిషియో సెక్రటరీ బి రాజశేఖర్, ప్రత్తిపాడు శాసనసభ్యులు బూర్ల రామంజనేయులు, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం ఉప కులపతి డా.ఆర్.శారద జయలక్ష్మి దేవి , పౌర సరఫరాల సంస్థ వీసీ అండ్ యండీ ఎస్.ఢిల్లీ రావు , వ్యవసాయ శాఖ డైరెక్టర్ డా.మనజీర్ జిలానీ సామూన్ , సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఏ.పీ సీడ్స్ డైరెక్టర్ సతీష్ , పీషరీస్ కమిషనర్ రవి శంకర్ నాయక్ , ఆర్ వై ఎస్ ఎస్ సీఈఓ వై.రామారావు , ఉద్యాన శాఖ ఎడిహెచ్ సి.వి. హరినాథ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వర రావు, ఉద్యాన శాఖ అధికారి రవీంద్ర బాబు, పశు సంవర్ధక శాఖ జేడీఏ సత్యనారాయణ , ఏ.పి.సి ఎన్ ఎఫ్ పీడీ రాజకుమారి, వ్యవసాయ శాఖ రాష్ట్ర అధికారులు , ఆచార్య ఎన్జీ రంగా విశ్వ విద్యాలయ అధికారులు, రైతులు పాల్గొన్నారు