– రేవంత్ రెడ్డి ప్రభుత్వ బెదిరింపు యత్నాలను న్యాయ వ్యవస్థ తిప్పికొట్టింది
– బీఆర్‌ఎస్ నేత డా. శ్రవణ్ దాసోజు
హైదరాబాద్:: రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వ అక్రమాలు, అణచివేత చర్యలను బీఆర్‌ఎస్ నేత డా. శ్రవణ్ దాసోజు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ఉద్యమకారుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయ దళిత విద్యార్థి నాయకుడు, మరియు మాజీ ఎస్‌సి/ఎస్‌టి కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో ఈ ప్రభుత్వం చూపించిన దౌర్జన్యాలకు న్యాయస్థానం మరోసారి చరమగీతం పాడిందని పేర్కొన్నారు.
“ఇది బలం కలిగిన ప్రభుత్వం కాదు, భయం, అవినీతి, డిక్టేటర్ భావజాలంతో నడిచే పాలనా యంత్రాంగం. సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకు ప్రతిఒక్కరినీ బెదిరించి, ప్రజాస్వామ్య హక్కులను అణగదొక్కే ప్రయత్నం చేస్తోంది. బంజారాహిల్స్ పోలీసుల వైఖరిని ఘాటుగా విమర్శిస్తూ .. ఒక ఎమ్మెల్యే ఫిర్యాదును స్వీకరించి తమ రాజ్యాంగ బాధ్యతను నెరవేర్చాల్సిన పోలీసు విభాగం, దానికి విరుద్ధంగా ఫిర్యాదు చేసేందుకు వచ్చినవారిపైనే అక్రమ కేసు నమోదు చేయడం అత్యంత దారుణం. పోలీసులు తమ విధిని విస్మరించి ప్రభుత్వం చేతిలో బొమ్మల్లా వ్యవహరించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పుగా మారింది,” అని దాసోజు పేర్కొన్నారు.
న్యాయస్థానాన్ని కృతజ్ఞతలతో ప్రశంసిస్తూ “ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చేయడం ప్రభుత్వానికి నైతిక దెబ్బ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం తెలంగాణను “భయానక పోలీస్ రాజ్”గా మార్చిందని ఆరోపిస్తూ, “ప్రజల హక్కులు కాపాడాల్సిన ప్రభుత్వం వాటిని కాలరాస్తోంది. వాదోపవాదాలను వినడానికి బదులుగా ఆందోళనలు అణచివేయడం ధోరణిగా మారింది,” అని తీవ్రంగా విమర్శించారు.
తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని మోసం చేసి, ప్రజాస్వామ్యాన్ని క్షీణింపజేసిన పాలనగా ఈ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “తెలంగాణ ప్రజల ఆత్మబలం, ప్రజాస్వామ్య విశ్వాసం ఎప్పటికీ తగ్గదు. ప్రజల న్యాయ హక్కులు పునరుద్ధరించేవరకు ఈ పోరాటం ఆగద”ని పేర్కొన్నారు .