రాజద్రోహం కేసు పెట్టడం ప్రజాద్రోహం !

ప్రభుత్వతీరు, అవినీతి పాలనను ప్రశ్నించిన వారిపై పోలీసులు రాజద్రోహం కేసులు పెట్టడం ప్రజాద్రోహంగా భావించాలి. అధికారంలో ఉన్నవారిని విమర్శించడాన్ని కుట్ర, రాజద్రోహం అంటూ కేసులు పెట్టడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. భావప్రకటనా స్వేచ్చను హరించే ఇలాంటి సెక్షన్లను ప్రజలపై ప్రయోగించడం తగదని ఉన్నత న్యాయస్థానాలు చెప్పినా, పోలీసుల బుర్రకు ఎక్కక పోవడం దురదృష్టకరం.

ఐ పి ఎస్ చదివిన వారు కూడా ఈ సూక్ష్మ విషయం అర్థం చేసుకో కుండా, పాలకులకు తొత్తులుగా మారి తప్పుడు కేసులు పెట్టడం వారి వృత్తి ఉద్యోగానికే కళంకం. తాజాగా గుంటూరు సి ఐ డి కోర్టు న్యాయమూర్తి ఒక రాజద్రోహం కేసును తిరస్కరించడాన్ని పోలీసులు గమనించాలి. ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిపై పోస్టులు పెట్టిన రాజుపాలెపు ఫణిపై ఏపీ సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు.

దీనిపై పోలీసులు నివేదించిన రిమాండు రిపోర్టును గుంటూరులోని అరో అదనపు కోర్టు ఇంఛార్జి జడ్జి సయ్యద్ జియావుద్దీన్ తిరస్కరించారు. నిందుతుడిపై మోపిన 121, 124ఏ రాజద్రోహంతో పాటు పలు తీవ్రమైన సెక్షన్లు బనాయించారని, అవి ఈ కేసుకు వర్తించవని న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఏపీ సీఐడీ పోలీసులు ఎంపీ రఘు రామకృష్ణ రాజుపై రాజద్రోహం కేసు పెట్టి హింసించిన విషయం అందరికీ తెలిసిందే. తనను కస్టడీలో కాళ్లపై కొట్టి చంపడానికి ప్రయత్నం చేశారని రాజు అరోపణలు చేశారు. అలాగే తనపై అక్రమంగా బనాయించిన కేసు కొట్టివేయాలని అయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో అయన పలు కీలక అంశాలను ఆయన ప్రస్తావించారు. అలాగే రాజద్రోహం కేసు పెట్టాల్సిన అవసరాన్ని ప్రశ్నించారు.

ఈ కేసు తీర్పు వెలువడాల్సి ఉన్న దశలో మళ్ళీ సిఐడి పోలీసులు సంక్రాంతి పండుగ సమయంలో విచారణకు రమ్మని రాజుకు నోటీసులు ఇచ్చారు. దీనిపై అయన సమయం తీసుకున్న విషయం తెలిసిందే. అసలు ప్రజాస్వామ్య దేశంలో రాజద్రోహం అన్నదే అర్థంలేని మాట. ఇదే విషయాన్ని మహోన్నత న్యాయమూర్తులు చెప్పారు. అయినా ఏపీ సీఐడీ పోలీసుల బుర్రకు ఎక్కక పోవడం దురదృష్టకరం. ఇకనైనా జగన్ మోహన్ రెడ్డి లాంటి నియంత పాలకులకు వత్తాసు పలకడం మానుకుని పోలీసులు రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాలి.

– డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి
సామాజిక వేత్త
సెల్ :9450584400

Leave a Reply