రూ.1 లక్ష విలువ గల చెక్కును అందజేసిన జేసీ మయూర్ అశోక్
విజయనగరం, మే 23: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందన మేరకు రేగిడి ఆముదాలవలస మండలం కందిశ గ్రామానికి చెందిన చిన్నారి పొనగంటి హేమలత చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి విడుదలైన ఆర్థిక సాయాన్ని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ చేతుల మీదుగా అందజేశారు.
ఇటీవల భోగాపురం విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రిని చిన్నారి హేమలత తల్లిదండ్రులు కన్నబాబు, లక్ష్మీ లావణ్య కలిసి సమస్యను విన్నవించుకున్నారు. చిన్నారికి కంటి క్యాన్సర్ ఉందని సాయం అందజేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి సంబంధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం జేసీ మయూర్ అశోక్ తన ఛాంబర్లో చిన్నారి తల్లిదండ్రులకు రూ.1 లక్ష విలువ గల చెక్కును అందజేశారు.జిల్లా రెవెన్యూ అధికారి ఎం. గణపతిరావు, రేగిడి తహశీల్దారు కళ్యాణ చక్రవర్తి, సామాజిక కార్యకర్త పి. సిద్దార్థ, తదితరులు పాల్గొన్నారు.