తిరుపతి నగర భవిష్యత్ ప్రణాళికలపై దృష్టి పెట్టండి!

Spread the love

తిరుపతి నగర ప్రజల అత్యుత్సాహం,రాజకీయ నాయకుల నిర్లక్ష్యం,అధికారుల వైఫల్యం.. నేడు శాపంగా మారి ఆధ్యాత్మిక నగరం జలప్రళయంగా మారింది. తిరుపతిలోని లోతట్టు ప్రాంతాలలో వర్షపు నీటి ప్రవాహం తగ్గే వరకు వెంటనే టీటీడీ విద్యాసంస్థలలో,శ్రీనివాసం మాధవం వసతి సముదాయాలలో నిర్వాసితులకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి అన్నప్రసాదాలు అందించండి.
తిరుపతి నగరంలో పూర్తిగా ఇల్లు కోల్పోయి నిరాశ్రయులైన వారికి, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించి ఆదుకోవాలి! తిరుపతి నగరంలో గత 25 సంవత్సరాలలో ఎన్నడూ చూడని కుంభవృష్టి


వర్షపాతానికి జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.తిరుపతి నగర ప్రజల నిర్లక్ష్యమా అధికారుల తప్పిదమా అన్నది పక్కన పెట్టి రాబోవు 25 సంవత్సరాలలో ఎటువంటి వర్షపాతాన్ని అయినా ఎదుర్కొనే విధంగా ముందస్తు నగర ప్రణాళికలు అన్ని శాఖల సమన్వయంతో రూపొందించాలి.
తిరుమల శేషాచలం కొండల్లోని సప్తగిరులలో “సప్త సముద్రాలను” తలపించేలా ఎక్కడ చూసినా వర్షపు నీరు జాలువారుతూ నగరంలోకి ప్రవేశి జలప్రళయంగా మారింది! కపిలతీర్థం,మాల్వాడి గుండం నీటి సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం,టీటీడీ, నగరపాలక సంస్థ,ఇరిగేషన్ సహకారంతో భవిష్యత్ తరాల కోసం “కపిలేశ్వర రిజర్వాయర్” ఏర్పాటు పై ఇప్పటికైనా దృష్టి సారించండి!తిరుపతి నగరంలో పూర్వం ఉన్న చెరువులలో నేడు నివాసాలు ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించడంతో నగరం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది.
తిరుపతి పరిసర ప్రాంతాలలోని చెరువుల భద్రత “గాలిలో దీపంలా” మారింది ఉన్న చెరువులను పటిష్ట పరిచి ప్రమాదాలు,ప్రాణ నష్టం జరగకుండా ఇరిగేషన్ శాఖ అప్రమత్తం అవ్వాలి. కళ్యాణి డ్యామ్ గేట్లు ఎత్తేసిన కారణంగా స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతాలలోని గ్రామ ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ కల్వర్టు లు,కాజ్ వేలు దాటకుండా పోలీసుల సహకారంతో రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు ప్రమాదపు సూచిక బోర్డులను వెంటనే ఏర్పాటు చేయాలి!

– నవీన్ కుమార్ రెడ్డి
కాంగ్రెస్ నేత
రాయలసీమ పోరాట సమితి కన్వీనర్
ఐ ఎన్ టి యు సి జిల్లా గౌరవ అధ్యక్షులు

Leave a Reply