వార్నీ.. పొట్టపగల!

వేడివేడి ఉప్మా తింటుంటే – అల్లం ముక్క నోటికి తగిలినట్టూ…
దోరగా వేగిన పెసరట్టు కొరికితే – జీడిపప్పు పంటి కిందకి వచ్చినట్టూ…
మిర్చిబజ్జి ఆబగా తినబోతే – నాలిక సుర్రుమన్నట్టూ…
పక్కనే ఉన్న వొగ్గాణీ – గుప్పెడు బొక్కినట్టూ…
పచ్చి మిరపకాయలు తగిలించి – రోట్లో తొక్కిన టమాట పచ్చడి పేద్ద ముద్దలు కలిపినట్టూ…

మామిడికాయ బద్ద నవులుతూ – గుండమ్మ కథ సినిమా చూస్తున్నట్టూ…
పీకల్దాక పెరుగన్నం తినేసి – ఉసిరికాయ బుగ్గనెట్టుకున్నట్టూ…
దిబ్బరొట్టె మొత్తం – నేనే తినేసినట్టూ…
వేపచెట్టు కింద మడతమంచమెక్కి చెంబుడు నిమ్మకాయ మజ్జిగ తాగి పడుకున్నట్టూ…
చద్దన్నంలో – ఆవకాయ వాయ కలిపినట్టూ…
పప్పుచారులో గిన్నెడు – చిన్నుల్లిపాయలు, దోసకాయ, బెండకాయ, ములక్కాయ ముక్కలు తేల్తున్నట్టు…

రోడ్దు మీద కొబ్బరి బొండాం కొట్టించుకుంటే – లేత కొబ్బరి ఉన్నట్టూ..
లేత లేత ముంజెలు వేలితో పొడుచుకుని – లెక్కెట్టకుండా తిని మూతి తుడుసుకున్నట్టూ…
కమ్మగా ఉడికిన ముద్దపప్పు అన్నంకి – దోసబద్దల పచ్చడి తోడైనట్టూ…
చుక్కకూర పప్పు కుతకుతలాడించి – వేడివేడిగా అమ్మ చపాతీ చేసినట్టూ…
నూకలన్నంలో – వెన్న తీయని మజ్జిగ పోసుకుని జుర్రినట్టూ…
పులగం అన్నంలోకి – ఘాటుగా పచ్చిపులుసు పోసినట్టూ…
చెట్టు నుంచి తెంపుకొచ్చిన లేత వంకాయలు – మగ్గీ మగ్గగానే పళ్ళెంలోకి వడ్డించినట్టూ…

సావిట్లో గేదెలతో పోటీపడి – తేగలు తెగ తినేసినట్టూ…
దోర పచ్చికొబ్బరి లోకి – బెల్లం గెడ్డ జత కుదిరినట్టూ…
తిరుపతి లడ్డూ మొత్తం – అచ్చంగా నాకే ఇచ్చేసినట్టూ…
పరపరలాడే పచ్చిమావిడికాయలు – ఉప్పూ కారం దట్టించి కొరికినట్టూ…
పండిన వేపకాయ – ఎవరూ చూడకుండా చీకిపారేసినట్టూ…
టమాటా పప్పుకి తోడు – ఊరమిరపగాయలూ , వడియాలూ , అప్పడాలతో వచ్చినట్టూ…
మసాలా చాయ్ – ముంత మసాలాతో తాగినట్టూ…
బంగినపల్లి మామిళ్ళు – పరకల కొద్దీ తినేసినట్టు…

వేడి వేడి బెల్లం జిలేబీ ,
రోడ్దు మీద కొనీ కొనగానే – కారు డోర్ వేసుకుని గుటుక్కుమనిపించినట్టు…
బొగ్గుల మీద కాల్చిన మొక్కజొన్న పొత్తులు – ఒలుచుకు తిన్నట్టూ…
లోటాడు మద్రాస్ ఫిల్టర్ కాఫీ – స్టార్ బక్స్ లో దొరికినట్టూ…
బట్టీలోంచి తెచ్చిన బఠాణీలు – పటపటమని నమిలేసినట్టూ…
అలా చెట్టు నుంచి దూసిన కరేపాకు – తాలింపులో వేసి కొత్తటుకులు వేయించినట్టూ…

సినిమా హాల్ లో పాప్కార్న్ – ఎవరన్నా తెచ్చిపెట్టినట్టూ…
చిన్నా పెద్దా తేడాలేకుండా – రసాలు గుటకలేసినట్టూ…
కొబ్బరి బూరెల కోసం చేసిన – చలివిడి కొట్టేసి తిన్నట్టూ…
బిడ్డనెత్తుకొచ్చిన సారెలో – పంచదార చిలక నాకే ఇచ్చినట్టూ..
కొబ్బరి మామిడికాయ ముక్కలు – కేజీలు ఖాళీ చేసినట్టూ…
మా పెద్ద రేగు చెట్టు – ఇంకా బిందెలు బిందెలు కాయలు కాస్తున్నట్టూ…
కస్మిస్ లని – కేజీల్లో మాయం చేసేసినట్టూ…

దోర జాంకాయాలు చెట్టునుంచి ఎతికెతికి కోసుకుని – పరపరా నమిలేసి తిన్నట్టూ…
సన్నసెగన మరగకాగిన ఉలవచారు తాలింపు – ఘుప్పుమన్నట్టూ…
వానాకాలంలో పకోడీల వాసన – గాలిలో తేలి వచ్చినట్టూ…
తంపడకాయలు, కాల్చిన పచ్చేరుసెనక్కాయలు – కలిసి దొరికినట్టూ…
పుల్లైసు బండి – పరిగెత్తకుండానే మన గుమ్మం ముందే ఆగినట్టూ…
పొట్ట పగిలిపోడానికి రడీగా ఉన్న సీతాఫలం – చెట్టునే మగ్గి దొరికినట్టూ…
దోరగా పండిన చింతకాయ – చిటుక్కున చేతికి అందినట్టూ…

పాలసపోటా చెట్టుకింద నిలబడి – అలాగ్గా కోసుకు తిన్నట్టూ…
చిన్నుసిరికాయల చెట్టు – స్కూలుకెళ్ళే దారిలో కొమ్మజాపి రమ్మన్నట్టూ…
ఎర్రగా వేగిన బంగాళా దుంప కూరకి – రసం తోడైనట్టూ..
వాక్కాయల చెట్టొకటి తోవెమ్మటే ఉండి రారమ్మన్నట్టూ…
కణుపు చిక్కుళ్ళు – చట్టినిండా ఉడకబెట్టి అమ్మ వాకిట్లోకి వెళ్ళినట్టూ…
మావిడితాండ్ర పొరలుపొరలు తీసితింటూ – ముచ్చట్లు చెప్పుకున్నట్టూ..

సాంబారు పెట్టిన్నాడే – దొండకాయ వేపుడు కూడా చేసినట్టూ..
ఎర్రని సీమతుమ్మకాయలు – కొక్కెం ఊడిపోకుండానే ఒడినిండా దొరికినట్టూ..
గుళ్ళో పక్కనోళ్ళు – వాళ్ళ వాటా పులిహోర కూడా నాకే ఇచ్చినట్టూ..
వగరే తెలియని కండపట్టిన నేరేళ్ళ కొమ్మ – చేతికందినట్టూ…
విరగ కాసిన ఈత చెట్టొకటి – పిలిచి కాయలిచ్చినట్టూ…
బెల్లం గవ్వలు – ఒక పిసరు పాకం తక్కువై తీగ సాగినట్టూ…
వర్షం పడుతుంటే – పునుగుల పళ్ళెం చేతిలోకి వచ్చినట్టూ…

వేయించిన ఎండుమిరపకాయలు వెల్లుల్లి వేసి – రోట్లో తొక్కిన గోంగూర పచ్చడి వెన్నపూసేసుకుని వాయ కలిపినట్టూ..
భోజనాల బల్ల దగ్గర ప్రశాంతంగా కూర్చుని – పాలుపోసి వండిన కూరలో ములక్కాయ ముక్కల్ని ఓ పట్టుపట్టినట్టూ…
ఆవడల మీద బూందీ మిక్చరు వేసుకుని – మిట్టమధ్యాహ్నం ఎండలో హాయిగా తింటున్నట్టూ…
telugu-tiffensపూరీలు పున్నమి చంద్రుళ్ళా పొంగి – కమ్మని కూరతో తెగతిన్నట్టూ..
ఉల్లిపాయలు జీలకర్ర కరేపాకు దిట్టంగా వేసిన రవ్వట్టు – గుండ్రని డైనింగ్ టేబుల్ సైజులో పెట్టినట్టూ..
గడ్డపెరుగులో – నిమ్మకాయ బద్ద నంజుకుని నాకేసినట్టు…
పానీపూరీలు – లొట్టలేసేంత పుల్లగా వర్రగా కుదిరినట్టూ…
దప్పళం గిన్నె – మొట్టమొదలు నాకే ఇచ్చినట్టూ…
ఆఖరికి ఏడేడి ఇడ్లీలు దూదిలా మెత్తగా పొగలు కక్కుతుంటే – నేతిగిన్నెలో ముంచి కారప్పొడి అద్దినట్టూ…
కమ్మని కలలు కంటూ మాంచిగా నిద్రలో ఉంటే, కుళ్ళుమోతు అలారం పీడకలొచ్చినట్టు మోగిచచ్చింది!

ఇదంతా ఎందుకంటే …..
ఈ రోజుల్లో ఇది దొరకడం…
దొరికినా తిని అరిగించుకునే శక్తిని కోల్పోయాం కదా‌!

– హరికృష్ణ