Suryaa.co.in

Andhra Pradesh

బడ్జెట్ కేటాయింపులతో ఫోరెన్సిక్ కు ఊతం..ఫింగర్ ప్రింట్ కు ప్రాణం

ఈసారి బడ్జెట్ లో హోంశాఖకు ప్రత్యేక కేటాయింపులు
అప్పా,ఆక్టోపస్, గ్రే హౌండ్స్ ఏర్పాటుకు నిధులివ్వాలని ప్రతిపాదన
ఈగల్ వ్యవస్థ, జైళ్ల నిర్మాణం, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లకు ప్రాధాన్యత
ఇన్వెస్టిగేషన్ ఛార్జీల అంచనాను పెంచాలని హోంమంత్రి ప్రతిపాదన
కేంద్ర ప్రభుత్వ నిధులు విరివిగా రాబట్టి పోలీస్ శాఖను పటిష్టం చేస్తాం
అన్ని ఆధారాలతోనే వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ అరెస్ట్
కూటమి నాయకులను అరెస్ట్ చేస్తే సక్రమం..వైసీపీ నేతలయితే అక్రమమా?
గుర్రంకొండలో యువతి యాసిడ్ దాడి ఘటన కలచివేసింది
వీడియో కాల్ చేసి మాట్లాడి బాధిత కుటుంబానికి భరోసా
బుల్లెట్లతో ఉన్న గన్ మ్యాగ్జైన్ అదృశ్యం నిర్లక్ష్యమే
కీలక కేసులలో నిబద్ధతే తప్ప కూటమి ప్రభుత్వ నిర్లిప్తత లేదు
3 నుంచి 6 నెలల కాలంలోనే ఫోక్సో కేసులలో శిక్షల అమలు
శనివారం తొలిసారి జరిగే కీలక సదస్సుకు ముఖ్య అతిథిగా హోంమంత్రి వంగలపూడి అనిత

అమరావతి: హోంశాఖకు 2025-26 బడ్జెట్ కేటాయింపులతో ఫోరెన్సిక్ కు ఊతమందించి..ఫింగర్ ప్రింట్ కు ప్రాణం పోస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఈ సారి బడ్జెట్ లో హోంశాఖకు ప్రత్యేక కేటాయింపులు జరపాలని కోరినట్లు ఆమె స్పష్టం చేశారు. సచివాలయంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల అధ్యక్షతన జరిగిన హోం,విపత్తు నిర్వహణ శాఖల ప్రీ-బడ్జెటరీ సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

బడ్జెట్ లో అదనంగా కేంద్ర ప్రభుత్వ నిధులు రాబట్టడంపై ప్రత్యేక కసరత్తు చేస్తున్నామని హోంమంత్రి ఈ సందర్భంగా హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. పోలీస్ వాహనాలకు ప్రభుత్వం ఇచ్చే ఆయిల్ ను 150 లీటర్ల నుంచి 300 లీటర్లకు పెంచాలని హోంమంత్రి అనిత ఆర్థిక మంత్రి కేశవ్ కు ప్రతిపాదించారు. గత ఐదేళ్లలో ఎంతో కీలకమైన ఇన్వెస్టిగేషన్ ఛార్జ్ లు ఇవ్వలేదన్నారు. వచ్చే బడ్జెట్ లో గత ఛార్జీల అంచనాలు పెంచి బడ్జెట్ లో ప్రత్యేకంగా కేటాయించాలని హోంమంత్రి కోరారు.

గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో పోలీస్ స్టేషన్లు క్షేత్రస్థాయిలో చాలా అధ్వాన్నంగా తయారయ్యాయని హోంమంత్రి పేర్కొన్నారు. గంజాయి, సైబర్ క్రైమ్ లతో జైళ్లలో ఖైదీలు పెరుగుతున్న నేపథ్యంలో కొత్త జైలు భవనాలను నిర్మించడానికి బడ్జెట్ ఇవ్వాలని హోంమంత్రి తెలిపారు. ఇటీవల నెల్లూరు జిల్లా కస్తూర్భాగాంధీ వసతిగృహంలో నిందితుడిని పట్టుకోవడానికి సీసీ కెమెరా లేకపోవడం వల్ల కష్టసాధ్యమైందన్నారు.

గత ఐదేళ్లలో శాఖల వారీగా ప్రతి ఏటా ఐదు శాతం పెంచడం మినహా ఏనాడు చర్చ జరగడం, కేటాయింపులకు నోచుకోవడం జరగలేదని హోంమంత్రి అనిత విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రజా పోలిసింగ్ విధానంతో నేరనియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతోందన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే ఏపీలో నేరాలు 9 శాతం తగ్గుముఖం పట్టడమే అందుకు నిదర్శనమన్నారు.
పోలీస్ అకాడమీ ఏర్పాటుకు రూ.15 కోట్లు కేటాయించాలని హోంమంత్రి అడిగారు. కేసుల దర్యాప్తు, నేరస్థులను పట్టుకోవడంలో కీలకమైన అప్పా, ఆక్టోపస్, గ్రే హౌండ్స్ ల ఏర్పాటుకు సహకరించాలన్నారు. ఆక్టోపస్ భవన నిర్మాణానికి అవసరమైన రూ.27 కోట్లు నిధులు అందించడానికి చొరవ చూపాలన్నారు. ఈగల్ వ్యవస్థ, కమాండ్ కంట్రోల్ సెంటర్, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు బడ్జెట్ లో పెద్దపీట వేయాలన్నారు.

ప్రభుత్వ ఆస్తులైన హైకోర్టు, విమానాశ్రయాలను రక్షించే ఏపీఎస్ఎఫ్ దళాలకు సంబంధించి నిధులు కేటాయించాలన్నారు. విశాఖపట్నంలో కొత్త సీపీ కార్యాలయం ఏర్పాటుకు నిధులివ్వాలని ప్రతిపాదించారు. విజయవాడ పరిధిలో అస్త్రం యాప్, సీసీటీవీ కెమెరాల నిర్వహణ, అవార్డ్స్ పెండింగ్ బిల్లుల చెల్లింపులకు బడ్జెట్ కేటాయించాలన్నారు. చలాన్లు వేసే టెక్నాలజీకి సంబంధించి అవసరమైన బడ్జెట్ కేటాయింపులు జరపాలని హోంమంత్రి అనిత ఆర్థిక మంత్రిని ప్రజంటేషన్ ద్వారా కోరారు.

హోంమంత్రి అనిత ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం వచ్చే బడ్జెట్ లో హోంశాఖకు ప్రత్యేక కేటాయింపులకు కృషి చేస్తామన్నారు. హోం శాఖకు సంబంధించి 94 కేంద్ర ప్రభుత్వ పథకాలను గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పక్కనపెట్టిందని ప్రీ బడ్జెటరీ సమావేశం సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 73 పథకాలను పునరుద్ధరించినట్లు ఆయన స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వ నిధులను సాధ్యమైనంత రాబట్టి సక్రమంగా వినియోగిండానికి పెద్దపీట వేస్తామన్నారు. అందుబాటులో ఉన్న వనరులు,సౌకర్యాలను వినియోగించుకుని ఖర్చు తగ్గించుకోవడంపైనా దృష్టి పెట్టాలని ఆర్థిక మంత్రి కేశవ్ పేర్కొన్నారు. సీఐడీలో స్టేట్ ఫింగర్ ప్రింట్ బ్యూరో సాఫ్ట్ వేర్ నిర్వహణకు సంబంధించి అవసరమైన నిధులకు సంబంధించి స్పష్టతనివ్వాలని అధికారులను ఆర్థిక మంత్రి ఆదేశించారు.

బుల్లెట్లతో ఉన్న గన్ మ్యాగ్జైన్ అదృశ్యం నిర్లక్ష్యమే : హోంమంత్రి అనిత

సహచర కేబినెట్ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గన్ మెన్ జి.వి రమణ వెంట ఉండే గన్ మాగ్జైన్ అదృశ్యంపై హోంమంత్రి అనిత స్పందించారు. 30 బుల్లెట్లతో గన్ మ్యాగ్జైన్ మాయవడాన్ని సీరియస్ గా పరిగణిస్తున్నట్లు స్పష్టం చేశారు. గన్ మ్యాగ్జైన్ మిస్ అవడంలో నిర్లక్ష్యం స్పష్టమవుతోందన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ అంశంపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణితో మాట్లాడినట్లు హోంమంత్రి మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.

అన్ని ఆధారాలతోనే వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ అరెస్ట్

వైసీపీ నాయకులు వల్లభనేని వంశీ అరెస్ట్ సక్రమమే తప్ప అక్రమం కాదని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. వంశీ అరెస్ట్ లో కర్మ సిద్ధాంతం కనిపిస్తోందన్నారు. అరెస్ట్ కు సంబంధించి అన్ని ఆధారాలున్నట్లు ఆమె స్పష్టం చేశారు. తప్పు చేసిన వారికి ఎప్పటికైనా శిక్షపడుతుందనడానికి వంశీ అరెస్ట్ ఉదాహరణ అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్న మమ్మల్ని నాడు డీజీపీ ఆఫీస్ గేట్ కూడా దాటనీయలేదని హోంమంత్రి గుర్తు చేశారు.

టీడీపీ ప్రధాన కార్యాలయం నుంచి కిలోమీటర్ అవతలే ముళ్ల కంచెలు వేసి ఆపిన నాటి రోజులు గుర్తురాలేదా? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 8 నెలల నుంచి మాజీ మంత్రి అంబటి రాంబాబు డీజీపీని కలిసి వినతి పత్రాలు ఇవ్వలేదా? అన్నారు. చట్ట ప్రకారం, ఫిర్యాదును బట్టి సెక్షన్ల అనుగుణంగానే అన్నీ జరుగుతున్నాయన్నారు. కీలక కేసుల్లో కూటమి ప్రభుత్వం నిర్లిప్తత అన్న ఆరోపణ నిజం కాదన్నారు.

ప్రజా ప్రభుత్వం నిబద్ధతతో తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్షపడేలా చేస్తుందన్నారు. విజయనగరం జిల్లాలో 3 నుంచి 6 నెలల కాలంలోనే రెండు పోక్సో కేసులను దర్యాప్తు చేసి చట్ట ప్రకారం శిక్షపడేలా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. పోలీస్, న్యాయ విభాగాలను సమన్వయం చేసుకుంటూ మరింత వేగంగా నిందితులకు శిక్షలను అమలు చేస్తామన్నారు.

గుర్రంకొండలో యువతి యాసిడ్ దాడి ఘటన కలచివేసింది

అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం ప్యారంపల్లె గ్రామానికి చెందిన యువతిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడి ఘటపై హోంమంత్రి అనిత తీవ్రంగా స్పందించారు. ఘటన జరిగిన వైనాన్ని జిల్లా ఎస్పీతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం హోంమంత్రి వీడియో కాల్ ద్వారా బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. బాధితురాలి మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. బాధితురాలికి, కుటుంబానికి న్యాయం జరిగే వరకూ ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉంటుందన్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించారన్నారు. మరో మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి బాధిత కుటుంబాన్ని స్వయంగా వెళ్లి పరామర్శించినట్లు ఆమె తెలిపారు.

తొలిసారి జరిగే కీలక సదస్సుకు ముఖ్య అతిథిగా హోంమంత్రి అనిత

కూటమి ప్రభుత్వం నేతృత్వంలో వినూత్న విధానాల దిశగా అడుగులు పడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆధ్వర్యంలో నేర,న్యాయ విచారణకు సంబంధించిన కీలక అవగాహన సదస్సు జరగనుంది. ఈ నెల 15వ తేదీ శనివారం జరిగే వర్క్ షాప్ లో కీలకమైన డిజిటల్ ఎవిడెన్స్ ద్వారా కేసుల పరిష్కారం, సవాళ్ల గురించి ప్రధానంగా చర్చించనున్నారు. విజయవాడ ఎంజీ రోడ్డులోని జీఆర్టీ హోటల్ లో ఉదయం 10గం.లకు ప్రారంభమయ్యే వర్క్ షాప్ లో హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరవనున్నారు. సచివాలయంలోని హోం మంత్రి చాంబర్లో శుక్రవారం ప్రొసెక్యూషన్ డైరెక్టరేట్ అధికారులు హోంమంత్రిని ఆమె చాంబర్ లో కలిసి ఆహ్వానం పలికారు.

LEAVE A RESPONSE