Home Features మన పత్రికా స్వేచ్ఛా మట్టిబండే!

మన పత్రికా స్వేచ్ఛా మట్టిబండే!

– పాలకుల అసహనం- పెరుగుతున్న దాడులు
( ఆకుల అమరయ్య)

ఫహద్ షా.. జమ్మూ కాశ్మీర్ వాసి. కాశ్మీరీ వాలా వెబ్ సైట్ నిర్వాహకుడు, ఎడిటర్. ఉన్నట్టుండి పుల్వామా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. తాను రాసిన వార్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందన్నది కారణం. …
కేరళ వన్.. ఇదో మళయాళం న్యూస్ ఛానల్. దీన్ని నిషేధిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టులో కేసులు పడ్డాయి. తర్జన భర్జనలు జరిగాయి. చివరకు నిషేధం రైటే అని కోర్టు కూడా అభిప్రాయపడింది. జాతీయ భద్రతకు ముప్పు కలిగించేలా వార్తలు ఉంటున్నాయన్నది సాకు.

ఈ రెండు సంఘటనలు 24 గంటల వ్యవధిలోనే జరిగాయి. సరిగ్గా ఇదే సమయానికి మీడియా వర్గాలకు తలలో నాలుకలా వ్యవహరించాల్సిన- ప్రెస్ ఇన్ఫరేమేషన్ బ్యూరో (పీఐబీ)- మరో బాంబు పేల్చింది. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా వ్యవహరించని లేదా జాతీయ భద్రతకు చేటు తెచ్చే వారి జర్నలిస్టు అక్రిడిటేషన్ కార్డులను అర్థంతరంగానైనా రద్దు చేస్తామని హెచ్చరించింది. ఆదేశాలూ ఇచ్చింది. దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవాలకు సిద్ధమవుతున్న వేళ మీడియాకు సంబంధించి ప్రభుత్వం విధిస్తున్న సంకెలలివీ.

ఈ 7 దశాబ్దాల స్వేచ్ఛా భారతంలోనూ పాలకవర్గాలు కలాలపై ఇంకా కత్తులు దూస్తూనే ఉన్నాయి. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలు, మూల స్తంభాలంటూనే నడ్డివిరుస్తూనే ఉన్నారు. నోరు మెదిపితే కటకటాలు తప్పవని బెదిరిస్తున్నారు. మొత్తం మీద భారతీయ జర్నలిజం నడక- కత్తుల వంతెన మీదే
freedom-of-press సాగుతోంది. ఓపక్క రాజకీయపక్షాలు, మాఫీయా ముఠాలతో పాటు మరోపక్క జర్నలిస్టులకు కొమ్ముకాయాల్సిన పాలకపక్షాలు మేము సైతం అంటూ దబిడిదిబిడి బాదుతున్నాయి. తనకు నచ్చని, తాము మెచ్చని మీడియాపై- అది సామాజిక మాధ్యమైనా, ప్రధాన స్రవంతి మీడియా అయినా సరే- ప్రభుత్వ అదుపాజ్ఞలు, ఆంక్షలు, అరెస్టులు అమలు చేస్తూ ఆర్ధిక మూలాలను దెబ్బతిస్తున్నాయి.

దాసోహం అనకపోతే పీకనొక్కేస్తున్నాయి. 2021 సంవత్సరానికి ఇండియా ప్రెస్ ఫ్రీడమ్ రిపోర్టు కూడా ఈ విషయాన్నే స్పష్టం చేసింది. భారతీయ మీడియా స్వేచ్ఛా మట్టిబండేనని తేల్చింది. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలు ఎన్నుకొనే ప్రభుత్వమే ప్రజాస్వామ్యమని మహామేధావి, అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ చెప్పిన మాటలు మేడి పండు సామేతగా మిలిగిపోతోందని ఈ నివేదిక కుండబద్దలు కొట్టింది.

హక్కులు, ప్రమాదాల విశ్లేషణ గ్రూపు (రాగ్) ఇండియా సహా మొత్తం 180 దేశాలలో పత్రికా స్వేచ్ఛపై ఆరా తీస్తే అందులో భారత్ 142వ స్థానంలో నిలిచింది. సమాజంలో పెచ్చుపెరిగిపోతున్న కలుపు మొక్కల్ని ఏకిపారేసేందుకు ఉద్దేశించిన జర్నలిజాన్నీ, జర్నలిస్టుల్నీ ప్రజాస్వామ్యం ముసుగులో ఉన్న పాలకపక్షాలు పీకిపారేస్తున్నాయి. రాగ్ నివేదిక ప్రకారం భారతీయ జర్నలిస్టుల నడక కత్తుల వంతెన మీద సాగుతోంది. దేశీయ జర్నలిజం లేదా పత్రికా స్వేచ్ఛ ప్రమాదంలో పడింది. ఇండియా జర్నలిస్టులు అనుక్షణం అభద్రతతో బిక్కుబిక్కుమంటున్నారు.

ఏవైపు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని భయపడుతున్నారు. ప్రభుత్వాల తప్పిదాలను ఎత్తిచూపడానికి సాహసించడం లేదు. అధికార వర్గాలను విమర్శించేందుకు వెనకాడుతున్నారు. (పాలకవర్గాలకు కావాల్సింది ఇదే) పాలక పార్టీల వైపు కన్నెత్తి చూడడానికి జంకుతున్నారు. ప్రశ్నించడానికి వెనకాడుతున్నారు. 2021లో అధికారిక లెక్కల ప్రకారం ఆరుగురు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. (అనధికార లెక్కలైతే దీనికి మరో 18 కలపాలి) మరో 113 మంది జర్నలిస్టులు, 13 మీడియా సంస్థలు పాలకవర్గాల హిట్ లిస్టులో ఉన్నాయి.

ఈ జర్నలిస్టులు, మీడియా సంస్థలపై కత్తి వేలాడుతోంది. వీళ్లను ఎప్పుడైనా అరెస్ట్ లేదా విచారణ పేరిట అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. వీళ్లలో ఎక్కువమంది జమ్మూ కాశ్మీర్, ఉత్తరాది రాష్ట్రాల వారు కాగా కొద్ది మంది దక్షిణాది ప్రాంతానికి చెందిన వారు. జాతీయ భద్రతా కారణల సాకుతో ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ ప్రెస్ క్లబ్ సహా పలు మీడియా హౌస్ లపై దాడులు జరిగాయి. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారనే పేరిట కొందరు జర్నలిస్టులపై నిరంతర నిఘా కొనసాగుతోంది. అసాంఘీక శక్తులకు ఆసరా అని, అర్బన్ నక్సలైట్లని ఇంకొందరిపై మూడో నేత్రం తెరుచుకుంది.

వీళ్లను ఆ సమయం, సందర్భాన్ని బట్టి విచారణకు పిలవొచ్చు. అరెస్ట్ చేయవచ్చు. మరికొందరిపై బైండోవర్ కేసులు పెట్టి ప్రతి రోజూ పోలీసు ఠాణకు వచ్చి సంతకం చేసి పొమ్మంటున్నారు. ప్రభుత్వ తీరును ప్రశ్నించారని ఇప్పటికే 25 మందిపై ఎఫ్ఐఆర్ లు నమోదైయ్యాయి. ఉత్తరప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ లో కొన్ని మీడియా సంస్థలపై పోలీసు నిఘా ఉందని రాగ్ తన నివేదికలో పేర్కొనడం జర్నలిస్టు వర్గాలలో తీవ్ర ఆందోళనను రేకెత్తించింది.

మహిళా జర్నలిస్టులపైన సైతం…
భారత్ లో మహిళా జర్నలిస్టులు ఉన్నదే తక్కువ. అందులో స్వతంత్ర జర్నలిస్టులు మరీ స్వల్ఫం. అటువంటి స్థితిలో ఏకంగా 8 మంది మహిళా జర్నలిస్టులపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు కావడం విస్మయం కలిగిస్తోంది. వీళ్లను ఇంతటితో విడిచిపెట్టకుండా వాళ్లను కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో కొన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు ట్రోలింగ్ చేయడం, వారి వేషభాషలపైనా, శరీరాకృతులపైనా వ్యంగాస్త్రాలు ప్రయోగించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మహిళా జర్నలిస్టులను కించపరిచిన వారిని వదిలివేసి తిరిగి ఆ జర్నలిస్టులపైన్నే కేసులు పెట్టడం దొంగే దొంగన్నట్టుగా ఉంది.

గిట్టక పోతే ఆదాయపన్ను శాఖ దాడులే…
గొంతెత్తిన మీడియా పీకనొక్కేయడం పాలకపక్షాలకు కొత్తేమీ కాదు. నాడు ఇందిరా గాంధీ మొదలు నేటి మోదీ వరకు.. ఇదే తంతు. అయిన వారికి ఆకుల్లో కానివారికి మూకుళ్లలో.. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా తనకు నచ్చని వారి పీచమణచాల్సిందే. ప్రశ్నించే వారిపైన్నో, ఆయా మీడియా సంస్థలపైన్నో ఆదాయపన్ను శాఖో, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేటో (ఇడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషనో (సీబీఐ).. మరొకటో.. మరొకటో ఏదో ఒక ప్రభుత్వ సంస్థ దాడులు చేస్తుంది. కొండను తొవ్వి ఎలుకను పడుతుంది. ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటుంది. ఆపైన లొంగదీసుకుంటుంది. ఏదైనా సంస్థ ఎదురుతిరిగితే దాన్ని మూతవేయిస్తుంది.

జాతీయ భద్రతకు విఘాతం అని ముద్ర వేస్తుంది. ప్రభుత్వానికి లొంగిపోయిన సంస్థలు బాగుంటాయి. ఎదురుతిరిగిన సంస్థలైతే యజమానులతో పాటు ఉద్యోగులూ బజారుపాలు కావాల్సి వస్తుంది. సర్వసాధారణంగా జరిగే తంతు ఇదే. ఏతావాతా నష్టపోయేది మాత్రం జర్నలిస్టులు, నాన్ జర్నలిస్టులే. ఇక అసలు విషయానికి వస్తే.. గత రెండేళ్లలో మీడియా సంస్థలపై దాడులు బాగా పెరిగాయి. 2021లో న్యూస్ క్లిక్, దైనిక్ భాస్కర్, భారత్ సమాచార్, న్యూస్ లాండ్రీ వంటి పెద్ద సంస్థలతో పాటు 34 చిన్న, మధ్యతరహా మీడియా సంస్థలపై ఐటీ, ఇడీ దాడులు చేశాయి. పెద్దఎత్తున సోదాలు నిర్వహించాయి.

లెక్కలోకి రాని దాడులెన్నో…
అధికారిక దాడులిలా ఉంటే అనధికార దాడులకు లెక్కే లేదు. మాఫీయా ముఠాలు, రాజకీయ వర్గాలు, రౌడీ మూకలు చేసే దాడులకైతే లెక్కే లేదు. ఆ రికార్డులు సరిగా లేకపోవడం వల్ల ఈ నివేదికలో పొందుపరచలేకపోయారట. ఈ రెండేళ్లలో అంటే 2019-20, 2020-2021లో ఆరుగురు చనిపోయారు. 38 మందిపై దాడులు జరిగాయి. 44 మందిపై అనధికార వర్గాలు కేసులు పెట్టాయి. 24 మందిని విపరీతంగా కొట్టారు. విధులకు ఆటంకం కలిగించారనే సాకుతో మరో 25 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ 25మందిలో 17 మంది చావుదెబ్బలు తిన్నారు.

ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల వారూ ఉన్నారు. హత్యల్లో కర్నూలు జిల్లాలో జరిగిన సంఘటన కూడా ఉంది. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా మీడియాకు పేరుంది. మొదటి మూడు వ్యవస్థలు ఇప్పటికే కుళ్లిపోయాయంటున్నారు. మిగిలిన నాలుగో స్తంభాన్ని ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన పాలకపక్షాలు ఇప్పుడు కుళ్లబొడుస్తున్నాయి. ప్రజాస్వామ్యానికి కావలికుక్కగా (వాచ్ డాగ్) పరిగణించే మీడియా కూడా మూగబోతే ఇక గొంతులేని వారికి గొంతుకగా నిలిచేదెవరు.. జర్నలిజంపై జరుగుతున్న దాడుల్ని ప్రజాస్వామిక వాదులు నిలదీయకపోతే రాజ్యాంగంలోని ఆర్టికల్ 19ఏ కి అర్థమేముంటుందీ.. అందుకే జర్నలిస్టులు మరోసారి గొంతెత్తి నినదించాల్సిన, సంఘటితం కావాల్సిన తరుణం ఆసన్నమైంది.

NO COMMENTS

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com