– సీఎం జగన్ కు ఏఐసిసి జాతీయ కార్యదర్శి గిడుగు రుద్రరాజు బహిరంగ లేఖ
శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి,
గౌరవ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్.
గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారూ,
గోదావరికి అనూహ్యంగా, హఠాత్తుగా వచ్చిన వరదల వల్ల పూర్వ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోని లంక గ్రామాలతో పాటు, పోలవరం ముంపు మండలాలు అయిన ఏటపాక, చింతూరు, కూనవరం, కుక్కునూరు, భద్రాచలం, వి.ఆర్.పురం, బూర్గుంపాడు మందలలో 25 వేలకు పైగా కుటుంబాలు నిరాశ్రయులు అయ్యి, అక్కడ ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. త్రాగేందుకు కనీసం మంచినీరు కూడా దొరకడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా “48 గంటల్లో” ప్రభుత్వ సహాయం యుద్ధప్రాతిపదికన అందచేస్తున్నామని ఒక పక్క మీరు, అసలు సహాయమే అందడంలేదని ప్రధాన ప్రతిపక్షం పరస్పర ఆరోపణలు చేసుకోవడంలో బిజీగా ఉండి, నిజంగా వరద బాధితులకు తక్షణ అవసరాలు అందుతున్నాయా లేదా పట్టిచుకోవడం లేదు. కేంద్రం-రాష్ట్రాలు పోటీలు పడి పెట్రోల్-డీజిల్ లపై పాటు, ఆహార పదార్ధాలపై వేసే పన్నుల వల్ల నిత్యావసారాల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఇక వరదల వల్ల అన్ని నష్టపోయిన వారికి మీరు కంటితుడుపుగా ప్రకటించిన ఆర్థిక సాయం రెండు వేలు ఏ విధంగానూ సరిపోవు. గత ప్రభుత్వాల పనితీరును విమర్శిస్తూ, మీ ప్రభుత్వాని మీరు అభినందించుకొంటూ కోట్ల కొలది ప్రజాధనాన్ని వృధా చేసి పత్రికలలో ప్రకటనలు గుప్పించే బదులు, ఆ నిధులు వరద బాధితుల సహాయానికి వినియోగిస్తే బాగుండేది.
కాబట్టి వెంటనే వరద బాధిత గ్రామాలలో ప్రతి కుటుంబానికి కనీసం ఇరవై ఐదు వేల రూపాయల తక్షణ ఆర్ధిక సాయం అందించ వలసిందిగా డిమాండ్ చేస్తున్నాము. అలానే వరద బాధిత గ్రామాలలో మంచినీరు, వైద్య సదుపాయాలతో పాటు పశువులకు గ్రాసం కూడా దొరికే ఏర్పాటు చేయవలసినదిగా అధికారులను ఆదేశించి, మీ ఆదేశాలకు అనుగుణంగా అవి ప్రజలకు అందుతున్నాయో లేవో కూడా మీరు, మీ మంత్రులు వ్యక్తిగతంగా పర్యవేక్షించవలసినదిగా కోరుతున్నాను.
భవదీయుడు
(గిడుగు రుద్రరాజు)