– మన్యం ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి భారీ నిధులు
– పీఎం జన్‌మన్ పథకం కింద రూ.275 కోట్లు మంజూరు
– అల్లూరి జిల్లా పరిధిలో రోడ్లకు రూ.246 కోట్ల కేటాయింపుతో అగ్రతాంబూలం
– 265.16 కి.మీ పొడవున 71 రహదారుల నిర్మాణం
– డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో ఎట్టకేలకు మోక్షం
– మన్యం ప్రాంతాల్లో పవన్ పర్యటనతో ప్రతిపాదనల ఫలితమే ఇది..
– కూటమి సర్కారుకు నీరాజనం పలుకుతున్న గిరిజనం
అమరావతి: అంతరిక్షంలోకి రాకెట్లు పంపుతున్నాం.. కానీ ఓ ఆడ కూతురు ప్రసవానికి కనీసం అంబులెన్స్ పంపలేక పోతున్నాం.. పెద్ద పెద్ద విమానాలు నడుపుతున్నాం.. పెద్ద పెద్ద జబ్బులకు మందులు కనిపెడుతున్నాం కానీ గిరి శిఖర గ్రామాల ప్రజలకు కనీస సౌకర్యాలను ఇన్నాళ్ళూ కొనసాగిన ప్రభుత్వాలు కల్పించలేకపోయాయి.
కూటమి సర్కారు పరిపాలనలో ఇక అలాంటి పరిస్థితి ఉండరాదు. సరైన రహదారి మార్గాల్లేక ప్రసవ మరణాలు జరుగుతున్నాయనే అపప్రద రాకూడదంటూ… ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీశాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఇటీవల మన్యం ప్రాంతాల పర్యటనలో అన్నారు.
ఆయన చేపట్టిన గిరి గ్రామాల రహదారి నిర్మాణాలపై భారీ సంకల్పం ఎట్టకేలకు నెరవేరే సమయం వచ్చేసింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న పీవీటీజీ గ్రామాలకు రహదారి సదుపాయం కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దఎత్తున నిధులు కేటాయించాయి. ప్రధానమంత్రి జన్‌మన్ పథకంలో భాగంగా అల్లూరి జిల్లాలోని 265.16 కి.మీ పొడవున 71 రహదారుల నిర్మాణం కోసం రూ.246.16 కోట్లు మంజూరు చేస్తూ రెండ్రోజుల కిందట (గురువారం) ఉత్తర్వులు జారీచేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం 60 శాతం వాటాగా రూ.146 కోట్లు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వాటాగా రూ.100 కోట్లు ఖర్చుచేయనున్నాయి.
రూ. 275 కోట్లు మంజూరు:
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రూ.275 కోట్లను మంజూరు చేస్తే అందులో అల్లూరి జిల్లాలోని పీవీటీజీ గ్రామాల రహదారి కోసమే రూ.246 కోట్లు కేటాయించడం విశేషం.
పెద్ద ఎత్తున నిధులు : అరకు, అనంతగిరి, కొయ్యూరు, డుంబ్రిగుడ, ముంచంగిపుట్టు, గూడెంకొత్తవీధి, చింతపల్లి, పెదబయలు మండలాల పరిధిలోని మారుమూల రహదారులను ఈ నిధులతో అభివృద్ధి చేయనున్నారు. ఈ రోడ్ల పనులన్నీ కూడా ఈ ఆర్థిక సంవత్సరంలోనే మొదలు కావాల్సి ఉంది. ఈ రహదారుల నిర్మాణం పూర్తయిన తర్వాత అయిదేళ్ల పాటు నిర్వహించేందుకు మరో రూ.16.77 కోట్లు వెచ్చించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాన్ని డోలీరహితంగా మార్చుతామని ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకే పెద్దఎత్తున రోడ్ల నిర్మాణాలకు చర్యలు తీసుకుంటుంది. ఇటీవలే పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ.33 కోట్లతో ఆరు రోడ్ల నిర్మణానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. ఆయా పనులన్నింటికీ ఇటీవలే టెండర్లు పిలిచి కార్యరూపంలోకి తీసుకొస్తున్నారు.
పవన్ కల్యాణ్ పర్యటన ఫలితం
గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలకు స్వస్తి పలికేందుకే రహదారుల నిర్మాణం చేపట్టామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఇటీవల అల్లూరి జిల్లాలో పర్యటించిన పవన్ కల్యాణ్ పలు రోడ్ల నిర్మాణానికి, పలు అభివద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గిరిజనులకు కష్టాల్లో తోడుగా ఉన్నామని చెప్పటానికే మన్యం జిల్లాలో పర్యటిస్తున్నానని పవన్ చెప్పారు. మెత్తం 100 కి.మీ మేర 120 రోడ్లకు పవన్ శంకుస్థాపన చేశారు.
డోలీ మోతలు లేని రాష్ట్రం దిశగా ముందుకెళ్తున్నామని పవన్ కల్యాణ్ అన్నారు. ఇదిలాఉంటే, ఇన్నాళ్ళూ తమ ప్రయాణ కష్టాలను పట్టించుకోకుండా ఎన్నో ప్రభుత్వాలు వచ్చిపోయాయని.. కూటమి సర్కారు పాలన మాత్రం తమను కంటికి రెప్పలా కాపాడుకునేందుకు అహరహం పనిచేస్తుందని గిరిజనులు మెచ్చుకుంటున్నారు. డోలి ప్రయాణ కష్టాలను కళ్ళారా చూసేందుకు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ పాలిట దేవుడిగా మన్యం జనం కీర్తించడం విశేషం.