– రెవెన్యూ మంత్రిని కోరిన రెవెన్యూ సంఘాల నేతలు
– వారంలోపే ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి హామీ
హైదరాబాద్: గ్రామ పరిపాలన అధికారుల (జీపీఓ)లకు తక్షణమే నియామక పత్రాలను అందచేసి విధుల్లో చేరేలా చూడాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షులు వి.లచ్చిరెడ్డి పేర్కొన్నారు.
రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని శుక్రవారం డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్ష కార్యదర్శులు వి.లచ్చిరెడ్డి, కె.రామకృష్ణ, తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు ఎస్.రాములు, రమేష్ పాక, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షకార్యదర్శులు బాణాల రాంరెడ్డి, వి.భిక్షం, టిజీటీఏ సెక్రటరీ జనరల్ ఫూల్ సింగ్ చౌహాన్, మహిళా అధ్యక్షురాలు ఎం.రాధ, టీజీఆర్ఎస్ఏ మహిళా అధ్యక్షురాలు సుజాత చౌహాన్ కలిశారు.
రాష్ట్రంలో 3,3500 మంది జీపీఓలు నియామక పత్రాల కోసం ఎదురు చూస్తున్నారని ఈ సందర్భంగా లచ్చిరెడ్డి మంత్రి శ్రీనివాస్ రెడ్డికి వివరించారు.
వీరికి తక్షణమే నియామక పత్రాలను అందజేసి విధుల్లో చేరేలా చూడాలని కోరారు. జీపీఓల రాకతో రాష్ట్రంలోని గ్రామాల్లో రెవెన్యూ సేవలు అందించే అవకాశం ఉంటుందన్నారు.
జీపీఓల విషయంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సానుకూలంగా స్పందించారు. వారం రోజుల లోపే ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.