– నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలి
– బ్యాంకర్ల త్రైమాషిక సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం బేగంపేటలో బ్యాంకర్ల సమీక్ష సమావేశంలో ఆయన ప్రసంగించారు. గత పది సంవత్సరాల పాటు పరిపాలించిన వారు సంక్షేమ కార్పోరేషన్లు అన్నిటిని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. సబ్సిడీలు, మర్జిన్ మనీ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
స్వయం ఉపాధి పథకాలకు బ్యాంకర్స్ తో కలిసి సుమారు 6,000 కోట్ల విలువైన ఉపాధి పథకాలను మార్చి 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తిలో ప్రారంభిస్తారని, స్వయం ఉపాధి పథకాల పంపిణీ, సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఓ పండుగలా నిర్వహిస్తుందని తెలిపారు. ఇవి రాష్ట్ర జిడిపిని పెంచుతాయి అన్నారు.
రైజింగ్ తెలంగాణలో బ్యాంకర్స్ పాత్ర కీలకమని, ప్రపంచాన్ని ఆకర్షించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. స్కిల్ యూనివర్సిటీ, ఐటిఐ ల అడ్వాన్స్మెంట్ ద్వారా నైపుణ్యం కలిగిన మానవ వనరులను, రెప్పపాటు కూడా అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్తు సరఫరా, శాంతి భద్రతలు మంచి వాతావరణం కల్పించి ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలితంగా దావోస్ లో 1.80 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని తెలిపారు.
వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పడమే కాదు చేసి చూపామని తెలిపారు. ఈ ఒక్క రంగానికి 52,000 కోట్లు కేటాయించామని తెలిపారు. రెండు నుంచి మూడు నెలల వ్యవధిలోనే రైతు రుణమాఫీ కింద సుమారు 22 వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. భారతదేశ చరిత్రలో ఇది ఒక రికార్డు అన్నారు.
గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం బాగా వృద్ధి సాధిస్తుందని ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
దేశ ఆలోచనను ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో భాగంగా ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలతో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేపట్టినట్టు తెలిపారు. వెయ్యి మెగావాట్లు ఉత్పత్తి లక్ష్యంగా సోలార్ కంపెనీలతో ఎంఓయూ కుదుర్చుకున్నట్టు వివరించారు. మహిళలను ప్రోత్సహించేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని కోరారు.
మూసి నిర్వాసిత మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తాం అన్నారు. ఏడాది 20వేల కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు అందించినట్టు తెలిపారు. కోటి మంది జనాభా ఉండే హైదరాబాద్ నగరంలో మహిళలకు ఆర్థిక చేయూత ఇస్తాం అన్నారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించే MSME సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు బ్యాంకర్లు ఆర్థిక చేయుత అందించాలి అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కొన్ని ప్రాంతాలకు పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలు, వర్గాలు అభివృద్ధి చెందేలా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అన్నారు.
వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని బ్యాంకర్లు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని బడ్జెట్ కు ముందు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. 10 సంవత్సరాల తర్వాత సంక్షేమం, అభివృద్ధి జోడెడ్లుగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అందుకు అనుగుణంగా బ్యాంకర్లు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని డిప్యూటీ సీఎం తెలిపారు.