– ఆరోగ్య సంరక్షణలో విప్లవాత్మక మార్పుల్ని తెచ్చామన్న గవర్నర్
అమరావతి: గత ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి పెండింగ్ లో పెట్టిన సుమారు రూ.1770 కోట్ల మేర అప్పుల్ని ఎన్డీయే ప్రభుత్వం తీర్చిందని గౌరవ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ సోమవారం ఉభయ సభలనుద్దేశించి చేసిన తమ ప్రసంగంలో పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టితో డిజిటల్ పరిజ్ఞానం మరియు సృజనాత్మకత ఉపయోగించడం ద్వారా ఆరోగ్య సంరక్షణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విప్లవాత్మక మార్పుల్ని తీసుకొస్తోందని గవర్నర్ తెలిపారు.
సుస్థిర ఆర్థిక వృద్ధికి మరియు మానవ వనరుల అభివృద్ధికి నైపుణ్యం, ఆరోగ్యకరమైన శ్రామిక శక్తి మూల స్తంభమని ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోందని, ఈ దార్శనికతకనుగుణంగా విద్య, ఆరోగ్య రంగాలపై వ్యూహాత్మక దృష్టిని సారించడం ద్వారా మానవ వనరుల సామర్థ్యాన్ని బలోపేతం చేస్తోందని గవర్నర్ పేర్కొన్నారు.
డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ, ఉద్యోగుల ఆరోగ్య పథకం వంటి కీలక పథకాల్ని పునరుద్ధరించి , హైబ్రిడ్ ఆరోగ్య బీమాను ఎన్డీయే ప్రభుత్వం ప్రతిపాదిస్తోందన్నారు. ఇందులో రూ.2.5 లక్షల వరకు క్లెయింలను ఇన్సూరెన్స్ పార్టనర్ రీయింబర్స్ చేస్తారనీ, రూ.2.5 లక్షలకు మించి రూ.25 లక్షల వరకు గల క్లెయింలను ఎన్.టి.ఆర్ వైద్య సేవా ట్రస్టు రీయింబర్స్ చేస్తుందనీ గవర్నర్ తెలిపారు.