Suryaa.co.in

Andhra Pradesh

ఆక్వారంగంపై సర్కార్‌ తీవ్ర నిర్లక్ష్యం

– ఎగుమతి సుంకాలతో ఆక్వాకు కొత్త కష్టాలు
– ముందుచూపుతో చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ ఘోర వైఫల్యం
– ఆక్వా రైతులను ఆదుకోవడంలో కొరవడిన చొరవ
– అసమర్థ పాలనతో చితికిపోతున్న ఆక్వారైతులు
– అప్సడా మాజీ వైస్ చైర్మన్, పార్టీ రైతు విభాగం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డి ర‌ఘురాం

తాడేపల్లి: రాష్ట్రంలో ఆక్వారంగాన్ని ఆదుకోవడంలో కూటమి సర్కార్ ఘోరంగా వైఫల్యం చెందిందని అప్సడా మాజీ వైస్‌ చైర్మన్, వైయస్ఆర్‌సీపీ రైతువిభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డి రఘురాం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఆదాయాన్ని అందిస్తున్న ఆక్వాపై ఎగుమతి సుంకాల వల్ల కొత్త కష్టాలు ప్రారంభమయ్యాయని అన్నారు.

ముందుచూపుతో వాటికి పరిష్కార మార్గాలను చూపాల్సిన కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంతో ఆక్వారైతులను గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ అసమర్థ పాలనతో ఆక్వా రైతులు చితికిపోతున్నారని ధ్వజమెత్తారు. బయట మార్కెట్‌లో ప్రతికూలత, స్థానికంగా కూటమి పెద్దల చేతుల్లో ఉన్న ఆక్వాసంస్థలతో భారీగా పెంచిన సీడ్, ఫీడ్ ధరల మోతతో ఆక్వారైతులు రెండు విధాలుగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ఆక్వా రంగం కుద‌లైపోతుంటే ఈ ప్ర‌భుత్వం మొద్దు నిద్ర‌పోతోంది. ఆక్వా రంగం తీవ్ర‌మైన సంక్షోభంలో చిక్కుకుని రైతులు అల‌మ‌టిస్తున్నా ఈ ప్ర‌భుత్వానికి ప‌ట్ట‌డం లేదు. కూటమి ప్ర‌భుత్వం రాగానే వంద నుంచి రూ. 200 వ‌ర‌కు ఫీడు రేటు త‌గ్గిస్తామ‌ని ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చిన చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు రైతులు న‌ష్ట‌పోతున్నా ప‌ట్టించుకోవ‌డం లేదు.

నాన్ ఆక్వా జోన్ ప‌రిధిలో కూడా యూనిట్ విద్యుత్‌ను రూ. 1.50కే ఇస్తామ‌ని చెప్పినా 10 నెల‌లు గ‌డిచినా ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. ఆక్వా, నాన్ ఆక్వాజోన్‌ల‌కు విద్యుత్ సబ్సిడీ కింద ఎంత ఖ‌ర్చు చేశామో కూడా చెప్పుకోలేని దుస్థితిలో ఈ ప్ర‌భుత్వం ఉంది. ఆక్వా రేట్లు గణనీయంగ పడిపోతున్నాయి. వాటిని స్థిరీకరించే ప్రయత్నం ప్రభుత్వం నుంచి జరగడం లేదు. మరోవైపు కూటమి పెద్దలే ఆక్వారంగాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని మార్కెట్‌ను శాసిస్తున్నారు.

ఫీడ్, సీడ్ రేట్లను తమ ఇష్టం వచ్చినట్లు పెంచడం వల్ల ఆక్వారైతులు పెట్టుబడుల కోసం అప్పులు చేసి, తీవ్రంగా నష్టపోతున్నారు. మరోవైపు అమెరికా టారీఫ్‌ల పేరుతో మార్కెట్‌ను తగ్గించడంతో మధ్య దళారీలు రంగంలోకి దిగి రైతులను నిలువునా దోచుకుంటున్నారు. ప్ర‌భుత్వం త‌క్ష‌ణం స్పందించి ఆక్వా రైతుల‌కు న్యాయం చేయాలి. రైతులకు మేలు జ‌రిగే వ‌ర‌కు వారి ప‌క్షాన వైయ‌స్సార్సీపీ నిల‌బ‌డి పోరాడుతుంది.

రైతులు ప‌డుతున్న క‌ష్టాలు చూస్తుంటే ఈ రాష్ట్రంలో ప్ర‌భుత్వం ఉందా? పాల‌న జ‌రుగుతోందా అనే అనుమానాలు క‌లుగుతున్నాయి. 10 నెల‌ల కూట‌మి పాల‌న‌తో వ్య‌వ‌సాయ రంగం తీవ్ర‌మైన సంక్షోభంలో కూరుకుపోయింది. రైతులు అడుగ‌డునా ఇబ్బందులు ప‌డుతూనే ఉన్నారు. ఎక్క‌డ‌చూసినా ద‌ళారుల‌దే రాజ్యం న‌డుస్తోంది.

మిల్ల‌ర్లంతా సిండికేట్ గా ఏర్ప‌డి రైతుల‌ని దోచుకుంటున్నా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేదు. బుడ‌మేరు ప్రాంతంలో మునిగిపోయిన రైతుల‌కు, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఎర్ర‌కాలువ ముంపు ప్రాంతంగా ఉన్న నాలుగైదు నియోజ‌క‌వ‌ర్గాల రైతుల‌ను ప్ర‌భుత్వం ఇంత‌వ‌ర‌కు ఆదుకోలేదు. వ‌రి పంట చేతికొచ్చే స‌మ‌యంలో రైస్ మిల్ల‌ర్లంతా క‌లిసి సిండికేట్‌గా ఏర్ప‌డి రైతును మోసం చేస్తున్నారు. మొద‌టి నాలుగు రోజులు బ‌స్తా రూ.1450 కొనుగోలు చేసి, వర్షాలే లేక‌పోయినా ఇప్పుడు తేమ శాతం పేరుతో రూ. వంద త‌గ్గించి రైతుల్ని మోసం చేస్తున్నారు.

LEAVE A RESPONSE