– తనఖా రిజిస్ట్రేషన్ అంటూ మోసంతో జీపీఏ, సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు
– మంత్రి నారా లోకేష్ 36వ రోజు “ప్రజాదర్బార్” కు విన్నపాలు
– అడిగిందే తడవుగా దివ్యాంగుడికి వీల్ చైర్ అందించిన మంత్రి లోకేష్
అమరావతి: ఉండవల్లిలోని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 36వ రోజు “ప్రజాదర్బార్” కు విన్నపాలు వెల్లువెత్తాయి. మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి నారా లోకేష్ ను స్వయంగా కలిసి విన్నవించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి.. సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మంత్రి లోకేష్ ను కదిలించిన దివ్యాంగుడి అభ్యర్థన
పుట్టుకతో పూర్తి అంగవైకల్యం బారిన పడి, కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్న దివ్యాంగుడి అభ్యర్థన మంత్రి నారా లోకేష్ ను కదిలించింది. ప్రజాదర్బార్ కు వచ్చే దివ్యాంగుల సౌకర్యార్థం ఉండవల్లి నివాసంలో పలు వీల్ ఛైర్ లను అందుబాటులో ఉంచడం జరిగింది. అదే వీల్ చైర్ లో కుంచనపల్లికి చెందిన గాధం ఆనంద్ తేజ తల్లిదండ్రుల సాయంతో మంత్రి నారా లోకేష్ ను కలిశారు. తనను బయటకు తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని, ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న తనకు వీల్ చైర్ అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దివ్యాంగుడు అడిగిందే తడవుగా అదే వీల్ చైర్ ను అందించి మంత్రి నారా లోకేష్ తన గొప్ప మనసు చాటుకున్నారు. మంత్రి నారా లోకేష్ మానవతా హృదయం పట్ల ఆనంద్ తేజ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. అదే వీల్ చైర్ తో ఇంటికి తిరిగివెళ్లారు.
మంగళగిరి నియోజకవర్గం నుంచి వచ్చిన విజ్ఞప్తులు
కుమార్తె వైద్యవిద్య కోసం బ్యాంకు రుణం పొందేందుకు తన ఇంటికి ఎంటీఎంసీ, సీఆర్డీయే నుంచి పూర్తి అనుమతులు మంజూరయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని పెదవడ్లపూడికి చెందిన మున్నింగి పానకాలు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. 2009లో తన స్థలంలో రెండంతస్థుల ఇల్లు నిర్మించుకున్నానని, నిర్మాణ సమయంలో కార్పొరేషన్ విధివిధానాలు గ్రామానికి పూర్తిస్థాయిలో రానందున నిర్మాణ అనుమతులు తీసుకోలేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. కోలాట్రల్ ష్యూరిటీ నిమిత్తం ఇంటిని తనఖా పెట్టి రుణం పొందేందుకు కార్పొరేషన్ ద్వారా తన ఇంటికి అనుమతులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
– వైసీపీ పాలనలో నకిలీ పాస్ పుస్తకాలతో గుంటూరు జిల్లా సిరిపురంలోని తన భూమిని అన్యాక్రాంతం చేశారని, విచారించి తగిన న్యాయం చేయాలని మంగళగిరి బాపనయ్య నగర్ కు చెందిన షేక్ షబ్బీర్ విజ్ఞప్తి చేశారు. గిప్ట్ డీడ్ కింద సంక్రమించిన తమ భూమిని షేక్ అబ్దుల్ కరీం రీసర్వే చేయించి నకిలీ పాసుపుస్తకాలు సృష్టించారని ఫిర్యాదు చేశారు.
– ఇంజనీరింగ్ చదివిన తనకు విజయవాడ, మంగళగిరి ప్రాంతాల్లో ఐటీ జాబ్ అవకాశం కల్పించాలని ఆత్మకూరుకు చెందిన కొండ మణికంఠ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
– భర్త చనిపోయిన తనకు వితంతు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన చందులూరు విజయకుమారి విజ్ఞప్తి చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో పలుమార్లు దరఖాస్తు చేసినా ఫలితం లేదని వాపోయారు.
– సొంత ట్రాక్టర్ కలిగిఉన్న తన భర్తకు స్థానికంగా ఉచిత ఇసుక సరఫరా చేసేందుకు అవకాశం కల్పించాలని మంగళగిరికి చెందిన జొన్నకూటి వెంకటరమణ విజ్ఞప్తి చేశారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నామని, టీడీపీ సానుభూతిపరులనే నెపంతో గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక సరఫరా విషయంలో అక్రమ కేసులు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన విజ్ఞప్తులు
తనఖా రిజిస్ట్రేషన్ అని చెప్పి మోసంతో జీపీఏ, సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసుకుని తమ భూమిని స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తున్నారని, విచారించి తగిన న్యాయం చేయాలని కాకినాడ జిల్లా భీమవరపుకోటకు చెందిన ఆళ్ల దేవి మంత్రి నారా లోకేష్ ను కలిసి కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబ అవసరాల కోసం తమ భూమిని తనఖా అని చెప్పి మళ్ల కోటేశ్వరరావు వద్ద 11 లక్షల రూపాయల రుణం తీసుకున్నాం. అయితే తనఖా రిజిస్ట్రేషన్ సమయంలో డాక్యుమెంట్ రైటర్ తో కలిసి నమ్మించి మోసం చేశారు. ముందు తనఖా రిజిస్ట్రేషన్ అని తమకు ఆ విధంగానే స్టాంప్ పేపర్ చూపించారు.
తర్వాత పేపర్ మార్చి జీపీయే, సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. పొరపాటు జరిగిందని చెప్పి స్టాంప్ పేపర్ పై రాసి ఇచ్చారు. ఇప్పుడు వడ్డీతో కలిసి తమను రూ.43 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని, భూమిని స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తున్నారని ఫిర్యాదు చేశారు. విచారించి తగిన న్యాయం చేయాలని వేడుకున్నారు.
– అన్నమయ్య జిల్లా కోడూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్న తన భర్త గుండెపోటుతో అకాల మరణం చెందారని.. బీఎస్సీ, బీఈడీ చదివిన తనకు వయోపరిమితిన సడలించి కారుణ్య నియామక కింద ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని కొరివి దాక్షాయణి విజ్ఞప్తి చేశారు. భర్త మరణంతో తమ జీవితాలు అంధకారమయ్యాయని, పిల్లల ఆలనాపాలన కోసం ఉద్యోగ కల్పించాలని కోరారు.
– టీడీపీ సానుభూతిపరుడనే నెపంతో వైసీపీ పాలనలో అక్రమంగా తనపై కేసులు నమోదు చేశారని, విచారించి కేసులను ఉపసంహరించడంతో పాటు .. మంగళగిరి ఎంటీఎంసీ పరిధిలో చేసిన కాంట్రాక్టు పనుల బిల్లులు మంజూరయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని గుంటూరు 50వ డివిజన్ కు చెందిన పఠాన్ బాజీ విజ్ఞప్తి చేశారు.
– బేడ, బుడ, జంగం కులాలకు షెడ్యూల్ క్యాస్ట్ (ఎస్సీ) సర్టిఫికెట్ మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా మేడపాడుకు చెందిన ఇంగువ ఆనందరావు విజ్ఞప్తి చేశారు.
– గత పదేళ్ళ నుంచి వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఏపీ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. వినతులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.