– సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ సుజిత్ మల్లిక్
గుంటూరు: జీఎస్టీ తో దేశం ప్రగతి పథంలో దూసుకువెళుతుందని, జిఎస్టి అమలు మంచి ఫలితాలు ఇచ్చిందని సెంట్రల్ జి.ఎస్.టి కమిషనర్ సుజిత్ మల్లిక్ అన్నారు. జిఎస్టీ ఏర్పడి ఎనిమిది ఏళ్లు పూర్తియైన సందర్భంగా..మంగళవారం ఇన్నర్ రింగ్ రోడ్డులోని శ్రీకన్వెన్షన్ హాలులో జరిగిన జి.ఎస్.టి దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు.
జీఎస్టీ చెల్లించే వారి సంఖ్య గణీనీయంగా పెరిగిందని అన్నారు.
జి ఎస్.టి చెల్లించటం గౌరవప్రదంగా భావించాలని సూచించారు. దేశ పౌరులు, వ్యాపారస్తులు చెల్లించే వస్తుసేవల పన్ను దేశ నిర్మాణానికి, దేశ సౌభాగ్యానికి ఉపయోగపడుతుందని తెలిపారు. గుంటూరు సెంట్రల్ జీఎస్టీ కమిషనరేట్ లో జీఎస్టీ ప్రారంభమైన యేడాది 2,850 కోట్లు ఆదాయం సమకూరగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 7,300 కోట్లు ఆదాయం లభించిందన్నారు.
అలాగే గుంటూరులో జిఎస్టీ పన్ను చెల్లింపుదారుల సంఖ్య ప్రారంభంలో 19 వేల మంది వుండగా, ఇప్పుడు 75 వేల మంది కి చేరారన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె. గంగాధరరావు మాట్లాడుతూ.. జీఎస్టీ తో దేశానికి ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. ప్రజా ప్రయోజనాలను పరిరక్షించేలా వస్తు సేవల పన్ను నిర్మాణాన్ని సమగ్రంగా విశ్లేషించాలన్నారు. జిఎస్టీ ఎగవేతల పై అధికారులు దృష్టి సారించాలన్నారు.
కొన్ని పన్ను రేట్లను హేతుబద్ధీకరించాల్సిన అవసరం వుందని, ఆహార ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా పన్ను నిర్మాణంలో కొన్ని మార్పులు చేయాలని సూచించారు. ఎఫ్ట్రానిక్స్ ఎం.డి దాసరి రామకృష్ణ మాట్లాడుతూ..జీఎస్టీ లో వచ్చిన సాంకేతిక సమస్యలు, సందేహాలు వీడాయన్నారు.
సి.పి.డబ్లు.డి చీఫ్ ఇంజినీర్ ముక్కామల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. జిఎస్ట్ ద్వారా అత్యధిక ఆదాయం వస్తున్నప్పటికీ జిఎస్టీ కార్యాలయాలు చాలా వరకు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయని, సొంత భవనాలు నిర్మించుకోవాలని సూచించారు. అనంతరం అత్యధిక పన్ను చెల్లింపుదారులను సత్కరించి, మెమోంటోలు బహుకరించారు. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందచేశారు.
తొలుత ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో జిఎస్టీ అడిషనల్ కమిషనర్ బి.లక్ష్మినారాయణ, జాయింట్ కమిషనర్ రెజ్వాని, అసిస్టెంట్ కమిషనర్లు ఎం.నాగరాజు, బి.రవి కుమార్, మరియదాసు సూపరింటెండెంట్లు అర్.పి.పి.కుమార్, యుగంధర్, గాదె శ్రీనివాసరెడ్డి, సురేష్ మణి చిట్టెం వెంకటేశ్వరరావు, పూర్ణ సాయి తదితరులు పాల్గొన్నారు.