– పవన్ కల్యాణ్ పోరాడాల్సింది ఎవరి మీద, కేంద్రం మీదా.. రాష్ట్రం మీదా..?
– పవన్ కల్యాణ్ ఎంతమంది పొలిటికల్ పార్టనర్స్ ను మార్చాడు..?
– కాపు సామాజికవర్గం ఓట్లే పెట్టుబడి.. ప్యాకేజీలే దిగుబడి.. ఇదీ పవన్ మార్కు రాజకీయం.
– పొలిటికల్ ప్రొడ్యూసర్స్ టర్మ్స్ అండ్ కండీషన్స్ మేరకే వైయస్ఆర్సీపీపై పవన్ కల్యాణ్ విమర్శలు
– విశాఖ ఉక్కు ఎవరిది? విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తున్నది ఎవరు? పోరాటం చేయాల్సింది ఎవరిమీద..?
– మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గేది లేదని సీఎం గారు చాలా స్పష్టంగా చెప్పారు
– విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఉంటుంది.. అందులో ఎటువంటి అనుమానం లేదు
– కేంద్రం వెనక్కి తీసుకున్న వ్యవసాయ చట్టాలను సమర్థిస్తూ పవన్ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు
– వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్
గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
ఉత్తరాంధ్రకు పవన్ వెన్నుపోటు
– అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలని ప్రకటించి విశాఖపట్టణానికి, ఉత్తరాంధ్రకు వెన్నుపోటు పొడిచిన పవన్ కల్యాణ్.. విశాఖ ఉక్కు గురించి గట్టిగట్టిగా అరిచినంత మాత్రాన ఆయన చేసిన ద్రోహాన్ని ఎవరూ మరిచిపోరు.
“టీడీపీ నిర్మాతలు” కోసం పవన్ పనిచేస్తాడు
– విశాఖ ఉక్కును ప్రైవేటుకు అప్పగిస్తున్నది ఎవరు? బీజేపీ. మరి బీజేపీ మీద కాకుండా, వైయస్ఆర్ కాంగ్రెస్ మీద ఉద్యమం ఏమిటి? డైలాగులు ఏమిటి? సినిమా ప్రొడ్యూసర్స్ ప్యాకేజీ ఇస్తే ఏది మాట్లాడమంటే అది మాట్లాడిన అలవాటు ఆయనకు పోలేదు. ఇక్కడా “టీడీపీ నిర్మాతలు” ఏది మాట్లాడమంటే అదే మాట్లాడుతున్నాడు.
ఉత్తరాంధ్రలో ఉన్న విశాఖ ఉక్కు గురించి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిన్న మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆరు గంటల దీక్ష చేసి, నాలుగు మాటలు మాట్లాడితే.. ఈ ప్రాంతప్రజలు ఎవరూ నమ్మరు. ఎందుకంటే.. ఎన్నికల ప్రచారం సమయలో కర్నూలుకు వెళితే కర్నూలే రాజధాని అన్నాడు, విశాఖకు వస్తే విశాఖ ఈ ప్రాంతానికి రాజధాని అన్నారు. అమరావతికి వెళితే అమరావతే రాజధాని అంటారు. ఎన్నికలు అయిపోయాక, అమరావతి ఒక్కటే రాజధాని అని మాట్లాడుతున్నాడు.
ఉత్తరాంధ్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నాడు. పవన్ కల్యాణ్ ఎంతసేపటికీ పొలిటికల్ ప్రొడ్యూసర్స్ తో తనకు ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం వారు ఏం చెబితే అదే మాట్లాడతారు తప్ప ఉత్తరాంధ్ర ప్రాంతం, రాయలసీమ ప్రాంతం ఏమైపోయినా పర్వాలేదు అన్నది ఆయన సిద్ధాంతం. రాష్ట్రం, ఎవరు ఏమైపోయినా పర్వాలేదు కానీ, తన పొలిటికల్ పార్ట్‌నర్స్ బాగుండాలని పవన్ మాట్లాడుతున్న మాటల్ని చూశాం.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటిస్తూ.. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో అభివృద్ధి- పాలన వికేంద్రీకరణ జరగాలని, వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలోని విశాఖ నగరాన్నిఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించి ఒక గుర్తింపు తీసుకువచ్చారు. దేశంలోనే ఉన్నత నగరంగా, రాష్ట్ర రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఉన్న విశాఖ ఉక్కు కోసం విజయవాడలో పవన్ కల్యాణ్ ఉద్యమం అట.
ఆయన చేసిన దీక్షలో అమరావతి రైతులు వచ్చి పవన్‌ను రాయలసీమ రమ్మని ఆహ్వానం పలికారట. బాబు, పవన్ కల్యాణ్ లు ఏం డ్రామాలు ఆడతారు..?. తన గురించి, తన రాజకీయ పార్టీ గురించి ప్రజలు ఏమనుకుంటారనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదు. తాను చేసిన ప్రసంగాలు, ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యలు కనీసం ఆలోచన లేకుండా ఉన్నాయి. విశాఖ ఉక్కు ఎవరిది? విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తున్నది ఎవరు? కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ అవునా.. కాదా? అలాంటిది, కేంద్రంలోని బీజేపీ మీద కాకుండా వైయస్సార్ సీపీ మీద అభాండాలు వేయడం, విమర్శలు చేస్తుండటం విడ్డూరం.
పవన్ కల్యాణ్ పోరాడాల్సింది ఎవరి మీద, కేంద్రం మీదా.. రాష్ట్రం మీదా..!
బీజేపీ మీద ఉద్యమం చేయకుండా వైయస్సార్ సీపీ మీద ఉద్యమం చేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటన చేస్తున్నాడు. అధికారంలో ఉన్నప్పుడూ.. లేనప్పుడూ ఎప్పుడూ జగన్ గారి మీద, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయడం ఆయనకు అలవాటు అయిపోయింది. సినిమాల్లో డైరెక్టర్ ఏం చెబితే అది చెప్పడం. కమర్షియల్‌గా హిట్ రావాలంటే ఏ డైలాగ్స్ చెబితే బాగుంటుందంటే వాటిని వాడటం, స్క్రిప్ట్ ఏది ఉంటే అది చెప్పడం పవన్‌కు బాగా అలవాటు. అలాగే నిన్న కూడా కేంద్రానిది తప్పు లేదట. కాని రాష్ట్ర ప్రభుత్వం వెళ్లి కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేయాలట. ఆయన మాట్లాడేది కనీసం ఆయనకు అయినా అర్థమవుతుందా..?
బాబు-పవన్ ల డ్రామా రిపీట్..
2019లో టీడీపీ చెప్పినట్టుగా డ్రామా ఆడి.. గాజువాకలో, భీమవరంలో టీడీపీ క్యాండిడేట్ ను పెట్టకుండా మంగళగిరిలో జనసేన క్యాండిడేట్ లేకుండా అంతా ప్యాకేజీగా నడిపించారు. ఇప్పుడు 2024లో.. టీడీపీ-జనసేన కాంబినేషన్ లో, బీజేపీ వస్తానంటే కలుపుకుని.. లేదంటే చివరిలో బీజేపీకి సొడ్డు కొట్టి మళ్ళీ కూటమి కట్టడానికి డీల్ రెడీ అయింది. అందులో భాగంగానే ఈ డైలాగులు.
2014 నుంచి 2019 వరకూ ప్రధాని మోదీ మీద, బీజేపీపైన విమర్శలు చేసిన పవన్ కల్యాణ్.. 2019 ఎన్నికల తర్వాత బీజేపీతో జత కట్టాడు. ఇవాళ బీజేపీ తీసుకున్న విధానాలన్నీ దేశం కోసం తీసుకుంటున్న విధానాలు అని చెప్పడం, చివరకు మోదీ చేసిన నూతన వ్యవసాయ చట్టాలను, వాటిని వెనక్కి తీసుకున్న తర్వాత కూడా, ఆ చట్టాలను సమర్థిస్తూ పవన్ మాట్లాడిన మాటల్ని చూస్తే ఆయనకు చట్టాల మీద అవగాహన ఎంత ఉందో అర్థమవుతుంది.
అసలు పవన్‌కు ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాల మీద, ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాల మీద, రైతులు ఎదుర్కొంటున్న అంశాల మీద కనీస అవగాహన లేకుండా మాట్లాడటం చూశాం. ఇలాంటి నాయకుల్ని ఏమనాలి. కనీసం చిత్తశుద్ధి, అవగాహన, ఒక సిద్ధాంతం లేకుండా మాట్లాడుతున్న మాటల్ని ఎలా చూడాలి.
తెర వెనుక పవన్ రాజకీయాలు
పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేశారు. పవన్ గాజువాక, భీమవరంలో పోటీ చేశారని అందుకే తాను ప్రచారానికి రాలేదని విశాఖలో జరిగిన పార్టీ సమీక్ష సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఇక చంద్రబాబు తనయుడు లోకేష్ మంగళగిరిలో పోటీ చేస్తున్నారు కనుక అందుకే జనసేన నుంచి పోటీ వద్దని పవన్ మానేస్తాడు. వీళ్ళు ఎటువంటి రాజకీయాలు చేశారో రాష్ట్ర ప్రజలంతా చూశారు.
అందుకే వారికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో అలా చెప్పారు. తెర వెనుక రాజకీయాలు, ఒప్పందాలు, లావాదేవీలను మీ తాలుకా ఆలోచనలు, సిద్ధాంతాలని ప్రజలు గమనిస్తున్నారు. మళ్లీ 2024 ఎన్నికల్లో టీడీపీతో జత కట్టాలి, అవసరం అయితే బీజేపీని కూడగట్టుకోవాలి అని, ఒకవేళ ఆ పార్టీ కలవకుంటే టీడీపీ, జనసేన కలిసి ఎన్నికలకు వెళ్లాలనే కొత్త ఆలోచనలను బాబు- పవన్ చేస్తున్నారు. పొలిటికల్ ప్రొడ్యూసర్స్ చెప్పింది చేయడం తప్పితే.. ఆయనకు ఒక సిద్ధాంతం అంటూ ఏమీ లేదు.
చంద్రబాబు వ్యాఖ్యలకు అనుగుణంగా, ఆయనకు మద్దతుగా, ఆయనకు అవసరం వచ్చినప్పుడల్లా పవన్ కల్యాణ్ ఒక వేదికను ఏర్పాటు చేసుకుని అవే అంశాలను మాట్లాడతారు. వీళ్ళ ఇద్దరి మైండ్ సెట్లలో ఎక్కడా కూడా పెద్ద తేడా లేదు. చంద్రబాబు మాటలకి, నిన్న పవన్ చేసిన వ్యాఖ్యలు, విమర్శలు, ఆరోపణల్లో ఎక్కడా తేడా లేదు. ఇద్దరిదీ ఒకటే సిద్ధాంతం.
నిన్నటివరకు తెర వెనుక.. ఇక తెరముందుకు..
జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా టీడీపీ-జనసేన తెర వెనుక ఒప్పందాలు చేసుకుని పోటీ చేశాయి. అనకాపల్లి నియోజకవర్గంలో ఎంపీటీసీ అభ్యర్థులు విషయంలో కూడా అంతే జరిగింది. తెర వెనుక జరుగుతున్న రాజకీయాలు, చీకటి ఒప్పందాలను చూస్తుంటే… రేపటి రోజు వీరంతా తెర ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారనిపిస్తుంది.
పొలిటికల్ ప్రొడ్యూసర్స్‌తో పవన్‌కు ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ అవేనని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాం. దాని ద్వారానే వైయస్సార్ సీపీ, జగన్‌గారిని విమర్శించాలి, బురద చల్లాలి, ప్రభుత్వ ఇమేజ్‌ను డ్యామేజ్ చేయాలని పవన్ తాపత్రాయపడుతున్నారు. చివరకు ఈయన మార్క్ రాజకీయం ఏంటంటే కాపు సామాజిక వర్గం ఓట్లను పెట్టుబడిగా పెట్టి… వాటి ద్వారా ప్యాకేజీలను రాబట్టుకోవాలన్నదే, దీనిని ప్రజలంతా గమనించాలి.
కాపు సామాజికవర్గం ఓట్లే పెట్టుబడి..
కాపు సామాజికవర్గం ఓట్లే పెట్టుబడి.. ప్యాకేజీలే దిగుబడి.. ఇదీ పవన్ మార్కు రాజకీయం.
ఇందులో భాగంగానే వైయస్సార్ సీ ప్రభుత్వం మీద పవన్ కల్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజల అభ్యున్నతికి నిత్యం పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై, రాష్ట్రాన్ని ఉన్నతస్థాయిలో నిలబెట్టాలని పనిచేస్తున్న జగన్ మోహన్ రెడ్డిగారి గురించి ఇలాంటి వ్యక్తులా మాట్లాడేది?
ఒకవైపు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ద్రోహం చేస్తూ, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో కేంద్రాన్ని ప్రశ్నించకుండా.. మా మీద ఉద్యమం చేస్తామనడం హాస్యాస్పదంగా ఉంది. మీరు ఉద్యమం చేయాల్సింది బీజేపీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద.
రాష్ట్రానికి గానీ, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ విశాఖ ఉక్కులో ఒక్క పర్సెంటేజ్ షేర్ కూడా లేదు. అయినా విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం. ఈ అంశంపై కేంద్రానికి, ప్రధానమంత్రిగారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌గారు రెండు పర్యాయాలు లేఖలు రాశారు. పార్లమెంట్‌లో అనేకసార్లు మా ఎంపీలు ఈ అంశాలను లేవనెత్తారు.అలాంటిది, పవన్ కల్యాణ్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పుపడుతూ మాట్లాడటం అంటే ఆయన రాజకీయంగా ఎక్కడ ఉన్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి. పవన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.