Suryaa.co.in

Telangana

గుంటనక్కల తీర్మానం!

అదొక కంచె. గచ్చిబౌలి కంచె. పేరుకే కంచెకని పెద్ద అడివే. నెమళ్లు జింకలు దుప్పులు కుందేల్లు ఉడతలు,సహా వూర బిష్కలు, చిల్కలు, గోరెంకలు, బుర్కపిట్టలు ఇట్లా పేరొక్క జంతువు పక్షులకు ఆవాసం.

వీటితో పాటు గుంటనక్కలకు తోడేల్లు విషపు పాములు, గుడ్ల గూబలకు కూడా ఇంత నీడనిచ్చి బతికే అవకాశమిస్తున్నదా కంచె.

సకల జీవరాసులను తనలో దాసుకున్న నీలి సముద్రం మాదిరి ఆకుపచ్చని సంద్రంలా హైద్రాబాద్ కాంక్రీట్ జంగల్ నడుమ నిలిచింది.

ఇందులో అనేక రకాల పండ్ల చెట్లు నీడనిచ్చే చెట్లు మహావృక్షాలు ఆకాశం వైపు గర్వంగా చూస్తూ తరాలుగా పెరుగుతూ వస్తున్నాయి.

అట్లా మంచీ చెడుల కలయిక జీవ వైవిధ్యంతో కూడిన ఒక వసుధైక కుటుంబ భావనతో ప్రతి జీవరాశిని తన బిడ్డ లాగానే భావించుకున్నది కంచే. తన బిడ్డలకు తన చెట్ల నీడతో చల్లని గూడును పండ్లుఫలాలు గడ్డలతో పారే సెలయేర్లు కుంటలతో కడుపునిండా తిండి కంటినిండా కునుకు అన్నట్టు సుఖ సంతోషాలతో సాగుతున్నవి అడవి జీవాల జీవితాలు.

తన పచ్చదనం చూసి వోర్వలేని బడా దళారులు ఇరవయేండ్లనుంచి తన వెంటపడుతూనే వున్నరు. వలసపాలకుల హయాం నుంచి తన మీద రియలెస్టేట్ బ్రోకర్లు దళారుల కన్నుపడుతూనే వున్నది. వాటన్నిటినుంచి గచ్చిబౌలిలో 400 ఎకరాల్లో పచ్చగా విస్తరించి ప్రాణవాయువునిచ్చే తనను కాపాడుకునేందుకు ఎంతో మంది పర్యావరణ ప్రేమికులు ఆధర్శమూర్తులు ముందుకు వచ్చారు.

తమమీద ఈగవాలకుండా న్యాయ స్థానాలు రక్షణ కవచంగా నిలిచినయి. తననేమీ చేయొద్దని కోర్టు స్టే కూడా విధించింది.

అటుతర్వాత వచ్చిన తొలి తెలంగాణ ప్రభుత్వం తనను కబ్జాదారుల కోరలకు చిక్కకుండా కంచెవేసి రక్షణ గా నిలిచింది. వారితో పాటు తనకు ఏ కష్టమొచ్చినా అండగా నిలిచిన హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు తనకు సైనికుల్లా 24 గంటలు పహారాకాస్తున్నరు. ఇటువంటి శతృ దుర్భేద్య వాతావరణంలో పచ్చగా ఫరిఢవిల్లుతూ లోకానికి ప్రాణవాయువును ప్రసారం చేస్తున్నది గచ్చిబౌలి కంచె

తాను పుట్టిన కానించి ఎటువంటి కష్టం లేకుండా సుఖంగా సంతోషంగా బతుకుతున్నది .

ఇటువంటి సందర్భంలో వొకానొక అర్థరాత్రి తమపాలిటి కాలరాత్రిగా మారింది. ఆరోజు.. సెలవు దినం. వారమంతా అలసిపోయిన అడవి బిడ్డలు, వీకెండ్ సెలబ్రేషన్లు జరుపుకుని తమ గూల్లకు చేరుకున్నయి. ఆనందంలో అలసి సొలసిన నెమలులు జింకలు దుప్పులు గాడ నిద్రలో ఉన్నాయి.

ఒక్కసారిగా పెలపెలపెల సప్పులతో మహావృక్షాలు కూలిపోవడం మొదలైంది. భూకంపం వచ్చిందా అని చూస్తూ భూమి కదులుతలేదు, కానీ చెట్లు కూలుతున్నయి,. ఆదమరిచిపన్న జింకలు కుందేల్లు తేరుకునే లోపే వొక మహావృక్షం వచ్చి మూగజీవైన దుప్పిమీద అమాంతం కూలింది. మరుక్షణమే ప్రాణాలిడించి.

సునామీ భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాలన్నా చెప్పి వస్తయి కానీ ప్రభుత్వం వొక పథకం ప్రకారం తెచ్చిన వైపరీత్యం క్షణాలల్లోచుట్టుముట్టింది. అది ప్రకృతి సృష్టించిన భూకంపం కాదు..బుల్డోజర్లతో ప్రభుత్వం సృష్టించిన భూకంపానికి చిక్కిందనే సంగతి అర్థమవ్వడానికి కొన్ని గంటలు పట్టింది అమాయకపు అడవి జంతువులకు.

400 వందల ఎకరాల్లో విస్తరించిన కంచె అంతా నెమళ్ళ హాహాకారాలు.

ఇటీవల హైడ్రా కూల్చివేతల్లో తమ గూడు కోల్పోతున్నమని అభాగ్యులైన వో దళిత దంపతులు …అన్నా కేసీఆరన్నా..రావే ఎక్కడున్నవే…రావే…అంటూ చేసిన ఆర్తనాదాలను తలపిస్తున్నవి.

భూకంపంలో చిక్కుకున్న చిన్నారులు మహిళలు అసహాయుల మాదిరి తమను రక్షించమని వేడుకుంటున్నట్టుగా నెమల్ల కావు కావు రోదనలు.. సమస్త జీవరాసుల ఆర్తనాదాలు.

ప్రపంచ పటంలో అత్యంత వేగం గా అభివృద్ధి చెందుతున్న నగరం గా పేరుగాంచిన హైద్రాబాద్ మహానగరంలో మూగజీవాల రోదనలు.. వొక ప్రకృతి వైపరీత్యాన్ని మించిపోయినవి.

కంచెను ఆక్రమించుకునేందుకు పచ్చదనాన్ని చిద్రం చేస్తూ అడవి జంతువుల వేటలో తెలంగాణ ప్రభుత్వం ఆద్వర్యంలో వందలాది బుల్డోజర్ల పదగట్టనలు..ప్రపంచ యుద్దాన్ని తలపిస్తున్నది. బుల్డోజర్ల కింద చిన్నా చితక జీవరాసులు నలిగిపోతూ ప్రాణాలు విడుస్తున్నవి.

అది ప్రకృతి తెచ్చిన భూకంపం కాదని ప్రభుత్వం తెచ్చిన బుల్డోజర్ కంపమనే సంగతి వాటికి అర్థమయ్యేలోపే జరగరాని ఘోరాలు జరిగిపోతున్నయి. నిటారుగా పెరిగిన మద్ది చెట్టును రెండు బుల్డోజర్లు వొకే సారి తమ బలాన్నంతా చూయించి కూల్చేయబోతుంటే.. ఆ చెట్టు మీద గూటిలో పండుకున్న రామచిలక ఒకసారిగా దిగ్గున లేచి తన పిల్లలను చంకన పెట్టుకొని పరిగెత్తింది.

చిటారు కొమ్మన పడుకున్నది వొక బుల్లి ఉడత. కూర్చున్న కొమ్మను నరికేసుకునే మూర్ఖుల చేతిలో తను పడుకున్న కొమ్మ నరికివేతకు గురవుతున్నదని అర్థమై…తేరుకునేలోపే ఆ చెట్టు వేగంగా పెద్ద శబ్దంతో భూమి మీదికి కూలింది. తప్పించుకోవాలని చూసింది కానీ అప్పటికే సమయం మించిపోయింది. చెట్టుకింద నలిగి చిధ్రమైంది బుల్లి ఉడత బతుకు.

వొకదాని వెంట వొకటన్నట్టుగా సైనికుల దండయాత్ర మాదిరి వందలాది బుల్డొజర్లు భయంకర శభ్ధాలు చేస్తూ పొగలు కక్కుతూ కంచెను సర్వనాశనం చేస్తున్నవి. మూగజీవాలన్నీ చెట్టుకొకటి పుట్టకొకటి అన్నట్టుగా.. హాహాకారాలు చేసుకుంటూ పరిగెడుతుంటే ఎటువైపు నుంచి ఏమొస్తుందో తెలువని కటిక చీకటిలో భయంకరపరిస్థితి.

అట్లాంటి యుద్దవాతావారణంలో కంచె అంతటా ఆహాకారాలు ఉదృతమయ్యాయి. భూకంపాన్ని సృష్టించేంత శక్తివంతమైన బుల్డోజర్లు తమ పిచ్చుక ప్రాణాల మీద బ్రహ్మాస్త్రాలు విసురుతుంటే నిసహాయ స్థితిలో ప్రణాలు విడవడం తప్ప మూగజీవాలకు వేరే మార్గం దొరకకుంటాపోయింది.

తమనెవరూ ఆదుకునే వారు లేరా..? మా ప్రాణాలు మా బిడ్డల ప్రాణాలు ఇట్లనే గాల్లో కలిసిపోవాల్సిందేనా.? బుల్డోజర్ల కింద నలిగిపోవాల్సిందేనా..? అని ఆ నెమల్లు పక్షులు, జింకలు చేస్తున్న హాహాకారాలు పక్కనే ఉన్న హైద్రాబాద్ విశ్వవిద్యాలయ విద్యార్థుల చెవుల్లో పడింది. పొద్దునలేస్తే తాము కలిసి ఆడుకునే తమ అడవి జీవాల సహచరులకు ఏదో ఆపద జరుగుతున్నదని గ్రహించిన విద్యార్థులు ఆందోళనలో తమ నేస్తాలను రక్షించడానికి హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.

అప్పటికే బల్ బల్ తెల్లారుతున్నది.

మూగ జీవాలను కనిపెట్టుకుంటా కలిసి తిరిగే గుంటనక్కలు ఎందుకో ఈ బుల్డోజర్లు వచ్చేకంటే వొకరోజు ముందునుంచే కంచెలో కనిపించకుండా మాయమై పోయినై. ఇప్పటివరకు వాటి జాడలేదు.
పేద దేశాల మీద పడిన సామ్రాజ్యవాద దేశాల సైనికుల్లాగా మహా వృక్షాలను నిర్దాక్షిణ్యంగా నరుక్కుంటూ దూసుకొస్తున్న బుల్డోజర్లకు అడ్డంగా పడుకున్నారు వన్యప్రాణి నేస్తాలయిన హెచ్సీయూ విద్యార్థులు..తమను చంపినంకనే చెట్లను పెకిలించమని.

కోల్పోయిన తమ ఆత్మ విశ్వాసం స్థానంలో తమకంటూ ఆదుకునే వారొకరున్నారనే భరోసాను విద్యార్థులు కల్పించారు..పచ్చని చెట్లకు.

అందుకు వారికి వొక్కో చెట్టూ పక్షీ జంతువూ వారికి ధన్యవాదాలు తెలిపింది. ఒకవైపు బుల్డోజర్లు తమ గూల్లను చెదరగొడుతూ, తమ ప్రాణాలను తీసేస్తుంటే తమను రక్షించడానికి తమ నేస్తాలైన విద్యార్థులు పద్మవ్యూహంలో అభిమన్యుని మాదిరి పోరాటం చేస్తున్నార. మరోవైపు వారికి సంఘీభావంగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వారితో పాటు ఇతర వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు తెలంగాణ సమాజం మద్దుతు రోజు రోజుకూ పెరుగుతోంది.

ఇటువంటి యుధ్ద పరిస్థితుల్లో మూగజీవాలను ఆదుకోవడానికి న్యాయస్థానాలు కూడా ముందుకు వచ్చాయి. తాము తిరిగి తీర్పునిచ్చేవరకు బుల్డోజర్లతో తవ్వకాలు నిలిపివేయాని ఉత్తర్వులివ్వడంతో కాసింత ఊపిరి పీల్చుకున్నాయి అడవి జంతువులు.

ఇటువంటి సంధికాల పరిస్థితిలో… వొక ఉదయం నాలుగు గుంటనక్కలు గుంపుగా వచ్చాయి.

అప్పటికే చనిపోయిన తమ సహచరుల అంత్యక్రియలను జరిపి, గాయాల పాలైన వారికి చికిత్స చేసుకుని కొంచెం తెప్పరిల్లుతున్న సమయంలో..

కంచెలోని జీవాలన్నీ రచ్చబండకాడికి రావాల్నయా హో…వొక ముఖ్యమైన అంశం మాట్లాడాల్నయా హో…మనకింత కష్టాలు రావడానికి మన ప్రాణాలు పోవడానికి అసలు కారకులెవరో తెలిసిపోయిందట… అదే అంశం గురించి చర్చించాల్నట..అడవి పెద్దమనుషులైన గుంటనక్కల ఫర్మానాయా హో…అని డప్పు సాటింపు వేయించినాయి ఆ గుంట నక్కలు.

ఈ నక్కలు తమకోసం ఏదో మంచి పనే చేస్తున్నాయని నమ్మిన కంచెలోని బతికి వున్న జీవాలు, గాయాలపాలైన నెమల్లు వొక్కొక్కటి కదిలినయి రచ్చబండ కాడికి. విందాం అని బాధ్యతతో వచ్చిన ప్రాణులు అన్నీ గచ్చిబౌలి కంచెలో రచ్చబండ కాడ జమైనయి.

ముందుగాలనే అన్నీ ప్రిపేరయి వచ్చిన గుంటనక్కలు…ఆరోజు పొద్దున తెలుగు పేపర్లు , ఇంగ్లీషు పేపర్లు సెల్ పోన్లు అన్నీటిని ఎమ్మటి తెచ్చుకున్నయి. అమాయకపు అడవి జంతువులను నమ్మించడానికి తాము ఏమ్మాట్లాడాల్నో తమ అస్థాన మీడియా ఎడిటర్లు యాజమాన్యాలు రాసిచ్చిన స్క్రిప్టులను సిద్దంగా వుంచుకున్నయి. సమాచారాన్ని సేకరించుకుని సిధ్దంగా వున్నయి.

‘‘అందరూ వచ్చారా..?’’ అంటూ వొక పెద్ద గుంటనక్క అడిగింది కాలు మీద కాలేసుకుని కూసుంటూ.
‘‘వచ్చినం అయ్యా..? అని సమాధానమిచ్చాయి అడవిలోని జంతువులు.
మన ప్రాణాలు పోయే పరిస్థితిని తీసుకువచ్చి మనకింతటి కష్టాలను తెచ్చిన అసలు దోషి ఎవరో మీకు చెప్పాలని, మీకు అసలు విషయం చెప్తామనే ఈ మీటింగు. అని ఆ పెద్ద గుంటనక్క చెప్పింది.
ఎవరు ఎవరూ వాల్లు…త్వరగా చెప్పండి…అంటూ ఆత్రుతగా అమాయకపు జంతువులు అడగసాగాయి.
ఆగండాగండి….చెప్తాం చెప్తాం….పూర్తి సమాచారంతోనే వచ్చాం.. అంటూ రెండో గుంటనక్క లేచింది. ముందస్తు ప్రిపరేషన్ ప్రకారం.
చెప్పండి చెప్పండి అంటూ అరుస్తున్నాయి అడవి జీవాలు.
చెప్తాం అయితే వొక కండిషను.
ఏంటి..?
మనకింతటి కష్టాలకు కారణమైన వారెరవరో చెప్తాం…మరి వారిని యేం చేద్దాం…వారికి ఎలాంటి శిక్షవేద్ద్దాం…? అంటూ మూడో గుంటనక్క లేచింది.

వెంటనే నాలుగో గుంటనక్కలేచి,,,,ఏం చేయడమేంటి మన ప్రాణాలు పోవడానికి కారణమైన వారిని నరికేయడమే….ఏమంటారు…? అని అనగానే అక్కడే వున్న వూసరవెల్లులు తొడేల్లు గుంట నక్కలతో గొంతు కలిపి ..నిజ నిర్థారణ చేసి…నరికేయడమే…అంటూ జంతువుల గుంపులో చేరి గొంతు కలిపినయి.
అట్లా తాము కుట్రపూరితంగా చేసే నిజనిర్థారణలో నేరస్థులుగా తేలిన వారిని నరికేయాలనే వొక అంగీకారానికి వచ్చినయి.
నాతోటి సహోదరులారా.. జాగ్రత్తగా వినండి. మన పూర్వీకులయిన గుంటనక్కలు తొడేల్లు వూసరవెల్లులు వాటితో పాటు కుందేల్లు జింకలు దుప్పులు ఉడతలు ఇట్లా సమస్త సహచర జంతువులు నెమ్మలు పావురాలు పిట్టలు వంటి సహచర పక్షులు.. ఇటు పక్కన్నే వున్న అడవుల్లో సుఖంగా జీవించే వారు. కానీ 19 ఏండ్ల క్రితం ఈ కంచె గచ్చిబౌలి భూమిలో మనం నివాసముంటున్న చెట్లు చిన్న చిన్న మొక్కలుగా వచ్చి నాటుకున్నాయి.

ఈ 400 ఎకరాలు కోర్టు కేసుల్లో వుందనీ తెలిసే అక్రమంగా వచ్చి చేరాయి. ఇవ్వాల మహావృక్షాలైన ఈ వేపచెట్టు మద్దిచెట్టు మర్రి చెట్టు ఇట్లా మనం నివాసముంటున్న చెట్లన్నీ అవి ఏపుగా పెరగడం వల్లనే మనం వచ్చి ఇక్కడ జీవిస్తున్నాము…అవునా కాదా..?

అవును అవును… అంటూ గుంట నక్కలు తొడేల్లు వూసరవెల్లులు ముందుగా అందుకుని నినాదాలు చేస్తున్నాయి,. వాటితో ఈ అమాయకపు జంతువులు గొంతు కలుపుతున్నాయి.
మరి కోర్టు కేసులో వున్నభూమిలోకి ఈ మహావృక్షాలు పెరిగి పెద్దగవడం తప్పా కాదా..?
తప్పే తప్పే..
అవి పెరగడమే కాక తమ పచ్చదనంతో మనలందరినీ ఆకర్షించడం మోసం చేయడమా కాదా.,.?
అవును మోసమే మోసమే…
కోర్టు కేసులో వున్న భూమిలో పెరుగుతూ…ఇట్లా మనలను మాయచేసి మత్పరిచ్చి…. మనలను తమవైపు గుంజుకున్న ఈ 400 ఎకరాల్లోని పచ్చని చెట్లు పొదలు నేరం చేసినట్టా కదా..?
నేరం చేసినై..నేరం చేసినై…
మనలను మాయ చేయడం వారి మొదటినేరమైతే మరో నేరమున్నది..చెప్పాలా..?
చెప్పండి.. చెప్పండి
అమాయకపు జీవాలకు గుంటనక్కలు టెన్షన్ పెడుతూ తమవైపు తిప్పుకుంటున్నయి.
చెప్తా వినండి..
19 ఏండ్ల కింద అక్రమంగా వచ్చి చేరిందే కాకుండా..ఇటీవలే కోర్టు తీర్పువస్తున్నదనీ తెలిసి మనలను అప్రమత్తం చేయకుండా.. కోర్టు తీర్పురాకముందే అప్రమత్తమై మనలను వెల్లిపోమ్మని చెప్పకుండా.. ముందస్తుగా మనకు చెప్పి ఖాలీచేసేలా జాగ్రత్తలు తీసుకోకపోవడం మరో తప్పు…అవునా కాదా…?
అవును అవును…
ప్రభుత్వ బుల్డోజర్లు వచ్చి బలవంతంగా కూల్చేసేదాకా మనకు కనీసం కూడా ఈ పచ్చని చెట్లు సమాచారం ఇవ్వకపోవడం రెండో అతిపెద్ద నేరమా..? కాదా..?
నేరమే నేరమే..
రెండో అతిపెద్దనేరమే…
గట్టిగా అరుస్తునయి తొడేల్లు గుంటనక్కలు వూసరవెల్లులు..
విషయం అర్థం కాని అమాయకపు జింకలు కుందేల్లు నెమల్లు వాటితో పాటే గొంతు కలుపుతున్నయి…అనుమానంగా..
వీల్ల మూడ్ పక్కకుపోయి విషయం అర్థమైతే తాము అనుకున్న పనిచేయడానికి మద్దతు దొరకదనే ఎత్తుగడతో …వెంటనే పెద్ద గుంటనక్క ప్రకటించింది..

మన ప్రాణాలు పోవడానికి అసలు నేరస్తులు 19 ఏండ్ల కింద ఇక్కడికి వీసాలేకుండా ట్రెస్ పాస్ చేసి వచ్చి పెరిగిన ఈ పచ్చిన చెట్లే కావట్టి.. మనం ముందుగానే తీర్మానం చేసుకున్నట్టు…వీటిని ఏం చేయాలి..?

వెంటనే ఏమాత్రం సమయమివ్వకుండా…నరికేయాలి నరికేయాలి ఈ చెట్లను నరికేయాల్సిందే…వాటికి తగిన శిక్ష పడాల్సిందే…నంటూ మల్లా మిగిలిన గుంటనక్కలు తొడేల్లు వూసరవెల్లులు గొంతు కలిపినయి.

విషయం చిన్న చిన్నగా అర్థమవుతున్న మూగజీవాలను బెదిరించినట్టు మాట్లాడుతూ… తమ ఆస్తాన మీడియా సిద్దం చేసిచ్చిన పెద్దగుంటనక్క వొక వార్తపేపర్ల కట్టను వాటిముందుంచింది. మీకింకా అనుమానం వుంటే చూడండి మా నిజ నిర్థారణ కమిటి అన్నీ ఎంక్వేరీ చేసిన తర్వాతనే అఈ నిర్ణయం తీసుకున్నాం. ..చూడండి చూడండి అంటూ..పేపర్ల కటింగు కట్టను ముందల విసిరేసింది.
మల్లా అదే గుంటనక్క తమ ఆస్తాన పేపర్ను తీసుకుని సదరు వార్తను మూగజీవాలకు చూయిస్తూ డేట్లైన్ తో సహా చదవడం ప్రారంభించింది.

న్యూఢిల్లీ నుంచి వార్త.. ప్రముఖ కాంగ్రేస్ ఎంపీ గారు పెట్టిన ప్రెస్ మీట్ వార్త…మన నిజనిర్థారణకు బలమైన సాక్ష్యంగా నిలిచిన వార్త…వినండి అంటూ చదవడం ప్రాంరంభించింది.
‘‘19 ఏండ్లనుంచి కంచె గచ్చిబౌలి 400 ఎకరాల భూమి వివాదం కోర్టు కేసులో నడుస్తావుంది..అటువంటి కోర్టు కేసులో చిక్కుకున్న వివాదాస్పద భూమిలోకి ఎవరూ ఎంక్రోచ్ కాకూడదు. మరి ఈ చెట్లు చేమలు పొదలు గుండుగుత్తగా ఈ పచ్చదనమంతా కూడగట్టుకుని ఈ 400 ఎకరాల వివాదాస్పద భూమిలోకి ఎట్లా ట్రెస్ పాసయింది..ఎందుకయ్యిందో చెప్పాలి. అది అర్థం చేసుకోకుండా నేరాన్ని ప్రభుత్వం మీదికి బుల్డోజర్ల మీదికి నూకడం తప్పు..కావట్టి నేరం బుల్డొజర్లది కాదు…అక్రమంగా అవగాహనారాహిత్యంగా పచ్చగా పెరిగిన చెట్లదే…’’ అనే వార్తను లౌడ్ స్పీకర్ లో ప్రకటించింది పెద్ద గుంటనక్క.
వెంటనే ఆగకుండా….మరి నేరం రుజువైనందున..నేరస్తులైన పచ్చని చెట్లను నరికేయాల్సిందిగా తీర్మానం చేయాలిగా…
అంది రెండో గుంటనక్క.
చేయాలి చేయాలి…
ముందస్తు ప్లాన్ ప్రకారం కోరస్ అందుకున్నయి అన్నీ
యే మాత్రం ఆలస్యం కావద్దని….పెద్ద గుంట నక్క తీర్మానం రాసి చదువుతున్నది.
‘‘గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి.
నేరం చేసిన వృక్షాలను నిలువునా నరికేయాలని మా అడివి జీవాలు చేసుకున్న తీర్మానం ప్రకారం.. ప్రస్థుతం కూల్చివేస్తున్న బుల్డొజర్లు సరిపోవట్లేవు. వాటితో పాటుగా.. పెద్ద కటింగు మిషన్లు తెచ్చి ఈ పచ్చని చెట్లకు నరికివేత శిక్షను తక్షణమే అమలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్జప్తి చేస్తున్నాం… తొడేల్లు వూసరవెల్లులు గబ్బిలాలు బోలెగద్దలు తదితర అడవి జంతువుల పెద్దల సమక్షంలో ఇది మా అందరి ఇష్టపూర్తిగా రాసుకున్న తీర్మానం.
ఇట్లు అడవి పెద్దలు – గుంటనక్కలు
(ఇది కథ. ఇందులో పాత్రలు సందర్భాలు అన్నీ కల్పితాలు… ఎవరినీ ఉద్దేశించినవి కావు..గమనించగలరు)

    – హజారి

LEAVE A RESPONSE