సింగిల్‌గా వస్తా – నీ సంగతి తేలుస్తా!

– బోండాకు గుంటూరు నగర మేయర్ కావటి సవాల్
టైం నువ్వు చెప్పినా సరే లేక నన్ను చెప్పమన్నా సరే… డేట్ నువ్వు డిసైడ్ చేసినా సరే లేక నన్ను డిసైడ్ చేయమన్నా సరే… ప్లేస్ నువ్వు ఫిక్స్ చేసినా సరే లేక నన్ను ఫిక్స్ చేయమన్నా సరే…! ధమ్ము ధైర్యం ఉంటే… చీమూ నెత్తురు ఉంటే చెప్పు. ఎప్పుడు – ఎక్కడ – ఎలా రమ్మంటే అలా పార్టీ జెండా భుజాన మోసుకుని సింగిల్‌గా వస్తా… నీ సంగతేంటో తేలుస్తా…!!ఇదేదో సినిమా డైలాగ్ అనుకుంటున్నారా… కాదు. గుంటూరు నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు – విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకు బహిరంగంగా విసిరిన సవాల్.
ఓ వైపు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభి సీఎం జగన్‌ను ఉద్ధేశించి అన్న బోషడీకే అన్న మాటకే జనాగ్రహం కట్టలు తెంచుకుంటే… మరో వైపు అదే మాటను ఉద్ధేశ్యపూర్వకంగా మళ్ళీ ఉచ్ఛరించడమే కాక పోలీసులను కూడా దుర్భాషలాడిన మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావును అరెస్టు చేసి అతనిపై కఠిన చర్యలు చేపట్టాలని కోరుతూ ఎమ్మెల్యే మద్దాళి గిరి, మిర్చియార్డు ఛైర్మన్‌ చంద్రగిరి ఏసురత్నం, డిప్యూటీ మేయర్లు వనమా బాలవజ్రబాబు, షేక్‌ సజీల తదితరులతో కలిసి అరండల్‌పేట పోలీసుస్టేషన్లో మేయర్‌ మనోహర్‌నాయుడు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో పాటు బోండా ఉమ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌ను పెన్‌డ్రైవ్‌ సీఐకు సమర్పించారు.
ఈ సందర్భంగా మేయర్‌ కావటి మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్షలో… చంద్రబాబు సమక్షంలో… చంద్రబాబు పదే పదే దేవాలయమని చెబుతున్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో… మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మళ్ళీ బరితెగించి మాట్లాడడం ఖచ్ఛితంగా రెచ్చగొట్టే ప్రయత్నమేనని తెలిపారు.
మొన్న పట్టాభి వ్యాఖ్యలు ఖండించకపోవడం… నిన్న తన పక్కనే బోండా మాట్లాడుతుంటే విని ఊరుకోవడం చూస్తుంటే… చంద్రబాబు కావాలనే వారితో ఇలా అనిపిస్తున్నారన్న సంగతి లోకం మొత్తం వెల్లడైందన్నారు. అంతటితో ఆగని బోండా – చంద్రబాబు చిటికేస్తే తాడేపల్లిలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయం గంటలో నేలమట్టం చేస్తామని హెచ్చరించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నువ్వేంటో నీ స్థాయి ఏంటో… నీ కాల్‌మనీ, నీ సెక్స్‌ ర్యాకెట్‌ వ్యవహారాలన్నీ అందరికీ తెలుసని బోండాను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తికి జగన్‌ వంటి ప్రజా నాయకుడిని, ప్రజల కోసం నిస్వార్ధంగా పని చేస్తున్న నేతను విమర్శించే నైతికత లేదని స్పష్టం చేశారు. మా నాయకుడు జగన్‌ మాకు సభ్యత, సంస్కారం నేర్పారు కనుకనే మేము చాలా ఓర్పుతో ఉన్నాం. దాన్ని చేతగానితనంగా తీసుకుంటే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు హెచ్చరించారు.
చంద్రబాబు కూడా ఇలాంటి చెంచాలను పక్కనపెట్టుకుని ఎంతో కాలం ఇక రాజకీయాలు కొనసాగించలేనన్న వాస్తవం గ్రహిస్తే మేలని హితవు పలికారు. ఎందుకంటే బోండా లాంటి వారంతా ఆయన మెహర్బానీ కోసం ఆయన ముందు మాట్లాడతారు తప్ప నిజానికి ఎందుకూ పనికిరారని ఎద్దేవా చేశారు. మొరిగే డాష్‌లు కరవవన్న సామెత వారికి బాగా వర్తిస్తుందని గేలి చేశారు. చేతనైతే తన సవాలును స్వీకరించాలని మరోసారి కావటి ఛాలెంజ్ చేశారు.
గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరి మాట్లాడుతూ, పట్టాభితో మాట్లాడించడం ఆ తర్వాత బంద్‌కు పిలుపు ఇవ్వడం… అది విఫలం కావడంతో 36 గంటల దీక్షకు దిగడం అన్నీ కూడా రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ఒక పధకం ప్రకారం చంద్రబాబు ఆడుతున్న నాటకంలో భాగమేనని పేర్కొన్నారు. తాజాగా బోండా ఉమామహేశ్వరరావు కూడా బాబు నాటకాన్ని రక్తి కట్టించేందుకు ఆయన్ను మెప్పించేందుకు జగన్‌పై వ్యక్తిగత దూషణలకు దిగారని విమర్శించారు. ఇప్పటికైనా తెలుగుదేశం నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నారా లేక సమర్ధిస్తున్నారా… అన్నది తేల్చి చెప్పాలని చంద్రబాబును డిమాండ్‌ చేశారు.
గుంటూరు మిర్చియార్డు ఛైర్మన్‌ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ, జగన్‌ పాలనలో ఓవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమంతో రాష్ట్రంలో ఉన్న ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకే చంద్రబాబు ఈ నీచ రాజకీయాలకు దిగజారారని ఆరోపించారు. డిప్యూటీ మేయర్లు వనమా బాలవజ్రబాబు, షేక్‌ సజీల మాట్లాడుతూ, ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోకుంటే తగిన గుణపాఠం నేర్పించాల్సి ఉంటుందని తెలుగుదేశం నేతలను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర కార్పొరేటర్లు, పార్టీ డివిజన్‌ అధ్యక్షులు, పార్టీ నేతలు పాల్గొన్నారు.

Leave a Reply