Suryaa.co.in

Andhra Pradesh

అజ్ఞాన తిమిరాలను తొలగించే వారే గురువు

– ఆర్ఎస్ఎస్ సేవలు అమోఘం
– ఉపాధ్యాయ పరిచయ వర్గ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్

శ్రీకాకుళం: విద్యార్థుల్లోని అజ్ఞాన తిమిరాలను తొలగించేవాడే గురువు అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని పిఎన్ కాలనీలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ పరిచయ వర్గ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ గురువు అంటే సాక్షాత్తు ఆ భగవంతుడు స్వరూపం అని చెప్పారు. సంస్కృతంలో ‘గు’ అనే శబ్దానికి చీకటి అనే అర్థం అని ‘రు’ అంటే నాశనం చేసే తేజస్సు అని పేర్కొన్నారు. అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగుని ప్రసాదించే వాడే గురువు అని పేర్కొన్నారు.

మన గమ్యానికి దారి చూపించేవాడు, మనకు తెలియని విషయాన్ని చెబుతూ జ్ఞాన సంపన్నులను చేసేవాడు గురువు అని చెప్పారు. కేవలం చదువు చెప్పేవారే గురువులు కాదని జ్ఞానాన్ని ప్రసాదించే వాళ్ళు ఎవరైనా మనకు గురు సమానులేనని వివరించారు.

ఉపాధ్యాయులు సంప్రదాయాలు పట్ల గౌరవము, దైవభక్తి, పాండిత్యం, న్యాయ బుద్ధి, ధర్మాన్ని, జ్ఞానము కలిగి ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు బుడుమూరు శ్రీరామ్ మూర్తి, కొండపల్లి రామారావు, అందవరపు సంతోష్, అందవరపు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE