– దేశవ్యాప్తంగా 13 లక్షల మందికి, తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యక్షంగా రెండు లక్షల మంది ఎల్ఐసి ఏజెంట్లకు ప్రయోజనానికి చేకూర్చిన ఎంపీ జీవీఎల్
– జీవీఎల్ అడిగిన వెంటనే ఎల్ఐసి ఏజెంట్ల కోరికలను మన్నించిన ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపిన జీవీఎల్
ఎల్ఐసి ఏజెంట్లు మరియు ఉద్యోగుల సంక్షేమానికై అనేక నిర్ణయాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈరోజు ఆమోదించింది. ఎల్ఐసి ఏజెంట్లు దశాబ్దాలుగా కోరుతున్న గ్రాట్యుటీ పరిమితి పెంపు, పునరుద్ధరణ కమీషన్‌కు అర్హత,తమకు టర్మ్ ఇన్సూరెన్స్ రక్షణ – ఎల్‌ఐసి ఉద్యోగులకు కుటుంబ పెన్షన్ వంటివి వారికి అనేక సంవత్సరాలుగా తీరని కలగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఇటీవల బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు నేతృత్వంలో ఎల్ఐసి ఏజెంట్ల సంక్షేమ సంఘం లియాఫీ ఆధ్వర్యంలో, అనేకమంది ఎల్ఐసి ఏజెంట్ల అసోసియేషన్ ప్రముఖులు ఎల్ఐసి చైర్మన్ ను కలిసి ఈ విషయాలపై సహాయం చేయమని కోరడం జరిగింది.
దీనిపై జీవీఎల్ స్వయంగా ప్రధాని మోడీ ని ఈ విషయం పై సహాయం చేయమని అభ్యర్థించడం జరిగింది. అంతేకాక ఎల్ఐసి ఏజెంట్లు దశాబ్దాలుగా ఈ ప్రయోజనాలను కోరుతున్నప్పటికీ ఇంతవరకు ఎవరూ పట్టించుకోలేదని దీనివల్ల దేశవ్యాప్తంగా 13 లక్షల మందికి ఎల్ఐసి ఏజెంట్లకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుతుందని జీవీఎల్ ప్రధానికి తెలియజేశారు.
ఈ నేపథ్యంలో వెంటనే జీవీఎల్ అడిగిన అంశాలను ఆమోదిస్తూ ఎల్ఐసి ఏజెంట్లకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరే విధంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి ఈరోజు ప్రకటన జారీ చేయడం జరిగింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏజెంట్లు మరియు ఉద్యోగుల ప్రయోజనం కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ తీసుకున్న సంక్షేమ చర్యలు క్రిందివిధంగా ఉన్నాయి. వాటిల్లో ప్రధానంగా
1)ఎల్‌ఐసీ ఏజెంట్లకు గ్రాట్యుటీ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడం. ఇది ఎల్ఐసి ఏజెంట్ల జీవన స్థితిగతులలో గణనీయమైన మెరుగుదలను తీసుకొస్తుంది.
2)తిరిగి నియమించబడిన ఏజెంట్లు పునరుద్ధరణ కమీషన్‌కు అర్హులయ్యేలా చేయడం, తద్వారా వారికి ఆర్థిక స్థిరత్వం అందించడం.
ప్రస్తుతం, ఎల్‌ఐసి ఏజెంట్లు పాత ఏజెన్సీ కింద పూర్తి చేసిన ఏ వ్యాపారంపైనా పునరుద్ధరణ కమీషన్‌కు అర్హులు కాదు. జీవీఎల్ వినతిపై దీన్ని మార్చడం జరిగింది.
3)ఏజెంట్లకు టర్మ్ ఇన్సూరెన్స్ కవర్ ప్రస్తుతం ఉన్న రూ. 3,000-10,000 రూపాయల నుండి రూ. 25,000-1,50,000 కి పెంచడం.
ఈ నిర్ణయం మరణించిన ఏజెంట్ల కుటుంబాలకు భీమా గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తుంది, వారికి మరింత గొప్ప సంక్షేమ ప్రయోజనాన్ని చేకూరుస్తుంది.
4) ఎల్ఐసి ఉద్యోగుల కుటుంబాల సంక్షేమం కోసం 30% ఒకేరకమైన రేటుతో కుటుంబ పెన్షన్ అందించడం.
దీనివల్ల దేశవ్యాప్తంగా ఎల్ఐసి వృద్ధిలో మరియు భారతదేశంలో బీమా వ్యాప్తిని మరింతగా పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్న13 లక్షలకు పైగా ఏజెంట్లు మరియు 1 లక్ష కంటే ఎక్కువ మంది రెగ్యులర్ ఉద్యోగులు ఈ సంక్షేమ చర్యల నుండి ప్రయోజనం పొందుతారు.
దీనిపై జీవీఎల్ మాట్లాడుతూ తాను అడిగిన వెంటనే పై చర్యలకు ఆమోదం తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి,ఆర్దిక మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు , ధన్యవాదాలు తెలియజేశారు. దీనిపై దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 13 లక్షల ఎల్ఐసి ఏజెంట్ల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో వారు అంతులేని ఆనంద ఉత్సాహాలను వ్యక్తం చేస్తున్నారు.