Suryaa.co.in

Andhra Pradesh

హరగోపాల్ గారూ.. మీకిక్కడ ఏం పని?

– మీరేమైనా మమ్మల్ని ఆర్చేవారా ? తీర్చేవారా ?
– మీరు మమ్మల్ని తరిమేసిన వారు
– ఎలా విడదీద్దామా అనే పరమ నీచపు బుద్దేమిటి మీకు ?
– మీ బొంద.. మీ నీటిపారుదల విషయాలకు కాలం చెల్లింది

హరగోపాల్ గారూ.. మీకిక్కడ ఏం పని సర్ ? ఏదో సదస్సు కోసం వచ్చారట. చూసుకొని వెళ్ళాలి. మా రాష్ట్రం గురించి మీకెందుకు సర్? మీరేమైనా మమ్మల్ని ఆర్చేవారా ? తీర్చేవారా ? మీరు మమ్మల్ని తరిమేసిన వారు. మా బ్రతుకు మేము బ్రతుకుతున్నాము . మళ్ళీ ఇపుడొచ్చి పుల్లలు పెట్టడం తప్ప ఏమైనా ప్రయోజనం ఉందా మీ మాటల వలన ?

నేనొక ప్రొఫెసర్ ని అంటూ మొదలుపెట్టకండి. హ్యాపీగా 60 ఏళ్ళ పాటు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ, మళ్ళీ అదే ప్రభుత్వాన్ని తిడుతూ మీరు సమాజ ప్రతినిధిగా వాళ్ళ వాణి వినిపిస్తూ వచ్చిన నక్సలిజమే వెనక్కి వెళ్ళిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. మాకెందుకు సర్ మీ బోధనలు? మమ్మల్ని ఇలా బ్రతకనీయండి చాలు!

2016-17 నుంచి 2019 దాకా మీలాంటి మేధావులు తెలంగాణలో ఉంటూ అమరావతి మీద కక్కిన విషం చాలు. చివరికి వరల్డ్ బాంక్ లోన్ కు కూడా వ్యతిరేకంగా గుజరాత్ నుంచి మేధా పాట్కర్, రిటైర్ అయిపోయిన దేవసహాయం మెదలుకొని మీదాకా అమరావతిని తెగ ఆడిపోసుకొన్నారు.

2019 జూన్ నుంచి మా రాష్ట్రంలో మీలో ఒక్కరు కనిపిస్తే ఒట్టు! అందరూ మాయం. వున్న రాజధాన్ని ఆపేసి మూడు రాజధానులు అంటూ సర్కస్ చేస్తుంటే మీరెక్కడ దాక్కున్నారు ? ఆ రోజు వచ్చి అది తప్పు అని చెప్పలేకపోయారే? మీ మేధా పాట్కర్ కు, దేవ సహాయాలు మూగబోయారా? భయపడ్డారా ? లేకపోతే మనోడు కదా రాజ్యం చేసేది అనేసి, ఆంధ్రాకు రాకుండా హైదరాబాదులోనే దాక్కున్నారా ?

అప్పట్లో ప్రభుత్వం తెగ అప్పులు చేస్తుంటే ఇది తప్పు అని హరగోపాల్ లోని ప్రొఫెసర్ ఎందుకు చెప్పలేదు ? నిద్రబోయాడా? లేక మీరు కేవలం చంద్రబాబును మాత్రమే తిట్టాలి అనే వ్రతానికి భంగం అవుతుందనా?

2004 లో చంద్రబాబు మళ్ళీ అధికారానికి వచ్చి ఉంటే ఉస్మానియా యునివర్సిటీ ని ఒక హోటల్ కింద మార్చేసేవాడు అన్న మీ ఆంధ్రజ్యోతి వ్యాసంలోని మాటలు మేము మరచి పోలేదు. చంద్రబాబు మీద మీరు కక్కిన విషం అది. రిటైర్ అయిపోయినా… ఆంధ్రా ప్రజలు 164 సీట్లతో గెలిపించుకొన్న ప్రభుత్వాన్ని, చంద్రబాబుని తప్పుబట్టే బుద్ధి మీకు పోలేదే ?

తెలంగాణ నుంచి మమ్మల్ని తరిమేసేదాకా నిద్ర పోలేదు. అది చాల్లేదా మీ కడుపు మంటకి ! ఇప్పుడు మళ్ళీ రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా అంటూ విభజన వాదాన్ని మళ్ళీ తెస్తున్నారు ? మీకింక వేరే పనేమీ ఉండదా ? మేము ఇలా కూడా బ్రతకడం చూల్లేకున్నారా ? ఎవరు చెప్పారయ్యా నీకు విడిపోతామని?

మీలోని ప్రొఫెసర్ బాగా తుప్పు పెట్టి పోయాడు. ఎందుకంటే మీరు అసలు సబ్జెక్ ఫాలో కావడం మానేసి చాలా రోజులు అయినట్టుంది. ఎందుకంటే మీరు చెప్పే పాచిపోయిన రాగం రాయలసీమ వెనుకబడుంది అనేది మారిపోతోంది. కొన్ని కోస్తా జిల్లాల కంటే కొన్ని రాయలసీమ జిల్లాలు GSDP లో ముందున్నాయి. సర్వీస్ సెక్టార్ మొదలుకొని, కియా నుంచి పట్టిసీమ దాకా చాలా మార్పులు తెస్తున్నాయి . మీ బూజు పట్టిన, చేవలేని నీటి పారుదల సిద్ధాంతాలు మాకు వద్దు. 20 సంవత్సరాల తర్వాత కూడా ఎప్పుడో 2005 లో అప్పటి రాజశేఖర్ రెడ్డి తో సయ్యాటలాడిన మీ నీటిపారుదల విషయాలకు కాలం చెల్లింది.

ఇలా పక్క రాష్ట్రాలకొచ్చి ప్రాంతాల మధ్య వైరుద్ధ్యాలు పెట్టడం చాలా నీచంగానే కాదు అసహ్యంగా కూడా వుంది. వీలైతే మనుషుల్ని కలపాలి . ఇలా ఎలా విడదీద్దామా అనే పరమ నీచపు బుద్దేమిటి మీకు ?

మీరేమో హైదరాబాదు ఎంత పెద్దదైనా మీకేమీ అనిపించదు. ఆంధ్రా వాళ్ళు అమరావతి రాజధాని అంటే చాలు పరిగెత్తుకుని ఆంధ్రా కు వచ్చేసి , ‘అమరావతి పేరుతో అదే తప్పు అంట’ ! ఒక్క మాటలో చెప్పనా ….. మీ బొంద …!

హైదరాబాదుని ఇక డెవెలప్ చెయ్యడం ఆపేద్దాం . ఆదిలాబాదులో ఇంకొక రెండో రాజధాని పెడదాం , ఆ ప్రాంతం కూడా డెవెలప్ అవుతుంది, అని హైదరాబాదు లో ఎందుకు చెప్పవు సారూ ? మీ నీతులన్నీ ఆంధ్రాకేనా ?
Enough of you and your sermons. We Andhraites can happily live even without your sermons. Please don’t come here and try to divide us once again.

అవును , కొంచం ఘాటుగానే వుంది నా వ్యాఖ్యలు. నిజమే . కానీ మీరు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ప్రాంతాల మధ్య వైరుద్ధ్యాలు తేబూనడం అసహ్యంగా ఉంది.

– నీలాయపాలెం విజయ్‌కుమార్
( ఏపీ బయోడైవర్శిటీ బోర్డు చైర్మన్ ).

LEAVE A RESPONSE