పోలీస్ స్టేషన్లను టీఆర్ఎస్ నాయకులకు అప్పగించారా?

– బీజేపీ కార్యకర్తలపై దాడి చేసి హత్యాయత్నం కేసు నమోదు చేయడం దారుణం
– బీజేపీ కార్యకర్త రామచంద్రంను ఏం చేశారో చెప్పాలి
– పోలీస్ వ్యవస్థపై జరిగిన దాడి ఇది
– సీసీ పుటేజీని వెంటనే బయటపెట్టి వాస్తవాలు ప్రజల ముందుంచాలి
– ఎల్లారెడ్డిపేటలో టీఆర్ఎస్ గూండాల దాడిలో గాయపడ్డ కార్యకర్తలకు బీజేపీ నేతల పరామర్శ
– పరామర్శకు వెళుతున్న బీజేఎల్పీ లీడర్ రాజాసింగ్ ను అల్వాల్ పరిధిలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
– పోలీసుల కళ్లుగప్పి సిరిసిల్ల చేరుకున్న మాజీ మంత్రి ఏ. చంద్రశేఖర్, కూన శ్రీశైలంగౌడ్, జె.సంగప్ప

సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేటలో పోలీస్ స్టేషన్ లో బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ గూండాల దాడిపై బీజేపీ రాష్ట్ర నేతలు మాజీమంత్రి ఎ.చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లను టీఆర్ఎస్ నాయకులకు అప్పగించారా? అని ప్రశ్నించారు.

బీజేపీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్ తో కలిసి ఆయా నేతలు గాయపడ్డ బీజేపీ కార్యకర్తలను పరామర్శించేందుకు హైదరాబాద్ నుండి బయలు దేరారు. పోలీసులు అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజాసింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప పోలీసుల కళ్లుగప్పి అక్కడి నుండి తప్పించుకుని మారుమూల గ్రామాల మీదుగా పయనిస్తూ సిరిసిల్లకు చేరుకున్నారు. జిల్లా ఏరియా ఆసుపత్రికి చేరుకున్నారు. గాయపడ్డ బీజేపీ కార్యకర్త రామచంద్రంను పరామర్శించేందుకు వెళ్లగా అక్కడ రామచంద్రం లేకపోవడంతో వారంతా కలిసి జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేను కలిశారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ తీవ్రంగా మండిపడ్డారు.

తొలుత చంద్రశేఖర్ మాట్లాడుతూ…. ‘‘టీఆర్ఎస్ గూండాల దాడిలో గాయపడ్డ మా కార్యకర్త రామచంద్రంను పరామర్శించడానికి ఆసుపత్రికి వస్తే పోలీసులు అతనిని మాయం చేశారు. ఆయనను అరెస్టు చేశారా? టీఆర్ఎస్ గూండాలకు అప్పగించారో అర్ధం కావడం లేదు. టీఆర్ఎస్ నాయకుల నుండి ప్రాణభయం ఉందని రామచంద్రం, ఎలేందర్ అనే ఇద్దరు కార్యకర్తలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే… సిరిసిల్ల జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు ఆగయ్య ఆధ్వర్యంలో 200 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు హోలీనాడు తప్పతాగొచ్చి స్టేషన్లోనే మా కార్యకర్తలను చితకబాదారు. ఇది పోలీస్ వ్యవస్థపైనే దాడి చేసినట్లుగా భావిస్తన్నాం. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే పోలీస్ స్టేషన్లను టీఆర్ఎస్ కార్యకర్తలకు అప్పగించారా? అనే అనుమానం కలుగుతోంది.

మహబూబాబాద్ లో హోలీనాడు స్థానిక ఎమ్మెల్యే బహిరంగంగానే లిక్కర్ తాగిస్తూ చిందులేస్తున్నరు. టీఆర్ఎస్ నేతలను ప్రశ్నిస్తున్న బీజేపీ కార్యకర్తలపైనే దాడులు చేస్తున్నరు. దాడి చేసిన వాళ్లను వదిలేసి బీజేపీ కార్యకర్తలను 30 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. గాయపడి వ్యక్తిపై 307 కేసు నమోదు చేయడం దారుణం. పోలీసులు టీఆర్ఎస్ తొత్తులుగా పనిచేస్తున్నరు. మేం ఎస్పీని కలిసినా సానుకూల స్పందన రాలేదు. ఎస్పీపై పూర్తిగా టీఆర్ఎస్ ఒత్తిడి ఉన్నట్లు కన్పిస్తోంది’’అని పేర్కొన్నారు.

మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ… సిరిసిల్ల పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నరు. ప్రాణహాని ఉందని కార్యకర్త వెళితే.. ఆయనపైనే దాడి చేయడం హేయమైన చర్య. బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ గూండాలు చేసిన దాడులు పోలీస్ స్టేషన్లో సీసీ పుటేజీలో రికార్డైంది. టీఆర్ఎస్ గూండాల, పోలీసుల లాఠీఛార్జీలో గాయపడి ఆసుపత్రిలో చేరిన బీజేపీ కార్యరకర్తలపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం దారుణం. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి’’అని మండిపడ్డారు.

పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప మాట్లాడుతూ… ‘‘ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ఆధ్వర్యంలో వందలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ లోకి వచ్చి దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నట్లు? గాయపడ్డ మా కార్యకర్త రామచంద్రం ఎక్కడున్నరో తెలపాలి. పోలీసులు టీఆర్ఎష్ తొత్తులుగా వ్యవహరిస్తున్నారడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? పోలీసులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే… పోలీస్ స్టేషన్ లోని సీసీ పుటేజీ రికార్డులను వెంటనే బయటపెట్టాలి. దీనిని బట్టి పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో… టీఆర్ఎస్ నాయకులు ఏం చేశారనే విషయం ప్రజలకు అర్ధమవుతుంది’’అని పేర్కొన్నారు.