Suryaa.co.in

Political News

విజయమూ – వైఫల్యమూ ఆయనవే!

“నదీ ప్రవాహం… వొడ్డును
కోసేస్తూ విస్తరించినట్టు
శత్రువులను కూడా
క్రమ క్రమంగా
బలహీన పరచాలి..
దెబ్బ తెలియగూడదు
గాయం మానకూడదు.”
– ఇదీ కేసీఆర్ ఫార్ములా.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి దశ -దిశను అందించిన నాయకుడు కేసీఆర్. 2001, ఏప్రిల్ 27న ట్యాంక్ బండ్ దగ్గర కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం ‘జలదృశ్యం’ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర సమితిని ఆయన ప్రకటించిన సందర్భం ఒక చరిత్ర.అది ఇప్పటికీ నా కండ్ల ముందు కదలాడుతూ ఉన్నది.ఇరవై ఒక్క సంవత్సరాలు గడచినా నిన్ననో,మొన్ననో జరిగినట్లున్నది.టిఆర్ఎస్ పురుటి నొప్పులు విన్న కొద్దిమందిలో నేనొకడ్ని.

కేసీఆర్ రవాణా మంత్రిగా ఉన్నప్పటి నుంచి ఉండిన పరిచయం,డిప్యూటీ స్పీకర్ గా కొనసాగిన కొద్ది నెలల్లో ఆ పరిచయం సాన్నిహిత్యంగా మారడం,ఆయన తిరుగుబాటు చేసి తెలంగాణ జెండా ఎత్తుకునే దాకా చర్చల్లో పాల్గొనడం వల్ల టిఆర్ఎస్ అవతరణ సంగతి నాకు ముందే తెలుసు. అప్పుడు నేను ‘ప్రజాతంత్ర ‘ విలేకరిని.దేవులపల్లి అమర్ ఆ దినపత్రిక ఎడిటర్. టీఆర్ఎస్ ఆవిర్భావం,దాని నేపథ్యం గురించి మిగతా పత్రికలూ రిపోర్టు చేశాయి కానీ ‘ప్రజాతంత్ర’ లో అచ్చయిన వార్తా కథనాలు భిన్నమైనవి.సాధికారతతో కూడినవి.

ఇప్ప్పుడు అదంతా గతం కావచ్చు కానీ గతం లేకుండా వర్తమానం లేదు.వర్తమానం లేకుండా భవిష్యత్తూ లేదు.చాలా మంది ‘హైబ్రిడ్ ‘రాజకీయ నాయకులు,పత్రికా విలేకరులు,ఇతర సోకాల్డ్ మేధావులకూ చరిత్ర అవసరం లేకపోవచ్చు.అది వేరే సంగతి.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటాలు,అరవై ఏండ్ల కల సాకారం జరిగిన తీరు అందరికీ తెలిసిన విషయాలే.కనుక వాటి జోలికి
kcr-deeksha1 నేను వెళ్ళను.తెలంగాణ ఉద్యమ కారుడు కేసీఆర్ పరిపాలకునిగా మార్పు జరిగిపోయి ఎనిమిదేండ్లు గడిచాయి.2001 నుంచి 2022 వరకు విజయమైనా, వైఫల్యమైనా కెసిఆర్ ఖాతాలోకే వెడతాయి.రెంటికీ ఆయనే బాధ్యుడు.ప్రాంతీయ రాజకీయపార్టీలలో ప్రజాస్వామ్యం కన్నా వ్యక్తి స్వామ్యం ఎక్కువగా నడుస్తుంది.వ్యక్తి పూజ, ఆరాధన జాతీయపార్తీల్లోనూ ఉన్నా ప్రాంతీయ పార్టీలలో దాని మోతాదు ఎక్కువ. తెలంగాణలో ‘కేసీఆర్ కేంద్రంగానే పార్టీ కార్యకలాపాలు, ప్రభుత్వ పాలనా వ్యవహారాలూ నడుస్తున్నవి.కనుక గెలుపోటములకు ఆయనే బాధ్యత తీసుకొనక తప్పదు.కెసిఆర్ వ్యూహమూ, ఎత్తుగడలపై అపరితమైన విశ్వాసం ఆ పార్టీ నాయకులకు ఉన్నది. 2014 తెలంగాణ తొలి ఎన్నికల్లో టిఆర్ఎస్ 63 స్థానాలు గెలుచుకొని అధికారం చేబట్టింది.తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి తీసుకు వచ్చిన చాంపియన్ గా ప్రజల్లోకి వెళ్ళినా బొటాబొటీ సీట్లు వచ్చాయి.

కాగా తెలంగాణ,తెలంగాణేతర ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొల్పడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు.రాష్ట్రం ఏర్పడ్డాక రాజకీయ పునరేకీకరణను వూహాత్మకంగా అమలు చేశారు.మొదట 63 సీట్లు గెలిచిన టిఆర్ఎస్ తర్వాత ఉపఎన్నికల్లో మరో రెండు గెలిచి 65 కు సంఖ్యాబలం పెంచుకున్నది.వివిధ పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించినందున మరో 25 మందిని కలుపుకొని టిఆరెస్ ఎమ్మెల్యేల బలం 90 కి పెరిగింది.ప్రత్యర్థులు బలహీనపర్చకుండా,రాజకీయ సంక్షోభం వంటి పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా కేసీఆర్ శాసనసభలో పార్టీ ‘నెంబర్ గేమ్’ను మార్చిపారేశారు.

‘రాజకీయ పునరేకీకరణ’ లాభమా నష్టమా? అనే అంశంపై ఇంకా చర్చ జరుగుతూనే ఉన్నది.2018 లో 88 అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకున్నా మరికొంత మంది కాంగ్రెస్,టిడిపి ఎమ్మెల్యేలను కూడా టిఆర్ఎస్ లోకి లాగి పారేశారు.దీంతో టిఆర్ఎస్ 100 కు పైగా సభ్యులతో అసెంబ్లీలో అత్యంత బలశాలిగా ఉన్నది.అయితే ఏ రాష్ట్రంలో అయినా,ఏ అధికార పార్టీకి అయినా మూడో టర్మ్ లో గెలవడం పెద్ద సవాలు.ఇంటా,బయటా ఎన్నో సమస్యలను,సవాళ్ళను అధిగమించవలసి ఉంటుంది.

టీఆర్ఎస్ నుంచి 2023 లో టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య అనూహ్యంగా ఉన్నది. కొన్ని చోట్ల పదిమందికి పైగా టికెట్ ఆశిస్తున్నట్టు సమాచారం అందుతున్నది.మరో వైపు పార్టీ కార్యకర్తలలో నిరాశ,నిరుత్సాహం, నిస్తేజం, నిర్వేదం కన్పిస్తున్నాయి.వారికి తగిన గుర్తింపు,ప్రాముఖ్యత లభించడం లేదన్న అపవాదు ఉన్నది.2015 నుంచి వలస వచ్చిన పర పార్టీల నాయకులు, కార్యకర్తలతో నిండిపోయినందున ఈ సమస్య వచ్చిపడింది.

కాంగ్రెస్,టిడిపి,సిపిఐ తదితర పార్టీల నుంచి పెద్ద పెట్టున వలసలు రావడంతో పార్టీలో గందరగోళ వాతావరణం ఏర్పడింది.ఎనిమిదేండ్లుగా ప్రభుత్వాన్ని,పార్టీని ఒంటి చేత్తో నడుపుతున్న ఏకవీర కేసీఆర్.ఆయన ఇప్పటికీ పూర్తి ఫామ్ లోనే ఉన్నారు.కానీ పార్టీ ఎమ్మెల్యేలు,కొందరు ప్రజాప్రతినిధులు,నాయకుల అరాచకాలతో పార్టీ ప్రతిష్ట మంటగలుస్తున్నది.

ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ ఎం.పిలు, ఎం.ఎల్.ఏ లకు ఈ నెల 27న హైటెక్స్ లో జరిగే పార్టీ అవతరణ సంబరాలలో కేసీఆర్ పిలుపునివ్వనున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరు, రాజకీయ పరిస్థితులపై ప్రశాంత్ కిశోర్ ప్రాధమికంగా కొన్ని రిపోర్టులను కెసిఆర్కు ఇచ్చినట్టు వార్తలు వెలువడుతున్నవి. ఈ వార్తలను అధికారికంగా ఎవరూ ధ్రువీకరించడం లేదు. చాలా చోట్ల కాంగ్రెస్,టిడిపిల నుంచి ఫిరాయించి టీఆరెస్ లో వెలుగుతున్న వారికి,పాత నాయకులకు మధ్య మధ్య ఆధిపత్య పోరు కనిపిస్తున్నది.

ప్రజల్లో వ్యతిరేకత నెలకొన్నా దాన్ని ‘ఓవర్ టేక్’ చేయగల మంత్రబలం కెసిఆర్ కు ఉన్నట్టు ఆయన మద్దతుదారుల వాదన.ఇది పాక్షిక నిజం. వేలాది కోట్లతో అభివృద్ధి, సంక్షేమ పథకాల వెల్లువ సాగుతున్నందున అవి ఓట్లుగా మారతాయని ముఖ్యమంత్రి నమ్మకం.కింది స్థాయి ఓటరు తమ పక్షాన
kcr-family ఉన్నట్టు కెసిఆర్ ద్రువీకరించుకున్నట్టు కనిపిస్తున్నది.ఇది కూడా పాక్షిక నిజమే.ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నప్పుడే ఈ వాదనలకు బలం చేకూరుతుంది.ప్రస్తుతం కాంగ్రెస్,బీజేపీ తెలంగాణను టార్గెట్ చేసుకొని కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నవి.తన వ్యవహార శైలిపట్ల పార్టీలో,ప్రభుత్వంలోనూ అయిష్టత ఏ మేరకు ఉన్నదో కేసీఆర్ సమీక్షించుకోవలసి ఉన్నది.

రాజకీయనాయకత్వానికంటే అధికారులకు ఎక్కువ ప్రాధాన్యత నివ్వడం,పూర్వాపరాలు, పర్యవసానాల గురించి ఎవరితో చర్చించకుండా తాను అనుకున్న నిర్ణయాలను మొండిగా అమలు చేయడం దీర్ఘకాలంలో లాభం కన్నా నష్టమే ఎక్కువ చేయవచ్చు. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడంలో కెసిఆర్ ప్రతిభాపాటవాల గురించి ఎంత చెప్పినా తక్కువే .చాణక్యుడు,శకుని కలపోతగా కెసిఆర్ ను అభివర్ణించేవాళ్లు కూడా లేకపోలేదు.పదవులు,ధనార్జన, అధికార దాహంతో కాంగ్రెస్ నాయకులు కొట్టుమిట్టాడుతుంటారన్నది జగమెరిగిన సత్యం.ఆ సంస్కృతి టిఆర్ఎస్ కు కూడా పాకిందా లేదా అన్నది కేసీఆర్ లోతుగా పరిశీలించాలి.

కాంగ్రెస్, బీజేపీలలో కెసిఆర్ సమ ఉజ్జీ లేకపోవడం అధికార పక్షానికి అనుకూల అంశం.2004 లో అధికారం వచ్చే నాటికి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీలో అందరూ మానసికంగా సిద్ధమయ్యారు.వై.ఎస్ వలె బలవంతుడు తెలంగాణ,ఆంద్ధ్రప్రదేశ్ లలో లేకపోవడం ఆ పార్టీకి మైనస్.రేవంత్ రెడ్డి దూకుడు వైఖరి,దుందుడుకు స్వభావం కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్తేజం నింపడానికి పనికి వస్తాయి.ప్రజాదరణ ను పొందడం ఎలా అన్నది పెద్ద టాస్క్.కనుక తెలంగాణ లో కెసిఆర్ ‘బ్రాండ్ ‘ ఇమేజ్ తమను గట్టెక్కిస్తుందని సిట్టింగ్ ఎమ్మెలేలు అనుకుంటున్నారు.

సిట్టింగ్ ఎమ్మెల్యేలలో చాలా మందిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తున్నది.అయితే వారిలో ఎంతమందిని మార్చగలరో,మార్చితే వచ్చే పర్యవసానాలు, ప్రకంపనలు ఏమిటో తెలియదు.2018 ఎన్నికల నాటి పరిస్థితి 2023 లో ఉండదు.టికెట్టు నిరాకరణకు గురైన వారు కాంగ్రెస్ లేదా బీజేపీలలో చేరిపోవడానికి వెనుకాడరు.ఇతర పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులను చేర్చుకోవడం కెసిఆర్ వ్యూహాత్మక తప్పిదమో కాదో 2023 ఎన్నికల్లో తేలనున్నది.

గత ఎన్నికల్లో టీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు,ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన ఎమ్మెల్యేలు,గత ఎన్నికల్లో టికెట్టు ఆశించి భంగ పడినవారు,గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలై నియోజకవర్గ ఇంచార్జులుగా కొనసాగుతున్నవారు,వివిధ పార్టీల నుంచి వచ్చి టికెట్ ఆశిస్తున్న వారు… ముక్క చెక్కలయి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడివడి వచ్చే జూన్ నాటికి నాలుగేళ్లు కావోస్తున్నాయి.

కేసీఆర్ పాలనను అద్భుతం, అమోఘం అనే వాండ్లు పక్కా ‘భజనపరులు’ అని గుర్తించవలసి ఉన్నది.వీళ్లంతా ఏదో ఒక రూపంలో కేసీఆర్ లబ్ధిదారులు.ఎలాంటి నిబద్ధత లేదు.కేసీఆర్ పట్ల విధేయత కూడా తాత్కాలికమే. పూర్వాశ్రమంలో రాడికల్ యువజన సంఘం రాష్ట్ర నాయకునిగా పనిచేసి,బిసి కమిషన్ అధ్యక్షునిగా పనిచేసిన బి.ఎస్.రాములు కేసీఆర్ ‘అభివృద్ధి నమూనా’ ను ఎంత పెద్దఎత్తున ఆకాశానికి ఎత్తాడో తెలిసిందే.ప్రభుత్వంతో ఏదో విధంగా పదవులో,ఇతరత్రా ప్రయోజనాలు పొందిన ‘మాజీ’లంతా కేసీఆర్ ను ‘మావో’తో పోల్చడానికి కూడా వెనుకాడ లేదు.

టీఆర్ఎస్ కూడా మిగతా ఎన్నికలపార్టీల లాగే పక్కా బూర్జువా రాజకీయ పార్టీ అని పదవులు లభించేదాకా అంగీకరించరు.పదవిని కోల్పోయాక అదే బిఎస్.రాములు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను ఎట్లా చెండాడుతున్నారో చూస్తున్నాం. హుజురాబాద్ ఎన్నికల్లో బిఎస్.రాములు ఈటల రాజేందర్ తరపున ‘న్యాయవాది’గా నిలబడి చిచ్ఛరపిడుగులా చెలరేగిన వైనాన్ని చూసాం.

కేసీఆర్ బహుముఖి. ఆయన ఒకసారి రైతు.ఒకసారి భూ నిర్వాసితుడు. ఒకసారి ఇంజనీరు. శ్రమజీవి. గులాబీ కూలి.ప్రజల కష్టం సుఖం ఆయనకు తెలిసినంతగా ఎవరికి తెలుసు అని కూడా కేసీఆర్ అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు.అందువల్ల ప్రజా ప్రయోజనాలు ఆయనకు మాత్రమే అర్థమవుతాయి. ఆయన మాత్రమే అడగ =కముందే జనానికి కావాల్సినవి సమకూర్చుతారు.వరాలు ఇస్తారు.

చాకలి,మంగలి, కమ్మరి, కుమ్మరి, గొల్ల కుర్మ….తదితర సకల జనుల క్షేమం కాంక్షించి కొత్త, కొత్త పథకాలు గుప్పిస్తున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలలో ‘కేసీఆర్ స్కూలు’కొత్త రికార్డులను నమోదు చేస్తున్నది.ఈ రికార్డులు మాత్రమే మూడో టర్మ్ లోనూ అధికారం సంపాదించి పెట్టేటట్లయితే ప్రశాంత్ కిశోర్ అవసరం టిఆర్ఎస్ కు ఏమిటి అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.

ఇదిలా ఉండగా కేసీఆర్ వలె జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ మాట్లాడితే కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా మారేది.దేశ భక్తి, దైవభక్తి, జాతీయవాదం, మతతత్వం… వీటికి వేర్వేరు నిర్వచనాలున్నవి.అన్నీ ఒకటేనని ప్రచారం చేసి ప్రజల్లో ప్రయోజనం పొందాలని బీజేపీ భావిస్తున్నది. దీర్ఘకాలంలో ఈ మంత్రం పనిచేయదు.ప్రజల దైవభక్తి రాజకీయాలకు అతీతమైనది.భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకముందు కూడా దేశంలో కోట్లాదిమంది ప్రజలు రకరకాల మత విశ్వాసాలతో వివిధ మందిరాలకూ, మఠాలకూ వెడుతూనే ఉన్నారు. , రకరకాల ఆచారాలు,సంప్రదాయాలను అనుసరిస్తూనే ఉన్నారు.ముఖ్యమంత్రులు బ్రహ్మోత్సవాలకు, దేవుళ్ల పెళ్లిళ్లకు, జాతర్లకు,తిరుపతి వెంకన్న దగ్గరకు వెళుతూనే ఉన్నారు.

తమ వల్లనే దేశంలో దైవభక్తులు పెరిగిపోతున్నట్టు, వారు దేశ భక్తులుగా, జాతీయ వాదులుగా మారిపోతున్నట్టు బీజేపీ చెప్పుకుంటున్నది.ఆ తర్వాత వారు ఇతర మతాలను వ్యతిరేకిస్తారని అంటున్నది. హిందువులంతా బీజేపీకి అనుకూలంగా ఓటు వేస్తారన్నది ఒక థియరీ. ఈ సిద్ధాంతం తప్పని కేసీఆర్ రుజువుచేస్తున్నారు. చాలా మంది బీజేపీ నాయకులకన్నా కేసీఆర్ గొప్ప దైవ భక్తుడు. ఆయన బాహాటంగా దేవాలయాలకు వెడుతున్నారు. మఠాధిపతులను సందర్శించడం, పూజలు, యజ్ఞాలు చేయడం కొనసాగిస్తూనే ఉన్నారు.

బీజేపీకి ఓటువేయడానికి ఇదే కొలమానం అయితే ఓటర్లను కేసీఆర్ సులభంగా అయోమయ పరచగలరు. తెలంగాణలో ముస్లింలు కేసీఆర్ ను వ్యతిరేకించడం లేదు. ఆయన హిందువు అయినంత మాత్రాన ముస్లింల వ్యతిరేకి కాదన్న నిర్ధారణ ఉన్నది. నరేంద్ర మోదీకి 2014 లోనూ, 2019 లోనూ వచ్చిన ఓట్లు పూర్తిగా ‘హిందూత్వ’ వాదం ఆధారంగా వచ్చిన ఓట్లు కావు.యుపిఏ ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత, అవినీతి, ఒక బలమైన నాయకుడు కనపడడం, ప్రతిపక్షం నిర్వీర్యం కావడం వల్ల వచ్చిన ఓట్లు. కాగా బీజేపీకి వ్యతిరేకంగా ఒక సైద్ధాంతిక భూమికను కేసీఆర్ నాలుగేండ్లుగా ప్రస్తావిస్తున్నారు. ఆయన తెలంగాణలో అనుసరిస్తున్న ఫార్ములా దేశానికి అనుసరణీయం కాగలదని భావిస్తుండవచ్చు.
అయితే తెలంగాణను వదిలి జాతీయ రాజకీయాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టడం నేల విడిచి సాము చేసినట్లవుతుందేమో టిఆర్ఎస్ నిర్మాత ఆలోచించవలసి ఉన్నది.

– ఎస్.కె. జకీర్
ఎడిటర్, బంకర్‌న్యూస్

LEAVE A RESPONSE