Suryaa.co.in

Andhra Pradesh

మడకశిర ప్రాంతంలో భారీ పరిశ్రమలు

– కేంద్ర మంత్రి హెచ్. డి. కుమారస్వామి హామీ
– కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్. డి. కుమారస్వామిని బెంగుళూరులోని జె.డి.ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కలిసిన మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి

బెంగుళూరు: వెనుకబడిన మడకశిర నియోజక వర్గం అభివృద్ది పథంలో నడవాలంటే, వలసలు నివారించి, నిరుద్యోగ యువతీ యువకులకు స్థానికంగా ఉద్యోగావకాశాలు కల్పించేలా సహకరించాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్. డి. కుమారస్వామి ని మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కోరారు.

మడకశిర మండలం ఆర్.అనంతపురం వద్ద ఇప్పటికే ప్రభుత్వం సేకరించి ఎపిఐఐసి ఆధ్వర్యంలో ఉన్న 1600 ఎకరాల పారిశ్రామిక వాడలో భారీ పరిశ్రమలు నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలని హెచ్. డి. కుమారస్వామి ని కోరారు.

అగళి మండలం, గాయత్రీ కాలనీ వద్ద అందుబాటులో ఉన్న 3000 ఎకరాల ప్రభుత్వ భూమిలో కూడా భారీ పరిశ్రమలు నెలకొల్పి, మడకశిర నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పథంలో నడిపేందుకు సహకరించాలని కోరారు.

కుంచిటిగ వక్కలిగ, వీరశైవ లింగాయత్, మరియు సాదర కులస్తులను కేంద్ర ఓబిసి జాబితాలో చేర్చాలని, ఎన్నో ఏళ్లుగా వాల్మీకి కులస్తులకు కలగా నిలిచిపోయిన ఎస్టీ జాబితాలో పునరుద్దరణకు తోడ్పాటు అందించాలని కోరారు.

కేంద్ర మంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందిస్తూ… వీలైనంత త్వరలో మడకశిర ప్రాంతంలో భారీ పరిశ్రమలు స్థాపించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశం అనంతరం మాజీ ప్రధాన మంత్రి, దేవేగౌడ ని కలిసి వారి ఆశీస్సులు పొందారు.

ఈ కార్యక్రమంలో కర్ణాటక చిక్క నాయకనహళ్లి ఎమ్మెల్యే సి బి సురేష్ బాబు , పావగడ మాజీ ఎమ్మెల్యే తిమ్మ రాయప్ప, సిరా అభ్యర్థి ఉగ్రేష్ గౌడ , తుమకూరు జిల్లా జెడిఎస్ అధ్యక్షులు అంజినప్ప,రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి , మడకశిర నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు,

LEAVE A RESPONSE