ఇలా అయితే పొత్తులెలా? ఇదంతా బిజెపి లీలా??

ఒకటా..రెండా..మూడా…
ఎవరు ఎవరితో…
మొత్తంగా ఎందరు..!?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల నాటికి జగన్ పార్టీకి వ్యతిరేకంగా ఏ పార్టీలు కలవబోతున్నాయి?
వైఎస్సార్ సిపి ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే బరిలోకి దిగడం తథ్యం..అటు పక్క ఎవరెవరు..ఎందరు చెయ్యి కలపబోతున్నారు?
ఇదే కీలక ప్రశ్న..!!?

చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ వైసిపికి బద్ధ విరోధి..
ఇటు పవన్ పార్టీ జనసేన కూడా వైసిపి వ్యతిరేక ధోరణినే మొదటి నుంచి అనుసరిస్తోంది..ఇది నికరం..
ఒకే పార్టీకి వ్యతిరేకంగా ఉన్న తెలుగుదేశం..జనసేన చేతులు కలిపి వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగనున్నాయా అనే విషయంలో ఇంతవరకు స్పష్టత లేదు.అసలు ఆ మేరకు ఇంతవరకు సరైన అడుగులే పడలేదు.బాబు మటుకు బాబు..పవన్ మానాన పవన్ జగన్ సర్కారుకు వ్యతిరేకంగా పోరాటాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. వైసిపి సభలను మించి బాబు మీటింగులకు..పవన్ షోలకు జనం పెద్ద సంఖ్యలోనే హాజరవుతున్నారు.. అది బలుపా..వాపా..లెక్క కట్టే పరిస్థితి ఇంకా రాలేదు.అసలు పొత్తులపై స్పష్టత ఎందుకు ఉండడం లేదు.

ఏ పార్టీ కూడా ఒక్కటిగా జగన్ పార్టీకి ఎదురెళ్లి గెలవడం సంగతి సరే గట్టి పోటీ ఇచ్చే సీన్ కనిపించడం లేదు. పొత్తులు అనివార్యం.. అయితే పిల్లి మెడలో గంట కట్టేదెవరు!? పవన్ అదో టైపు..ఆయనకు నిలకడ ఉండదనే అపప్రద ఇప్పటికే ఉంది.అది నిజమే అన్నట్టు ఉంటుంది ఆయన వైఖరి ఒక్కోసారి. ఇక్కడ ప్రధానంగా చర్చించుకోవాల్సి ఉంది. బిజెపి గురించి..రాష్ట్రంలో పొత్తులు కుదరకుండా అడ్డుగోడలా ఉంది కమలమే.ముఖ్యంగా పవన్ సెటిల్ కాకుండా బిజెపి ఆడుకుంటున్నట్టు అనిపిస్తోంది.అతడితో కలిసి పని చేస్తున్నట్టు సినిమా ఆడుతూ మరో పక్క జగన్ తో అంటకాగుతోంది బిజెపి.. కొన్ని రోజుల క్రితం వరకు పవన్ కు ఇచ్చిన ప్రాధాన్యత ఇప్పుడు లేదు.మొన్నటికి మొన్న మోడీ భీమవరం వచ్చినప్పుడు చిరంజీవిపై ప్రేమ కురిపించి కొత్త డ్రామాకు తెర ఎత్తారు. పైగా పవన్ను పట్టించుకోనట్టే వ్యవహరిస్తున్నారు.మోడీ నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు పవన్ పార్టీతో ఆడుకుంటున్నట్టే కనిపిస్తోంది.ఒకరకంగా బిజెపి పవన్ కంటే జగన్ లోనే బలమైన స్నేహితుణ్ణి చూస్తున్నట్టుగా కొన్ని పరిణామాలు సూచిస్తున్నాయి.

అంతెందుకు… గడచిన మూడున్నర సంవత్సరాల్లో బిజెపి జగన్ సర్కారుకు గాని.. వ్యక్తిగతంగా జగన్మోహన రెడ్డికి గాని వ్యతిరేకంగా ఒక్క నిర్ణయం తీసుకున్న పాపాన పోలేదు.పైగా జగన్ పార్టీకి బద్ధవిరోధి అయున తెలుగుదేశంతో పవన్ కళ్యాణ్ చేతులు కలపకుండా, ఎప్పటికప్పుడు కళ్ళేలు వేస్తూనే ఉంది బిజెపి. ఇదంతా ఓ హైటెక్ డ్రామాగా గోచరమవుతోంది. ఇది గ్రహించో లేకో మొత్తానికి పవన్ మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు.

కానీ ఎన్నాళ్లిలా..2024..అంతకంటే ముందుగానే నిర్ణయం తీసుకోక తప్పదు కదా… ఒక పక్క జగన్ వైఖరి చూస్తే నిర్ణీత 2024 కంటే ముందుగానే ఎన్నికలకు వెళ్లాలనే దూకుడులో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇటీవల ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన గడప గడప..పార్టీ పనుపున నిర్వహించిన ప్లీనరీ.. రెండింటికీ జనం హాజరు అంతంత మాత్రంగానే ఉండడం.. సాక్షాత్తూ పార్టీ అధ్యక్షుడు..ముఖ్యమంత్రి జగన్ హాజరైనప్పటికీ.. కొన్ని చోట్ల మోపు చేసినప్పటికీ ప్రజలు పెద్దగా రాకపోవడమే గాక వచ్చిన వాళ్ళు కూడా మొక్కుబడిగా మొహం చూపించి నిష్క్రమించే పరిస్థితి దాపురించడాన్ని జగన్ సీరియస్ పరిణామంగానే చూస్తున్నారు.తన గ్రాఫ్..పార్టీ లెవెల్ పడినట్టుగా గ్రహించనంత అమాయకుడు కాదు జగన్మోహన రెడ్డి.మరోపక్క ప్రధాన శత్రువులైన తెలుగుదేశం.. జనసేన బలపడుతుండడం మరో కీలక వ్యతిరేక అంశం.ఈ రెండు శక్తులు మరింతగా బలపడేలోగా.. చెలిమి దిశగా అవి బలంగా అడుగులు వేసేలోగా ఎన్నికలకు వెళ్లాలనేది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది.ఈలోగా ఎమ్మెల్యేల పట్ల జనం విశ్వాసం పెరిగేలా చేసేందుకు వారికి ప్రత్యేక నిధులు కేటాయించడం ద్వారా తన ప్రభుత్వంలో ఎమ్మేల్యేలంటే కేవలం దిష్టి బొమ్మలేనన్న మచ్చ చేరిపేసుకినే ప్రయత్నమూ చేస్తున్నారు జగన్.మరోవైపు అడగకపోయినా ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ముర్ముకి మద్దతు ఇచ్చి బిజెపికి తాను దగ్గరే అన్న బొమ్మ చూపించే ప్రయత్నం చేశారు.ఇదంతా నిస్సందేహంగా వైసిపి ఎన్నికల సంసిద్ధతే.

ఇప్పుడిక బంతి విపక్షాల కోర్టులోనే ఉంది.ఇక్కడ విపక్షం అంటే బిజెపిని పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదు.అది గోడ మీద పిల్లి..అంతే కాదు పొయ్యిలో ఉచ్చ పోసే రకం కూడా.. జగన్మోహనరెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి చర్య తీసుకోకపోవడమే గాక ఆయనకు వ్యతిరేకంగా టిడిపి…జనసేన చేతులు కలపకుండా చూసే వ్యూహం అమలు చేయడం ద్వారా మోడీ..అమిత్ షా తమ ప్రధాన శత్రువు చంద్రబాబు మళ్లీ ఫ్రంట్ లైన్ రాజకీయాల్లోకి రాకుండా చెయ్యడం అనే పెద్ద జాతీయ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది.

చంద్రబాబు తిరిగి వస్తే బలమైన శక్తిగా ఎదగడం తథ్యం..జగన్ దేముంది.జాతీయ రాజకీయాల్లో ఆయన ఎప్పుడూ ఒక శక్తిగా లేరు. దానా దీనా చెప్పొచ్చేది ఏంటంటే బిజెపిని నమ్ముకుంటే రాష్ట్రంలో జగన్ వ్యతిరేక పార్టీల పొత్తు కుదిరేది అసాధ్యం… ఆ పార్టీని నమ్మిన పవన్.. అవమానించి..అనుమానిస్తూ..మళ్లీ కలవాల్సి వస్తుందేమో అని ఆశపడుతూ..మొత్తానికి ఏం చెయ్యాలో పాలుపోని స్థితిలో ఉన్న చంద్రబాబు ముందే మేలుకుని తామిద్దరూ ఏం చెయ్యాలో నిర్ణయించుకుని తదనుగుణంగా వ్యూహాలు రచించుకుని ముందుకు వెళ్లడం మంచిది. జగన్ వ్యతిరేక ఓట్లు చీలకుండా జాగ్రత్త పడడమే ఆయన వ్యతిరేక శక్తుల ముందు ఉన్న ఏకైక మార్గం. అందుకు ప్రధాన ప్రతిబందకం జాతీయ స్థాయిలో ప్రయోజనాలే ప్రధానం అనుకునే బిజెపి..అది పక్కా…!

ఎలిశెట్టి సురేష్ కుమార్
జర్నలిస్ట్

Leave a Reply