Suryaa.co.in

Andhra Pradesh

ఇది సర్దుబాటు కాదు.. ప్రజలకు సర్దుపోటు

– ప్రజలకు కూటమి ఇచ్చిన భారీ కరెంట్ షాక్
– వైసీపీకి మీకు తేడా ఏంటి?
– వైసీపీ చేసింది పాపం అయితే.. టీడీపీ-జనసేన-బీజేపీ ప్రభుత్వం పెడుతున్నది శాపం
– నిధులు ఇవ్వాలని మోదీని గల్లా పట్టి అడగండి
– మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు
– ఎక్స్ వేదికగా కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్వీట్

విజయవాడ: విద్యుత్ చార్జీలపై గత ప్రభుత్వ పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాల్సిన కూటమి ప్రభుత్వం.. ఆ పాపపు పరిహారాన్ని ప్రజల నెత్తినే మోపుతోందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు.
రూ.18 వేల కోట్ల సర్దుబాటు చార్జీలు, వసూళ్ల విషయంలో తమ తప్పేం లేదని.. తమకసలు సంబంధమే లేదని, ఆ భారం తమది కాదని.. ప్రజలపైనే ఆ భారం మొత్తం మోపుతున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సర్దుబాటు కాదని, ప్రజలకు సర్దుపోటు అని అభివర్ణించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన భారీ కరెంట్ షాక్ అని మండిపడ్డారు.

“విద్యుత్ చార్జీల అంశంలో వైసీపీ చేసింది పాపం అయితే, రాష్ట్ర ప్రజలకు టీడీపీ-జనసేన-బీజేపీ ప్రభుత్వం పెడుతున్నది శాపం. గత సర్కారు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ప్రజలకు ఏమిటి సంబంధం? ప్రభుత్వం ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తే, ఆ అదనపు భారాన్ని ప్రజలపై మోపుతారా? విద్యుత్ కొనుగోళ్ల విషయంలో గత ఐదేళ్లలో వైసీపీ మోపిన భారం రూ.35 వేల కోట్లు అయితే, ఈ ఐదు నెలల్లో కూటమి ప్రభుత్వం మోపిన భారం రూ.18 వేల కోట్లు! వైసీపీకి మీకు తేడా ఏంటి?

వైసీపీ ప్రభుత్వం తొమ్మిది సార్లు కరెంటు చార్జీలు పెంచిందని అన్నారు. కూటమి అధికారంలోకి వస్తే ఒక్క రూపాయి కూడా కరెంటు చార్జీలు పెంచబోమన్నారు. అవసరమైతే 30 శాతం తగ్గిస్తామని కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటే, అదనపు భారాన్ని ప్రజలపై మోపకూడదన్న చిత్తశుద్ధి మీకుంటే, వెంటనే ఆ రూ.18 వేల కోట్ల సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలి. అదనపు భారం తగ్గించేందుకు నిధులు ఇవ్వాలని మోదీని గల్లా పట్టి అడగండి అని పిలుపునిచ్చారు.

ఇకపై ప్రజల నుంచి ఒక్క రూపాయి అదనంగా వసూలు చేసినా ఒప్పుకునేది లేదు. ఈ మేరకు కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తోంది. ట్రూఅప్ చార్జీల రూపంలో అధిక విద్యుత్ బిల్లులు వసూలు చేస్తున్నందుకు నిరసనగా రేపటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ తరఫున పిలుపునిస్తున్నాం” అని షర్మిల ట్వీట్ చేశారు.

LEAVE A RESPONSE