– విశాఖలో గూగుల్ డాటా సెంటర్ దేశానికే తలమానికం
– గూగుల్ పెట్టుబడుల వెనుక ఐటీ మంత్రి లోకేష్ కీలక పాత్ర
– అధికారంలోకి వచ్చిన వెంటనే గూగుల్ సంస్థను సంప్రదించారు
– ఏఐ డాటా సెంటర్‌తో విద్య, వైద్యం, వ్యసాయం సహా అనేక రంగాల్లో కీలక మార్పులు
– గూగుల్ ఇన్వెస్టిమెంట్పై శుభాకాంక్షలు తెలిపిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సీఎం చంద్రబాబు
అమరావతి :- ఏపీ బ్రాండ్ పునరుద్ధరణతోనే 16 నెలల్లో భారీ పెట్టుబడులు సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గూగుల్ డాటా సెంటర్ ఏర్పాటు ఏపీ చరిత్రలోనే కాకుండా…దేశ ఐటీ చరిత్రలోనే ఇదొక పెద్ద మలుపు కానుందని ముఖ్యమంత్రి అన్నారు. హైదరాబాద్ దశ దిశ నాడు మైక్రోసాఫ్ట్‌తో మారిందని….నేడు ఏపీలో గూగుల్ డాటా సెంటర్ ఆ పాత్ర పోషిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీకి గూగుల్ డాటా సెంటర్ రావడంలో ఐటీ మంత్రి లోకేష్ కీలక పాత్ర పోషించారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గూగుల్ సంస్థను సంప్రదించి…నిరంతరం ఫాలో అప్ చేయడం వల్లే లక్ష్యాన్ని చేరుకున్నామని సీఎం అన్నారు. ఢిల్లీలో గూగుల్ సంస్థ నిర్వహించిన భారత్ ఏఐ శక్తి సదస్సులో పాల్గొన్న అనంతరం అమరావతికి చేరుకున్న సీఎం చంద్రబాబుకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు శుభాకాంక్షలతో స్వాగతం పలికారు. థాంక్యూ సీఎం సార్, గూగుల్ కమ్స్ టు ఏపీ అంటూ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నేతలతో సీఎం చంద్రబాబు కొద్దిసేపు ముచ్చటించారు.
ఏఐ డాటా సెంటర్‌తో విద్య, వైద్య, వ్యవసాయంలో కీలక మార్పులు
ఏఐ డాటా సెంటర్ ఏర్పాటుతో విద్య, వైద్యం, వ్యవసాయం సహా అనేక రంగాల్లో కీలక మార్పులు వస్తాయని ముఖ్యమంత్రి అన్నారు. ఇటువంటి సంస్థల రాకతో కలిగే మేలును ప్రజలకు వివరించాలని నేతలకు సూచించారు. సామాన్యులకు సైతం డేటా సెంటర్ ప్రయోజనాలేంటో తెలిసేలా అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రానికి వచ్చిన ఈ భారీ పెట్టుబడి తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని సీఎం సంతోషం వ్యక్తం చేశారు. ‘30 ఏళ్ల క్రితం ఐటీని ప్రోత్సహించినప్పుడు నాడు సమాజంలో ఆ రంగంపై ఇంత అవగాహన, చర్చ, పోటీ లేదు. కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి ఉన్న అవకాశాలను నాడు ఊహించి ప్రణాళికలు అమలు చేశాం. దీనికోసం అనేక విమర్శలను కూడా ఎదుర్కొన్నాం. నాడు ముఖ్యమంత్రులు కంపెనీల కోసం విదేశాలకు వెళ్లి పెట్టుబడులు ఆకర్షించిన సందర్భాలు లేవు. అయితే విదేశాల్లో తిరిగి, దావోస్ పెట్టుబడుల సదస్సులకు వెళ్లి పరిశ్రమలు తెచ్చేందుకు పయత్నాలు చేశాం. అనేక ప్రయత్నాలతోనే హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ సహా అనేక కంపెనీలను తెచ్చి ఐటీకి పునాది వేశాం. నాడు మైక్రోసాఫ్ట్ రాకతో హైదరాబాద్ ముఖచిత్రాన్ని మార్చేసింది. అనేక కంపెనీలు రావడానికి నాడు మైక్రోసాఫ్ట్ కారణం అయ్యింది. నేడు విశాఖకు వస్తున్న గూగుల్ ఏఐ డాటా సెంటర్ పెట్టుబడి కూడా అంతే ప్రభావాన్ని చూపుతుంది. విశాఖను ఐటీ హబ్‌గా చేసేందుకు మనం చేస్తున్న ప్రయత్నాల్లో ఇదో పెద్ద ముందడుగు” అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.