– హెలికాప్టర్ ద్వారా గణపతి నిమజ్జనం పరిశీలించిన మంత్రి తలసాని, మహమూద్ అలీ
– బోటింగ్ చేసి పోలీసీలకు సూచనలు
– అసోం సీఎం అనవసర వివాదం చేశారన్న తలసాని
తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని పండుగలను ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహిస్తూ వస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. శుక్రవారం గణేష్ నిమజ్జనం సందర్భంగా పలు ప్రాంతాలలో పర్యటించి గణేష్ నిమజ్జనాన్ని పర్యవేక్షించారు.
ముందుగా ఖైరతాబాద్ గణేష్ మండపానికి చేరుకొని పూజలు నిర్వహించిన అనంతరం శోభాయాత్రను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం బాలాపూర్ గణేష్ మండపం వద్దకు చేరుకొని లడ్డు వేలంపాటను తిలకించారు. అక్కడి నుండి చార్మినార్, మోజం జాహి మార్కెట్ వద్దకు చేరుకొని నిమజ్జనానికి వెళుతున్న వినాయక విగ్రహాలకు స్వాగతం పలికారు. తదనంతరం ట్యాంక్ బండ్ వద్దకు చేరుకొని హుస్సేన్ సాగర్ లో మేయర్ విజయలక్ష్మి తో కలిసి బోట్ లో తిరుగుతూ గణేష్ నిమజ్జనాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించే విధంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. గణేష్ నవరాత్రును ఘనంగా నిర్వహించేందుకు ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ప్రశాంత వాతావరణంలో గణేష్ శోభాయాత్ర, నిమజ్జనం జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.
భారీ పోలీసు బందోబస్తు ను ఏర్పాటు చేసి శాంతి భద్రతలను పర్యవేక్షించినట్లు వివరించారు. హైదరాబాద్ లో నిర్వహించే గణేష్ ఉత్సవాలకు దేశంలోనే ఒక ప్రత్యేకత ఉందని పేర్కొన్నారు. దేశంలోనే అతిపెద్ద వినాయకుడు ఖైరతాబాద్ గణనాధుడు అని, ఆయనను దర్శించుకొనేందుకు రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా తగిన ఏర్పాట్లు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. నిర్వాహకులను అయోమయానికి గురిచేసేలా కొందరు ఏర్పాట్లపై తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేశారని విమర్శించారు.
2014 కు ముందు ఎప్పుడు కూడా ఇలాంటి ఏర్పాట్లు చేయలేదని అన్నారు. ప్రజలు, నిర్వాహకులు ఎంతో గొప్పగా వినాయక నవరాత్రులను భక్తి శ్రద్దలతో నిర్వహించుకున్నారని చెప్పారు. శోభాయాత్ర నిర్వహించేఅన్ని రహదారులలో ప్రభుత్వం ఆధ్వర్యంలో స్టేజీ లను ఏర్పాటు చేయడంతో పాటు వాటర్ వర్క్స్ ఆధ్వర్యంలో త్రాగునీటిని అందుబాటులో ఉంచడం జరిగిందని చెప్పారు.
ఏరియల్ వ్యూ ద్వారా నిమజ్జనం పరిశీలన
నగరంలో జరుగుతున్న గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, DGP మహేందర్ రెడ్డి, అడిషనల్ DG జితేందర్, CP CV ఆనంద్ లతో కలిసి ఏరియల్ వ్యూ ద్వారా వీక్షించారు. బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి హెలికాప్టర్ లో బయలు దేరి ట్యాంక్ బండ్, చార్మినార్ తదితర ప్రాంతాలలో నిమజ్జనాన్ని పరిశీలించారు.