నాకు మంత్రి పదవి వద్దన్నా.. మరొకరికి ఇవ్వండి!

– నేను మీకు హన్మంతుడిని
– పదవులు కాదు.. పార్టీ ముఖ్యం
– చెవిరెడ్డి విజ్ఞప్తికి ఆశ్యర్యపోయిన జగన్

అంతా మంత్రిపదవులపై ఆశ పెట్టుకుని అవి రాక అలకపూనితే.. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాత్రం ‘‘అన్నా నీ ఇబ్బందులు, సమీకరణల సమస్యలు నాకు తెలుసు. నాకు మంత్రి పదవి ఇవ్వకపోయినా ఫర్వాలేదు. నిన్ను ఇబ్బంది పెట్టదలచుకోలేదు. మరొకరికి ఇవ్వండి. నేను మీకు హన్మంతుడిని. నాకు పదవి కాదు. పార్టీ ముఖ్యం. మళ్లీ మనే అధికారంలోకి రావాలి. మీరే సీఎం కావాల’ని కోరారు. ఎమ్మెల్యేలంతా పదవుల కోసం అనేక మార్గాల్లో తనపై ఒత్తిడి తెస్తుంటే, చెవిరెడ్డి మాత్రం నాకు పదవి వద్దని కోరడం విన్న జగన్ ఆయన కోరిక విని కాసింత ఆశ్చర్యపోయారు. బహుశా అందుకే ఆయన విశ్వాసానికి ముగ్ధుడయిన జగన్, చెవిరెడ్డికి మరోసారి తుడా చైర్మన్ పదవి పొడిగించినట్లున్నారు.

మొదటి సారి ఎమ్మెల్యే అయిన వారు సైతం ‘ నాకు మంత్రి… నాకు మంత్రి పదవి ’ అంటుంటే, తాను మాత్రం నమ్ముకున్న నాయకుడు ఇసుమంతైనా నొచ్చుకోకూడదని, తనకు రాజకీయ నీడనిస్తున్న పార్టీ అధికారంలోకి రావడం, తమ నాయకుడు మరోమారు ముఖ్యమంత్రి కావడమే లక్ష్యమని విశ్వాసాన్ని ప్రదర్శించిన వ్యక్తి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.

ఆయనకు గత 34 యేళ్ళు తన 16 యేళ్ళ వయస్సు నుంచే ఆ కుటుంబంతో అనుబంధం… మూడు దశాబ్దాలుగా మూడు తరాలతో శిష్యరికం. తాత నుండి మనవడి వరకూ ఆ కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడు. ఆ కుటుంబంలో ఒకడిగా మెలిగి. ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరితో సాన్నిహిత్యం కలిగిన వ్యక్తి.

ఆ కుటుంబంపై ఈగ వాలనివ్వడు. అవసరమైతే ఎలాంటి పోరాటికైనా సిద్ధమవుతాడు. ఆ కుటుంబం కోసం చేసిన పోరాటాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వందాలాది కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి..

పార్టీ కోసం తన నాయకుడి కోసం రాష్ట్రంలోని చాలా జైళ్ళలో మగ్గినవాడు. పార్టీ క్యాడర్‌ను కాపాడుకోవడానికి ఆనాటి అధికార పార్టీల దౌర్జన్యాలను అడగడుగునా ఎదుర్కొన్న వాడు.

పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నవాడు. నాటి కేసులలో నేటికి కోర్టుల చుట్టూ తిరుగుతున్న వాడు.

జగన్మోహన్ రెడ్డి కోసం… ఆయన పెట్టిన పార్టీ కోసం రాష్ట్రమంతా కలియ తిరిగి. కనిపించిన గోడపైనా… కరెంటు స్థంభంపైనా.. ‘ జగన్ నాయకత్వం వర్థిల్లాలం’టూ నినదించిన వ్యక్తి.

తన నియోజకవర్గంలో జగన్ పాదయాత్రను పండుగను తలపించేలా చేసిన వ్యక్తి. నాయకుడి కోసం నూతన సంవత్సరమైన, సంక్రాతి అయినా, ఉగాది పండగైనా, తాను నమ్మకున్న నాయకుడి పుట్టినరోజునైనా.. పత్రికలలో శుభాకాంక్షలే కాదు, రాష్ట్రవ్యాప్తంగా నూతన వస్త్రాలు, మిఠాయిలు పంచుతూ తన విశ్వాసాన్ని చాటుకున్నవాడు.

వైఎస్ ఫ్యామిలీ తప్ప ఆయనకు మరో పార్టీ తెలియదు…. ఇంకో నాయకుడూ తెలియదు. రాముడికి ఆంజనేయడు ఎంతటి భక్తుడో… ఆ కుటుంబానికి చెవిరెడ్డి అంతటి భక్తుడు… అదీ ఇదీ రెండూ జగమెరిగిన సత్యాలు.

మంత్రివర్గ విస్తరణకు సమయం వచ్చింది. రాష్ట్రంలోని ప్రతి ఎమ్మెల్యే కూడా మంత్రి వర్గంలో చోటు కోసం సకల ప్రయత్నాలు చేస్తున్నారు. చెవిరెడ్డి భాస్కర రెడ్డి పార్టీ పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తి. కార్యకర్తల కోసం రాష్ట్రమంతటా తిరిగిన వ్యక్తి. మంచి చదువుసంధ్యలు కలిగిన వ్యక్తి. మహానేత వైఎస్సార్ పాలనపై పిహెచ్డీ చేసి డాక్టరేట్ పొందిన వ్యక్తి. కార్యదక్షత కలిగిన వాడు. అంతకు మించి పార్టీ విశ్వాసం. నాయకుని నమ్మకం చూరగొన్న వాడు… మంత్రి పదవి ఆశించడానికి అంతటకంటే హక్కు, అర్హతలు ఏముంటాయి?.

అయినా సరే తాను నమ్మకున్న పార్టీ, తాను ఆరాధించే నాయకుడిని ఇబ్బంది కలిగించే ఏ ఒక్క పనిని చేయకూడదని, చేయరాదని చెవిరెడ్డి బలంగా భావించాడు. తమ నాయకుడు తనకు మంత్రి పదవి ఇవ్వాలని అనుకుంటున్నారని తెలిసి చెవిరెడ్డి నేరుగా తన నాయకుడు వద్దకు వెళ్ళాడు.

ఇలాంటి సమయంలో ‘అన్నా నేను కూడా మీకు ఇబ్బంది కలిగించరాదు. అత్యధికంగా 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న సమయంలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. మీ రాజకీయ సమీకరణలు మీకుంటాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అత్యధిక మంత్రి పదవులు ఇవ్వాలనే మీ ఆశయం నాకు తెలుసు. ఈ సమయంలో మేమందరం మీకు సహకరించాలి. ఆ విషయం ఎరిగిన వాడిగా అర్థం చేసుకోగలను. మీరే మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. వచ్చే ఎన్నికలలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి, మిమ్మల్ని మళ్ళీ ముఖ్యమంత్రి పీఠంపై అధిష్టింపజేయడానికి పార్టీ కోసం హనుమంతుడిలా పని చేస్తాను. నాకు మీరు ముఖ్యం, పార్టీ ముఖ్యం. మంత్రి పదవి కాదు. నా బదలు మంత్రి పదవిని ఇంకొకరి ఇచ్చినట్లైతే ఇంకొకరు సంతోషపడతారు. మంత్రి పదవి ఉంటే ఎంత చేయగలనో.. మంత్రి పదవి లేకపోయినా అంతకంటే ఎక్కువగా మీరు మంత్రి పదవి ఇచ్చిన వారితో కలసి సంతృప్తిగా పని చేస్తానన్నా…. ’ అంటూ ఆ కుటుంబం పట్ల ఎమ్మెల్యే చెవిరెడ్డి మరోమారు తన విశ్వాసాన్ని చాటుకున్నారు.

వైఎస్ కుటుంబం, జగన్మోహన్ రెడ్డి పట్ల చెవిరెడ్డికి ఉన్న విశ్వాసాన్ని చూసి ముఖ్యమంత్రితో సహా అక్కడున్న వారంత ఆశ్చర్యపోయారు. తమ నాయకుడి కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడ్డ చెవిరెడ్డిని అందరూ అభినందించారు.

Leave a Reply