– అయినా కేసీఆర్ ప్రోత్సాహంతో పోటీ చేశా
– ఇప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్‌కు 100 సీట్లు
– మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
మహబూబాబాద్: శాసనసభ ఎన్నికల్లో ఓడిపోతానని తనకు ఆరు నెలల ముందే తెలుసని కానీ కేసీఆర్ ప్రోత్సాహంతో పోటీ చేసినట్లు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకరరావు చెప్పారు. ముఖ్యమంత్రి సోదరులు, ఎమ్మెల్యేలు, మంత్రులు రాష్ట్రంలో అవినీతికి పాల్పడుతున్నారని ఎర్రబెల్లి అన్నారు.
రాహుల్ గాంధీ గత ఆరు నెలలుగా రేవంత్ రెడ్డికి అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ పనితీరుపై వాకబు చేయడానికి ఇటీవల వరంగల్‌కు రావడానికి రాహుల్ గాంధీ ప్రయత్నించారని, కానీ తన నిజస్వరూపం బయటపడుతుందని ముఖ్యమంత్రి ఢిల్లీ పెద్దలతో మాట్లాడి ఆయన పర్యటనను రద్దు చేయించారని దయాకరరావు ఆరోపించారు.
కేసీఆర్ తెలంగాణను పదేళ్లు దార్శనికతతో పాలించారని, కాంగ్రెస్ పదిహేను నెలల్లో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దివాలా తీయించిందని విమర్శించారు. ఇప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్‌కు 100 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమయ్యారని వ్యాఖ్యానించారు. ఓటమి భయంతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించడం లేదని అన్నారు.